iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాలు ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి పెద్ద గుదిబండలా మారుతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా పారిశ్రామికవేత్తల్లో, సంస్థలలో అపోహలు, అనుమానాలు కలిగించే ప్రయత్నాలు సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. అందుకు తగ్గట్టుగా ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయని, కొత్త పరిశ్రమలకు అవకాశం లేకుండా పోతుందనే వాదన విస్తృతంగా సాగుతోంది. అందుకు కారణం ప్రభుత్వ విధానాలని, చివరకు రాయితీలు కూడా వెనక్కి తీసుకుంటున్నారనే రీతిలో వార్తలు వండి వారుస్తున్నారు. సోషల్ మీడియాలో వాటిని హల్ చల్ చేసి ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రయత్నాలు జోరందుకున్నాయి. అంతటితో సరిపెట్టకుండా ఏకంగా న్యాయస్థానాల్లో కూడా కేసులతో కొత్త కాక రాజేస్తున్నారు.
తొలుత తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని అనుమానాలు రాజేస్తారు. ఆ తర్వాత వాటి ఆధారంగా ఏదో ఒక మీడియా సంస్థలో కథనాలు వస్తాయి. వాటిని పట్టుకుని సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేశారు. అంతటితో సరిపెట్టుకుండా తాజాగా తనకు వాట్సాప్ మెసేజ్ వచ్చిందంటూ ఓ వ్యక్తి హైకోర్టులో స్టే కోసం వెళ్లడం విశేషంగానూ, విస్మయకరంగానూ కనిపిస్తోంది.
విశాఖలో నూతన రాజధాని ఏర్పాట్లలో భాగంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా మిలీనియం టవర్స్ రెండో దశ నిర్మాణం పూర్తి చేసేందుకు నిధులు కేటాయించింది. రూ.19.74 కోట్లను కేటాయించింది. వేగంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. తద్వారా ఈ వేసవిలోనే సచివాలయం అక్కడికి తరలిస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఇటీవల పలువురు అధికారులు వాటిని పరిశీలించి ఖాయం చేయడంతో ఇక తరలింపు మాత్రమే మిగిలి ఉంది.
ఈ నేపథ్యంలో మిలీనియం టవర్స్ లో ఉన్న ఐటీ కంపెనీలు తరలిపోతున్నాయనే ప్రచారం మొదలయ్యింది. చివరకు కాండ్యుయెంట్ వంటి కంపెనీలు కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్టు నిరాధార సమాచారం ప్రచారంలో ఉంది. దానిపై ఇప్పటికే ఏపీఐఐసీ తో పాటు సదరు కంపెనీ కూడా ఖండిస్తూ ప్రకటనలు ఇచ్చారు. విశాఖలో మరింత విస్తరించేందుకు మరో లక్ష చదరపు అడుగుల స్థలం కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తమ కంపెనీ తరలిపోతుందనే ప్రచారం ఏమిటని కంపెనీ ప్రతినిధులు నిలదీస్తున్నారు.
అయినా ప్రచార పర్వం ఆగడం లేదు. పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అని చెప్పుకుంటూ రమేష్ అనే వ్యక్తి తాజాగా హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. విశాఖ ఐటీ టవర్స్ లో పలు కంపెనీలను ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారని, దాని వల్ల 24వేల మంది ఉద్యోగులు ఖాళీ చేయాల్సి వస్తోందని తన పిటీషన్ లో పేర్కొన్నారు. దానికి ఆధారంగా తనకు ఈ సమాచారం వాట్సాప్ మెసేజ్ లో వచ్చిందంటూ ఆయన పేర్కొనడం విస్మయకరంగా కనిపిస్తోంది.
ఈ పిటీషన్ పై జస్టిస్ మహేశ్వరి , జస్టిస్ జయసూర్యతో కూడిన బెంచ్ విచారించింది. వచ్చే వారానికి విచారణ వాయిదా వేసింది. అందుకు తగ్గట్టుగా తగిన నోటీసులు, ఇతర పత్రాలు సమర్పించాలని పిటీషనర్ ని ఆదేశించింది. ఈ పిటీషన్ లో రాష్ట్రప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా వైఎస్ జగన్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బొత్స, కన్నబాబు, అజయ్ కల్లం వంటి వారిని కూడా ప్రతివాదులుగా చేర్చడం మరో విశేషం.
కేవలం వాట్సాప్ లో తనకు వచ్చిన సమాచారం ఆధారంగా పిటీషన్ వేయడం వెనుక అసలు లక్ష్యాలు వేరుగా ఉంటాయని అంతా భావిస్తున్నారు. ముఖ్యంగా రాజధాని వ్యవహారంలో ప్రభుత్వానికి ఆటంకం కల్పించడమే ప్రధాన ఉద్దేశంతో ఇలాంటి పిటీషన్ల పరంపర సాగుతున్నట్టు కొందరు సందేహిస్తున్నారు. దానికి తోడుగా ఏపీలో పారిశ్రామిక ప్రగతికి ఆటంకాలు కల్పించడం ద్వారా ప్రభుత్వం విఫలమయ్యిందనే అభిప్రాయం ప్రజల్లో బలపడాలని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా తమ రాజకీయ ప్రయోజనాలే లక్ష్యంగా కొందరు ఇలాంటి ప్రయత్నాలు తెరవెనుక ఉండి నడిస్తున్నారనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
జగన్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జరుగుతున్న వ్యతిరేక ప్రచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతుంది. మిలీనియం టవర్స్ ను ప్రభుత్వం తీసుకుంటుందని,దానికోసమే సుమారు 20 కోట్లు మిలీనియం టవర్స్ అభివృద్ధికి కేటాయించారని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం మిలీనియం టవర్స్ ను తీసుకున్నా ఇప్పటికే అక్కడ నడుస్తున్న సంస్థలకు ప్రత్యామ్నాయ ఆఫీసులు చూస్పిస్తుంది కానీ
అద్దెకున్న వారిని వెళ్లగొట్టినట్లు ఏ ప్రభుత్వం వ్యవహరించదు. ఆంధ్రాలో IT పరిశ్రమ అభివృద్ధి IT కంపినీలకన్నా ప్రభుత్వానికే ఎక్కువ అవసరం.
సత్యం,GE కంపినీలు ఖాళీ చేసిన ఆఫీసుల్లో ఇప్పటికి చాలా మేర ఖాళీగాఉన్నాయి… అవి కాకున్నా మరొక చోట Plug & Play ఆఫీసులను అందుబాటులోకి తీసుకురావటం ప్రభుత్వానికి సులభమైన పని. IT పరిశ్రమ ఈ విధంగానే అభివృద్దిచెందేది.
ఇంతకూ మిలీనియం టవర్స్ occupancy ఎంత?