iDreamPost
android-app
ios-app

మేకపాటి రాజకీయ ఘనాపాటి

  • Published Jun 11, 2020 | 1:58 PM Updated Updated Jun 11, 2020 | 1:58 PM
మేకపాటి రాజకీయ ఘనాపాటి

సామాన్య మధ్యతరగతి నుండి వచ్చి స్వశక్తితో అంచలంచలుగా ఎదిగి పారిశ్రామికవేత్తగా , రాజకీయ నేతగా ప్రజల మన్ననలు పొందిన అతి కొద్దిమంది నాయకుల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. 1944లో నెల్లూరు జిల్లా బ్రాహ్మణ పల్లిలో జన్మించిన ఆయన ప్రాధమిక విధ్యను బుచ్చిరెడ్డి పాలెంలో అభ్యసించి ఇంజినీరింగ్ విద్యను వరంగల్ లో పూర్తి చేసుకున్నారు.

విద్యాభ్యాసం పూర్తి చేసిన తరువాత రాజమోహన్ రెడ్డి తన క్లాస్ మేట్ బొల్లినేని కృష్ణయ్య తో కలిసి ఇరువురి పేర్లు కలిసేలా KMC (కృష్ణ మోహన్ కంస్ట్రక్షన్స్ ) స్థాపించి వ్యాపార రంగంలో అంచలంచలుగా ఎదిగారు. ఇలా స్వశక్తితో ఎదిగిన ఇరువురు, ఒకదశకు చేరుకున్నాక వ్యాపారాన్ని మరింత అభివృద్ది చేసుకునే భాగంలో ఒకరికిఒకరు స్నేహపూర్వకంగా విడిపోయిన తరుణంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి గారికి తన భాగంగా కే.యం.సి కన్ష్ట్రక్షన్స్ రాగా , నికర ఆస్తులతో బొల్లినేని కృష్ణయ్య KMC నుండి బయటికి వచ్చి శీనయ్య కంపెనీని స్థాపించారు.

మేకపాటి రాజకీయ ఆరంగేట్రం

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత జరిగిన 1983 ఎన్నికల్లో నేదురుమల్లి జనార్ధన రెడ్డి ఆశీస్సులతో కాంగ్రెస్ తరుపున ఉదయగిరి టికెటు సంపాదించిన మేకపాటి రాజమోహన్ రెడ్డి బీజేపీ అభ్యర్ది అయిన వెంకయ్య నాయుడు చేతిలో ఓటమి పాలయ్యారు. వెంకయ్య నాయుడు 1978 ఎన్నికల్లో ఉదయగిరి నుండి జనతా పార్టీ అభ్యర్ధిగా గెలిచి ఉన్నారు.

వెంకయ్యనాయుడు స్వగ్రామం నెల్లూరు నగరానికి సమీపంలోని వెంకటాచలం మండలం మంగళికుంట(గత సంవత్సరం ఊరిపేరును రామాపురంగా మార్చారు). 2009 ఎన్నికల ముందు వరకు రాపూరు నియోజకవర్గంలో,2009 నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందీ గ్రామం . వెంకయ్యనాయుడు సొంత నియోజకవర్గాన్ని వదిలి నెల్లూరు,కడప మరియు ప్రకాశం జిల్లాలతో సరిహద్దు ఉన్న ఉదయగిరిని ఎంచుకోవడానికి ముఖ్యకారణం 1977 లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఉండటం, అప్పట్లో ఉదయగిరి నియోజక వర్గం ఒంగోలు లోక్ సభ పరిధిలో ఉండేది. దానితోపాటు అదే ప్రాంతంలో అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన “దానేకుల నర్సింహం”లాంటి సీనియర్ రాజకీయ నాయకుల ఆశీస్సులు మెండుగా ఉండటంతో వెంకయ్యనాయుడు ఉదయగిరి నుంచి పోటీచేసి గెలిచారు. ఆ ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఇందిరా కాంగ్రెస్ ఓడిపోయిన ఏకైక సీటు ఉదయగిరి కావటం గమనార్హం.

