iDreamPost
iDreamPost
మన జనాలకు ఎవరు చెప్పినా ఓ పట్టాన ఎక్కటం లేదు. ఎక్కడ కూడా నలుగురు ఒకచోట గుమిగూడ వద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడి దగ్గర నుండి ముఖ్యమంత్రుల వరకూ అందరూ చెప్పిన మాట ఒకటికి వందసార్లు చెబుతున్నారు. అయినా జనాలు మాట వినటం లేదు. సోషల్ డిస్టెన్సింగ్ తో పాటు లాక్ డౌన్ సంపూర్ణంగా పాటిస్తేనే కొరోనా వైరస్ ను నియంత్రించగలమని ఎవరెంత చెప్పినా జనాలు మాత్రం పట్టించుకోవటం లేదనేందుకు పై ఫొటోనే సాక్ష్యం.
తిరుపతిలోని ఓ రేషన్ షాపు దగ్గర అంతమంది జనాలు ఒకేచోట గుమిగూడి ముచ్చట్లు చెప్పుకుంటున్నారు చూడండి. అంతమంది ఒకే చోట గుమిగూడినపుడు మూతులకు మాస్కులు వేసుకుని మాత్రం ఏమి లాభం ? మొన్నటి జనతా కర్య్ఫ్యూ రోజు సాయంత్రమే ప్రధానమంత్రి తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
కర్ఫ్యూరోజున ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇళ్ళల్లోనే ఉన్న జనాలందరూ సాయంత్రం 5 కగానే ఇండియా ప్రపంచ కప్ క్రికెట్లో కప్ గెలిచిన పద్దతిలో సంబరాలు చేసుకునేందుకు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చేశారు. దాంతో జనతా కర్ఫ్యూ స్పూర్తి దెబ్బతినేసిందని మోడి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం అందరికీ తెలిసిందే.
సరే ఆరోజంటే ఏదో కొత్త కాబట్టి జనాలందరూ సాయంత్రం రోడ్లపైకి వచ్చేశారని అనుకుందాం. మరి ఆ తర్వాత దేశమంతా లాక్ డౌన్ విధించినపుడన్నా జనాలు మాట వినాలలి కదా ? ఇక్కడ సమస్య ఏమిటంటే ఎక్కువమంది లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. అయితే పాటించని కొద్దిమంది వల్లే సమస్య పెరిగిపోతోంది. మరి మన జనాలకు ఎవరు చెబితే వింటారు ? ఎట్టా చెబితే వింటారు ? పోలీసులు లాఠీలను ఝుళిపిస్తుంటే గొడవలవుతున్నాయి. స్వచ్చంధంగా పాటిస్తారా ? అంటే అదీ లేదు. మరి దేశంలో కొరోనా వైరస్ నియంత్రణ ఎలా సాధ్యమబ్బా ?