iDreamPost
android-app
ios-app

మీ ఆస్తుల బాధ్యత మీదే

మీ ఆస్తుల బాధ్యత మీదే

పౌరసత్వ సవరణ చట్టంపై ఈశాన్యలో మొదలైన నిరసనలు ఆపై హింసాత్మకంగా మారి దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరించిన విషయం తెలిసిందే. ఈ నిరసనల్లో నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాధికారులు వాహనాలు.. ఇలా కనిపించిన ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ నిరసనకారుల్ని ఉద్దేశించి బుధవారం ఉత్తరప్రదేశ్‌లో మాట్లాడారు.

నిరసనకారులు చేస్తున్నది తప్పో ఒప్పో ఒక సారి ప్రశాంతంగా ఆలోచన చేయాలని హితవు పలికారు. ప్రభుత్వ ఆస్తులంటే ప్రజాలవేనని, మీ ఆస్తుల రక్షణ బాధ్యత మీదేనంటూ పేర్కొన్నారు.
ప్రశాంతంగా జీవించడం ప్రతి ఒక్కరి హక్కు అని పేర్కొన్న ప్రధాని మోదీ హింస వల్ల దానికి భంగం కలగకూడదన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం సరైన విధానం కాదని హితవు పలికారు. నిరసనకారుల్ని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషి చేస్తున్నారని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.

కాగా, హింసకు పాల్పడేవారిని ఉపేక్షించబోమని ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆధిత్యనాథ్‌ హెచ్చరించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేకూర్చే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన నిరసనల్లో చెలరేగిన హింస వల్ల జరిగిన నష్టం రికవరీకీ 28 మందికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 14.86 లక్షలు చెల్లించాలని పోలీసులు వారికి జారీ చేసిన నోటీసుల్లో పేర్కొన్నారు.