1983 ఎన్నికల్లో ఓడిపోయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి 1985లో అదే ఉదయగిరి నుండి కాంగ్రెస్ పార్టీ తరుపున గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ తరుపున ధనేకుల నరసింహం పోటీచేయగా, వెంకయ్యనాయుడు ఆత్మకూరు నుంచి టీడీపీ మద్దతుతో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు…

పొదిలికి చెందిన కాటూరి నారాయణస్వామి 1983 ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1984 లోక్ సభ ఎన్నికల్లో నరసరావుపేట నుంచి పోటీచేసి మాజీ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని ఓడించి ఆప్రాంతంలో జెయింట్ కిల్లర్ గా పేరు తెచ్చుకున్నారు. అలాంటి కాటూరి నారాయణస్వామిని 1989 లోక్ సభ ఎన్నికల్లో ఒంగోలు నుంచి టీడీపీ పోటీకి దించింది. కాటూరి లాంటి బలమైన నేతను ఓడించాలన్న లక్ష్యంతో మేకపాటి రాజమోహన్ రెడ్డిని కాంగ్రెస్ ఒంగోలు బరిలోకి దించింది. ఆ ఎన్నికల్లో మేకపాటి టీడీపీ అభ్యర్థి కాటూరిని ఓడించి తొలిసారి ఎంపీ అయ్యారు. ఆ ఓటమితో కాటూరి రాజకీయ జీవితం ముగిసింది, మరోసారి పోటీచేసే అవకాశం రాలేదు.

Also Read: రాజకీయ భీష్ముడు N.G.రంగా

మాగుంట రంగప్రవేశం – రాజమోహన్ రెడ్డి కి రాజకీయ ఇబ్బందులు

డిల్లీ లో ఏర్పడ్డ రాజకీయ అనిశ్చితి ,వీపీ సింగ్,చంద్రశేఖర్ ప్రభుత్వాలు కూలిపోవటం వలన 1991లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నెల్లూరుకు చెందిన తెలుగుదేశం మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఆర్ధికంగా బలమైన ,నెల్లూరు రాజకీయాల్లో నేదురుమల్లి వ్యతిరేక వర్గానికి చెందిన డేగా నర్సింహా రెడ్డిని బరిలోకి తీసుకురావడంతో కాంగ్రెస్ పార్టీ రాజమోహన్ రెడ్డి గారి అభ్యర్ధిత్వం పై పునరాలోచనలో పడింది. ఆర్ధికంగా తెలుగుదేశం అభ్యర్ధి డేగా నర్సింహా రెడ్డిని “ఢీ” కొట్టగల నాయకుడి కోసం వెతికింది. దరిమిలా నేదురుమల్లి సూచనతో రాజీవ్ గాంధీ స్వయంగా మాగుంట సుబ్బరామి రెడ్డితో మాట్లాడి బరిలోకి దింపింది. డేగా నర్సింహా రెడ్డి ప్రచారం,చేస్తున్న ఖర్చు చూసి అయన గెలుస్తాడని పత్రికలు అంచనా వేసాయి.కానీ ఆ ఎన్నికల్లో మాగుంట సుబ్బరామిరెడ్డి గెలిచి మాగుంట కుటుంబ రాజకీయాలకు పునాది వేశారు.

రాజీవ్ గాంధీ హత్య అనంతరం ప్రధాని అయిన పి.వీ నర్సింహా రావు ఏఐసీసీ ప్లీనరీని స్వరాష్ట్రంలో జరపాలని తద్వారా ఢిల్లీ స్థాయిలో కాంగ్రెసులో ఉన్న ఇతర వర్గాలకు తన బలాన్ని చూపించాలని భావించారు. ఆ ప్లీనరీని తిరుపతిలో నిర్వహించాలని నిర్ణయించి, బాధ్యత మాగుంట సుబ్బరామిరెడ్డికి అప్పగించారు. ఆ ప్లీనరీ నభూతో న భవిషత్ అన్న స్థాయిలో జరిగింది. 1991లో సిట్టింగు టికెట్టు ఇప్పించలేదు అనే భావనతో నేదురుమల్లికి దూరంగా జరిగిన రాజమోహన్ రెడ్డి మాగుంటకు కూడా అంతే దూరం పాటించడంతో కాంగ్రెస్ లో ఏకాకిగా మారారు.

మాగుంట హత్య – తెలుగుదేశంలో చేరిన రాజమోహన్ రెడ్డి

1995 డిసెంబర్ లో నక్సల్స్ దాడిలో మాగుంట సుబ్భిరామిరెడ్డి చనిపోయారు. 1996లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ సీటు ఆశించిన రాజమోహన్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ నిరాకరించి మాగుంట శ్రీమతి మాగుంట పార్వతమ్మకు ఆ సీటు ఇవ్వటంతో రాజమోహన్ రెడ్డి చంద్రబాబు ఆహ్వానం మేరకు తెలుగుదేశం పార్టీలో చేరి ఒంగోలు తెలుగుదేశం పార్లమెంటు అభ్యర్ధిగా పోటీ చేశారు. అయితే మాగుంట పార్వతమ్మ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read: రోజురోజుకు పడిపోతున్న చంద్రబాబు గ్రాఫ్

మేకపాటి కాంగ్రెస్ పునఃప్రవేశం

1998లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో కూడా రాజమోహన్ రెడ్డి పార్వతమ్మ చేతిలో ఓటమి పాలవ్వడంతో 1999లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో చంద్రబాబు రెండుసార్లు ఓటమి పాలయ్యిన మేకపాటికి టికెట్టు నిరాకరించి కరణం బలరాం కు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు.

