Idream media
Idream media
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివాసాన్ని ముఖ్యమంత్రి కార్యాలయంగానూ మార్చాలని మద్రాస్ హైకోర్టు సూచించింది. ఎఐడిఎంకె మాతృస్వామ్య అధినేత్రి జయలలిత నివాసమైన పోయెస్ గార్డెన్ ప్రాపర్టీని ‘వేద నిలయం’ స్మారక చిహ్నంగా చెయ్యడం వల్ల రాష్ట్ర ఖజానాకు ఖర్చు అవుతుంది.కావున ఈ కోర్టు చేసిన సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలని మద్రాస్ హైకోర్ట్ వ్యాఖ్యానించింది.అలాగే ఆమె ఆస్తులకు వారసులుగా ఆమె మేనల్లుడు జే.దీపక్, మేనకోడలు జే.దీపను హైకోర్టు ప్రకటించింది.
గత వారం తమిళనాడులోని ఎఐడిఎంకె ప్రభుత్వం జయలలిత నివాసమైన ” పోయెస్ గార్డెన్” ను తాత్కాలికంగా స్వాధీనం చేసుకోవటానికి ఆర్డినెన్స్‌ను జారీ చేసింది. దీనిపై అభ్యంతరం తెలుపుతూ మాజీ సీఎం జయలలిత మేనకోడలు, మేనల్లుడు తమ మేనత్త వదిలిపెట్టిన ఆస్తులను నిర్వహించడానికి తమకు లెటర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మంజూరు చేయాలని మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో దివంగత జయలలిత ఆస్తుల వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు జడ్జిలు జస్టిస్ ఎన్.కిరుబకరణ్,జస్టిస్ అబ్దుల్ ఖుద్దోస్‌లతో కూడిన బెంచ్ ఆమె ఆస్తులకు జే.దీపక్,జే.దీప లను వారసులుగా పేర్కొంది.
చెన్నైలో ఉన్న జయలలిత నివాసం ‘పోయెస్ గార్డెన్’ లో కొంత భాగాన్ని ఆమె స్మారక చిహ్నంగాను, మరికొంత భాగాన్ని (వేద నిలయం) ముఖ్యమంత్రి కార్యాలయంగానూ మార్చాలని హైకోర్టు సూచించింది. తమ సూచనలపై సమాధానం ఇవ్వటానికి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టు ఎనిమిది వారాల గడువు ఇచ్చింది. మాజీ సీఎం జయలలిత ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ముందు ఆమె యొక్క చట్టపరమైన చట్టబద్ధ వారసుల వాదనలను ప్రభుత్వం వినాలని, అలాగే పరిహారం చెల్లించాలని కూడా న్యాయమూర్తులు సూచించారు.దీపక్, దీపా జయకుమార్ జయలలిత యొక్క క్లాస్ 2 చట్టబద్ధ వారసులని,ఆ భవన పరిపాలన బాధ్యతలు చూసే అర్హత ఉత్తర్వులు పొందడానికి హక్కు ఉందని కోర్టు అభిప్రాయ పడింది.