చంద్రబాబుకు తెలియకుండానే కుప్పంలో వైఎస్సార్‌సీపీ నేత హత్యకు సుఫారి వెళ్లిందా..?

చిత్తూరు జిల్లా కుప్పంకు చెందిన వైఎస్సార్‌సీపీ నేత హత్యకు పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. పీలేరుకు చెందిన రౌడీషీటర్ గణేష్‌కు రూ.10లక్షలు సుపారీ ఇచ్చి వైఎస్సార్‌సీపీ నేత విద్యాసాగర్‌ను హత్య చేయించేందుకు ప్లాన్ చేశారు. అడ్వాన్స్‌గా కొంత డబ్బును చెల్లించారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి ఫోన్ కాల్ ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్.. కుప్పం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.

ఈ హత్యకు కుట్రకు సంబంధించి ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. సుపారీ ఇచ్చింది ఎవరనేదానిపై ఆరా తీస్తున్నారు. విద్యాసాగర్ ఎన్నికలకు ముందు టీడీపీను వీడి వైఎస్సార్‌సీపీలో చేరారు. చంద్రబాబు సొంత నియోజకవర్గంలో 2019 ఎన్నికల వరకు టిడిపిలో ఉండి.. ఎన్నికల ముందు వైఎస్సార్ సిపి లో చేరిన విద్యా సాగర్ ను హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుందనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ ప్లాన్ వెనుక ఎవరున్నారో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు.

విద్యాసాగర్ ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ పడింది. ఎన్నికలకు రెండు నెలల ముందు వైఎస్సార్‌సీపీ అభ్యర్థి చంద్రమౌళి అనారోగ్యం పాలై ఆసుపత్రిలోనే చేరడంతో.. ఆయన కుమారుడు భరత్‌కు చేదోడుగా ఉంటూ పార్టీ శ్రేణులకు విద్యాసాగర్‌ భరోసా ఇచ్చారు. విద్యా సాగర్ ఇంచార్జి బాధ్యతలు చూసిన రామకుప్పం మండలంలో చంద్రబాబు మెజారిటీ గత ఎన్నికల కన్నా 2019లో తగ్గింది. 2014 ఎన్నికల్లో ఈ మండలంలో చంద్రబాబుకు 8,300 మెజారిటీ రాగా 2019 ఎన్నికల్లో 3400కు పడిపోయింది.

Show comments