iDreamPost
iDreamPost
ఫాంటసీ సినిమాల్లో సైంటిఫిక్ ఎలిమెంట్స్ మిక్స్ చేసుకున్న మొదటి చిత్రంగా 1991లో విడుదలైన ఆదిత్య 369 రేపిన సంచలనం అందరికి తెలిసిందే. భూత వర్తమాన భవిష్యత్ కాలాలను కలుపుతూ దర్శకులు సింగీతం శ్రీనివాస రావు గారు చేసిన మేజిక్ కి ప్రేక్షకులు మైమరిచిపోయారు. ముఖ్యంగా ఇళయరాజా సంగీతం గట్టి వెన్నెముకగా నిలిచిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులు సాధించలేదు కానీ కమర్షియల్ లెక్కల్లో ఘన విజయాన్నే సొంతం చేసుకుంది. ఇక్కడ చూస్తున్న పిక్ గుర్తు పట్టారుగా. సెకండ్ హాఫ్ లో శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో హీరోయిన్ మోహిని, ఆస్థాన నర్తకిగా నటించిన సిల్క్ స్మిత మధ్య డాన్స్ కాంపిటీషన్ నేపథ్యంలో సాగుతుంది.
దివంగత వేటూరి సుందరరామ్మూర్తి గారు రచించిన సురమోదము సుఖనాట్య వేదము పఠియింపగ వశమా అంటూ సాంప్రదాయ పద్ధతిలో సాగుతూ ఆఖర్లో రప్పప్పాప రాక్ అండ్ రోల్ అంటూ అమాంతం పాట నడవడికను మార్చేస్తుంది. అప్పటిదాకా పాటలో ప్రేక్షకుడిగా ఉండిపోయిన బాలకృష్ణ ఓ నిమిషం పాటు డిస్కో డాన్స్ స్టెప్స్ షేక్ చేయడం, తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడం జనాన్ని విపరీతంగా ఆకట్టుకుంది. ఫోటోలో దర్శకులతో పాటు కొరియోగ్రాఫర్ ప్రభుదేవాని కూడా గమనించవచ్చు. ఆదిత్య 369లో రిపీట్ వేల్యూ తెచ్చిన అంశాల్లో ఈ పాటను తప్పకుండ చేర్చుకోవాలి.
హాలీవుడ్ మూవీ బ్యాక్ టు ది ఫ్యూచర్ ని ఇన్స్ పిరేషన్ గా తీసుకున్నప్పటికీ సింగీతం వారు తమదైన శైలిలో ఆదిత్య 369ని పెద్దగా టెక్నాలజీ లేని టైంలో అంత అద్భుతంగా తీర్చిదిద్దడం చూస్తే ఇప్పటికీ ఆశ్చర్యం కలుగుతుంది. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్, గాయకులు ఎస్పి బాలసుబ్రమణ్యం సంయుక్తంగా నిర్మించిన ఆదిత్య 369 నందమూరి అభిమానులకే కాదు ప్రతి తెలుగువాడికి ఒక ప్రత్యేక చిత్రంగా నిలిచిపోయింది.
ఆ మధ్య దీనికి సీక్వెల్ రూపొందిస్తారని టాక్ వచ్చింది కానీ ఎందుకో మరి కార్యరూపం దాల్చలేదు. బాలయ్య ఆసక్తిగానే ఉన్నప్పటికీ స్క్రిప్ట్ సంతృప్తికరంగా రాలేదనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్తులో ఆదిత్య 369 కొనసాగింపు వస్తే మరోసారి విజువల్ వండర్ ని చూసే అవకాశం దక్కుతుంది.