దీనితో మేకపాటి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి సహకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరి తన తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డికి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ సాధించుకున్నారు కానీ ఆయన ఓడిపోయారు.

1999 ఎన్నికల్లో లో నర్సరావు పేట పార్లమెంటు స్థానంలో గెలిచిన నేదురుమల్లి జనార్ధన రెడ్డి 2004లో విశాఖపట్నంకు మారటంతో నర్సరావు పేట స్థానాన్ని వై.యస్ రాజశేఖర రెడ్డి మేకపాటికి రాజమోహన్ రెడ్డికి కేటాయించారు. మేకపాటి కి చెందిన KMC సంస్థ నార్కట్ పల్లి – అద్దంకి హైవే పనులు చేసింది. కృష్ణ నది మీద పొందుగుల వద్ద నిర్మాణదశలో ఉన్న బ్రిడ్జి తుఫానుకు కూలింది.దాని మీద మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ విపరీతమైన ఆరోపణలు చేసి KMC సంస్థకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారు. ఒక దశలో మాటా మాట పెరిగి “నీకు ఓటమి రుచి చూపిస్తానని” మేకపాటి కోడెలకు సవాల్ విసిరారు.

నార్కట్ పల్లి – అద్దంకి హైవే నర్సరావు పేట పార్లమెంటు పరిధిలోని అనేక శాసనసభ నియోజకవర్గాలలో విస్తరించి ఉంది. ఆ రహదారి పనులలో అనేక మంది KMC వద్ద సబ్ కాంట్రాక్ట్ లు చేసియున్నారు ..దీనితో రాజమోహన్ రెడ్డికి ప్రజలతో,నాయకులతో వ్యక్తిగత సంబంధాలు ఏర్పడటంతో ఎన్నికల్లో విజయం సాధించి నర్సరావు పేట శాసనసభలో కోడెల ఓటమికి రుచి చూపించారు,అది కోడెలకు తొలి ఓటమి.. అక్కడి నుంచి చంద్రబాబు వద్ద కోడెల పరపతి తగ్గటం మొదలైంది.

2009 నియోజకవర్గాల పునఃవిభజనలో నెల్లూరు లోక్ సభ స్థానం జనరల్ కావటంతో మేకపాటి నెల్లూరు నుంచి పోటీచేసి గెలిచారు. .

Also Read: జగన్‌ నాకు దేవుడు.. మత్తు డాక్టర్‌ సుధాకర్

జగన్ కు అండగా నిబడిన తొలి నేత గా గుర్తింపు

2009లో వై.యస్ మరణానంతరం కాంగ్రెస్ తో వచ్చిన విభేదాలతో బయటికి వచ్చిన జగన్ కు అండగా నిలబడిన మొదటి అతికొద్దిమంది నేతల్లో రాజమోహన్ రెడ్డి ఒకరు. 2012లో కాంగ్రెస్ పార్టీ సి.బి.ఐ ని అడ్డుపెట్టుకుని వై.యస్ పేరును చులకన చేయాలనే భావంతో చనిపోయిన వ్యక్తి పేరుని చార్జ్ షీట్ లో చేర్చడానికి నిరసనగా తన పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసి, తిరిగి జగన్ స్థాపించిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి అత్యధిక మెజార్టీతో గెలిచి తిరిగి పార్లమెంటు లో అడుగుపెట్టారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకి నిరసనగా రాజీనామా చేసిన రాజమోహన్ రెడ్డి, 2014 ఎన్నికల్లో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి తిరిగి నెల్లూరు స్థానం నుండి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో తన వారసుడిగా మేకపాటి గౌతం రెడ్డిని ప్రకటిస్తూ రాజమోహన్ రెడ్డి ప్రత్యక్ష ఎన్నికల నుండి తప్పుకున్నారు.

2019 ఎన్నికల్లో ఆత్మకూరు బరిలో దిగిన మేకపాటి గౌతం కు తెలుగుదేశం పార్టీ తరుపున ప్రత్యర్ధిగా మేకపాటి రాజమోహన్ రెడ్డి చిన్ననాటి మిత్రుడైన బొల్లినేని కృష్ణయ్య కావడం గమనార్హం.

రాజకీయంగా , వ్యాపారంగా అనేక సవాళ్లను ఎదుర్కొంటూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటు ఒక ముద్రను ఏర్పర్చుకున్న అతి కొద్ది మంది నేతల్లో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఒకరు. నేడు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి 76వ జన్మదినం సందర్భంగా అయనకు శుభకాంక్షలు తెలియచేస్తూ ..