iDreamPost
android-app
ios-app

అఖండ దీపం కొండెక్కిందా?తిరుమల మీద ఎందుకు ఈ దుష్ప్రచారం?

  • Published Mar 30, 2020 | 6:26 PM Updated Updated Mar 30, 2020 | 6:26 PM
అఖండ దీపం కొండెక్కిందా?తిరుమల మీద ఎందుకు ఈ దుష్ప్రచారం?

ప్రపంచంలోనే అత్యధికంగా భక్తులు వచ్చే దేవాలయాల్లో తిరుమల ఒకటి. అనునిత్యం శ్రీవారిని లక్ష మంది వరకు భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు.

ప్రస్తుతం ప్రపంచంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు . ఈ కారణంతో తిరుమలతో పాటు అన్ని ప్రముఖ దేవాలయాల్లో భక్తులకు దర్శనం ఇతర సేవలన్నీ నిలిపేశారు కానీ అనునిత్యం ఆయా క్షేత్రాల్లోని దేవుళ్ళకి గతంలో జరిగే పూజలు యధావిధిగా కొనసాగిస్తున్నారు . అలాగే తిరుమలలో కూడా స్వామివారికి జరిగే పూజా కార్యక్రమాలు , సేవలు , కైంకర్యాలు పూర్వంలాగే పూజారులు కొనసాగిస్తున్నారు .

దురదృష్టవశాత్తు తిరుమల క్షేత్రం గురించి మాత్రం ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి .. శ్రీవారి అఖండ జ్యోతి ఆరిపోయిందని , నిత్య సేవలు జరగట్లేదని పలు పుకార్లు వ్యాపిస్తున్నాయి .

శ్రీవారి అఖండ జ్యోతి ఆరిపోయిందనే వార్తల్లో నిజం లేదని పెద్ద జీయర్ స్వామి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా దుష్ప్రచారం మాత్రమేనని మండిపడ్డారు. భక్తులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.తిరుమల లోని వారి మఠం నుండి మీడియాతో మాట్లాడుతూ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు కైంకర్యాలు అన్నీ రామానుజాచార్యులు నిర్దేశించిన విధంగానే జరుగుతున్నాయన్నారు. స్వామివారికి నైవేద్యం కూడా యధావిధిగా జరుగుతోందని తెలిపారు. వసంతోత్సవాలు కూడా ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఆగమోక్తంగా జరుగుతున్నాయి అని తెలిపారు .త్వరలో తిరుమల ఆలయం గోవింద నామస్మరణతో మారు మోగుతోందని భక్తులందరూ స్వామివారిని దర్శించుకుని పునీతులవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

చాలా మందికి ఇంటి దగ్గరే ఉండి పనిచేసే అవకాశం కల్పించటంతో దీని ప్రభావం తిరుమల ఆలయం పై కూడా పడింది.. తిరుమలలో భక్తులకు స్వామివారి దర్శనం నిలిపేశారు. కరోనా వ్యాపిస్తున్న తరుణంలో టిటిడి ఆలయంలోకి భక్తుల అనుమతిని రద్దు చేస్తున్నట్టు ప్రకటిoచినప్పటికి దేవాలయంలో జరిగే సేవలన్నింటిని ఏకాంతంగా జరుగుతాయని టిటిడి అధికారులు చెప్తున్నారు. అలాగే టీటీడీ చైర్మన్ ఆదేశానుసారం ప్రతిరోజు ఒక బోర్డ్ మెంబర్ స్వయంగా దగ్గరుండి అన్ని సేవలను , మిగతా కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని సమాచారం .

ఇప్పుడే కాదు గత తొమ్మిది నెలల కాలంలో శ్రీవారి ఆలయం గురించి , సంబంధిత వ్యక్తులు కార్యాలయాల గురించి పలు పుకార్లు పుట్టించి ప్రజల్లో అపోహలు కలుగజేసిన సందర్భాలు చాలా ఉన్నాయి .

తొలుత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి అన్యమతస్తుడని ప్రచారం చేశారు . అది అసత్యమని వారు నిత్యం శ్రీవారిని సేవించడంతో పాటు గో సంరక్షకుడని వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

తరువాత తిరుమల కొండ పైన శిలువ ఏర్పాటు చేసి అన్యమత ప్రచారం చేస్తున్నారని దుష్ప్రచారం జరిగింది . అది అసత్యమని అక్కడ ఉన్నది శిలువ కాదని సోలార్ స్ట్రీట్ లైట్ ఫోటోతో అలా ప్రచారం చేశారని తేలడంతో పాటు ఈ దుష్ప్రచారానికి పాల్పడిన వ్యక్తుల మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం కూడా జరిగింది.

 తిరుమల నుండి కొండ పైకి వెళ్లే బస్సుల్లో టికెట్స్ పై అన్యమత ముద్రణలు ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి . అయితే విచారణలో అవి గత ప్రభుత్వంలో ముద్రించారని తెలియటం ఆ టికెట్స్ ఆపి మరలా కొత్త టికెట్స్ జారీ చేయడం జరిగింది .

కొన్ని దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం . కాలం ఏదైనా , పాలకులు ఎవరైనా వాటితో సంభందం లేకుండా తరతరాలుగా శ్రీవారి పూజలు , సేవలు , కైంకర్యాలు నిర్వహించే పూజారి పరంపర అత్యంత భక్తిశ్రద్ధలతో ఏ లోటూ లేకుండా కొలుస్తుంటారు . సుప్రభాతం నుండి పవళింపు సేవ వరకూ ఏ సేవలోనూ ఏ చిన్నపాటి లోపం లేకుండా శాస్త్రోక్తంగా నిర్వహించే శ్రీవారి సేవకులకు ఇలాంటి పుకార్లు అత్యంత మనస్తాపం కలిగిస్తాయి అనటంలో సందేహం లేదు.

ఇలాంటి పుకార్లు వచ్చిన ప్రతిసారీ అవి అబద్ధమని నిరూపితం కావడమే కాక బీజేపీ ఎంపీ సుభ్రమణ్యస్వామి కూడా స్వామి వారిని దర్శించుకున్న సందర్భంలో ఈ పుకార్ల గురించి విచారించి అవన్నీ అసత్యాలు అని గిట్టనివారు పుట్టించిన పుకార్లు అని తేల్చిచెప్పారు.

టీటీడీ మీద దుష్పచారాలను భక్తులు నమ్మరు కానీ మీడియాలో జరుగుతున్న చర్చ వారిని బాధపెడుతోంది.