iDreamPost
android-app
ios-app

ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ ఖరారు… లాక్ డౌన్ కొనసాగుతుందా..?సడలింపులు ఉంటాయా..?

ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ ఖరారు… లాక్ డౌన్  కొనసాగుతుందా..?సడలింపులు ఉంటాయా..?

దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 27వ తేదీన భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరోమారు ముఖ్యమంత్రులతో మాట్లాడనున్నారు. వచ్చే నెల 3వ తేదీన లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యమంత్రులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. కరోనా వైరస్ నియంత్రణ చర్యలు, లాక్ డౌన్ అమలుపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రులతో ప్రధాని చర్చించనున్నారు. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటికీ బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 3వ తేదీన తర్వాత కూడా లాక్ డౌన్ కొనసాగుతుందా..? లేదా దశలవారీగా ఎత్తివేస్తారా..? అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వేళ కొనసాగిస్తే.. ప్రజా సంక్షేమం కోసం ఏ విధమైన చర్యలు తీసుకుంటారు అనే అంశంపై దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది.

కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అంతకు ముందు రెండు రోజుల క్రితం 22వ తేదీన జనతా కర్ఫ్యూ పాటించారు. తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలు ఆ మరుసటి రోజు నుంచే లాక్ డౌన్ విధించుకున్నాయి. లాక్ డౌన్ కొనసాగేలా..? లేదా.. అనే అంశంపై ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. వైరస్ నియంత్రణ లోకి రాకపోవడంతో ఈ సమావేశంలో మెజారిటీ ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పొడిగించాలని డిమాండ్ తెరపైకి తీసుకు రావడంతో వారి అభిప్రాయాల మేరకు మే 3 వరకు పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్ 14వ తేదీన ప్రకటించారు. ఈనెల 20వ తేదీ నుంచి కరోనా వైరస్ ప్రభావం లేని ప్రాంతాలలో లాక్ డౌన్ నుంచి కొన్ని అంశాలకు కేంద్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. అయితే కొన్ని రాష్ట్రాలు కరోనా వైరస్ ను కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఆయా సడలింపులను అమలు చేయలేదు.

సరైన సమయంలో దేశంలో లాక్ డౌన్ విధించడంతో వైరస్ వ్యాప్తిని ఇతర దేశాలతో పోలిస్తే సమర్థవంతంగా నియంత్రించగలిగారు. అయినా దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. లాక్ డౌన్ విధించిన సమయంలో 300 కేసులు ఉండగా.. 28 రోజుల్లో ఆ సంఖ్య 21 వేలు దాటింది. ప్రస్తుతం ప్రతి రోజు వెయ్యి కి పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 27వ తేదీన జరిగే ముఖ్యమంత్రుల సమావేశంలో ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్ డౌన్ పై ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు..? కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? అనేదానిపై ఆసక్తి నెలకొంది.

మే 3వ తేదీతో లాక్ డౌన్ విధించి 40 రోజులు అవుతుంది. ఇప్పటికే దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వలస కూలీల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఆర్బిఐ, కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన ప్రకటించిన ఉద్దీపన చర్యలు కంటితుడుపుగానే మిగిలాయి. కరోనా వైరస్ కు టీకా లేదా ఔషధం కనిపెట్టే వరకు ఈ వైరస్ ను నియంత్రించలేమనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ పై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..? కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాటిస్తారా..? లేదా రాష్ట్రాలలో పలు పలు ఆంక్షలు విధిస్తారా..? తదితర ప్రశ్నలకు ఈ నెల 27వ తేదీన సమాధానాలు దొరికే అవకాశం ఉంది.