iDreamPost
android-app
ios-app

అమ్మ బాబోయ్.. అస్స‌లిన‌డం లేదు..!

అమ్మ బాబోయ్.. అస్స‌లిన‌డం లేదు..!

స‌డ‌లింపుల్లో భాగంగా క్యాబ్ లు రోడ్డెక్కిన విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో స‌డ‌లింపులు అందుబాటులోకి వ‌చ్చిన మొద‌టి రోజే.. ఓలా, ఉబెర్ సంస్థ‌ల‌కు చెందిన‌ 26000 వాహనాలు క్యాబ్ సేవ‌ల్లో పాల్గొన్నాయి. అటు సంస్థ‌లు కానీ.. ఇటు ప్ర‌భుత్వం కానీ.. ఎటువంటి ర‌క్ష‌ణ సౌక‌ర్యాలూ క‌ల్పించ‌క‌పోవ‌డంతో డ్రైవ‌ర్లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనికి తోడు క్యాబ్ బుక్ చేసుకున్న వారిలో కొంత మంది నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం లేద‌ని, ముగ్గురి కంటే ఎక్కువ మంది ఎక్కొద్ద‌న్నా.. విన‌డం లేద‌ని ఆవేదన వ్య‌క్తం చేశారు. కొంద‌రు మాస్క్ లు ధ‌రించడం లేద‌ని, అది ప్ర‌మాద‌మ‌ని ఎంత మొత్తుకున్నా వినిపించు కోవ‌డం లేద‌ని అన్నారు. దీంతో డ్రైవర్ లు భ‌యాందోళ‌న‌లో ఉన్నారు.

తెలంగాణ స్టేట్ టాక్సీ & డైవర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ అంచనాల ప్రకారం మొద‌టి రోజే ఇర‌వై ఆరు వేల వాహనాలు సేవ‌లు ప్రారంభించాయి. వారిలో కొంద‌రు డ్రైవర్లు ప్రత్యేకంగా, పరోక్షంగా ఎన్నో బాధలను ఎదుర్కొన్నారు అని జేఏసీ క‌మిటీ చైర్మ‌న్ షేక్ సలావుద్దీన్ చెప్పుకొచ్చారు. చాలా కాలం త‌ర్వాత బ‌య‌టికి వ‌చ్చిన వారిలో కొందరు ప్రయాణికులు క్యాబ్ లో ముగ్గురే అన్న నిబంధ‌న‌ను పట్టించుకోకుండా న‌లుగైదుగురు కూర్చోవడం, వారు మాస్కులు, ధరించకపోవడం, మ‌రికొంతమంది ఇళ్లు ఖాళీ చేసిన సామానులు కార్లో నింపడం, కుదురదు అంటే కంపెనీల‌కు ఫిర్యాదు చేస్తాం.. రేటింగ్ లు ఇవ్వం.. అని బెదిరిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు.

ప్రస్తుతం క్యాబ్ డ్రైవర్ల సమస్యలను ప్రభుత్వం మరియు కంపెనీలు బాధ్యతగా తీసుకొని తగు చర్యలు చేప‌ట్టాల‌ని కోరారు. డ్రైవర్లకు రక్షణ కల్పించాలని, ఆరోగ్య బీమా తో పాటు క‌రోనా నుంచి ర‌క్ష‌ణ కోసం తగిన కవచాలు మాస్క్, బ్లౌజ్, శానిటైజ‌ర్లు, ఫైబర్ షీట్ ఓలా ఉబెర్ కంపెనీలు అందించాల‌ని డిమాండ్ చేస్తున్నారు. లాక్ డౌన్ తో డ్రైవ‌ర్ల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకుని కంపెనీలు 35% ఉన్న కమీషన్ 5% తీసుకునే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ్యాల‌న్నారు. కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ లో డ్రైవర్లకు ఎలాంటి ఊరట లభించలేదని, కనీసం తెలంగాణ ప్రభుత్వమైనా స్పందించి క్యాబ్ డ్రైవర్లను ఆదుకోవాలని, గడిచిన 3 నెలలు, రాబోయే 3 నెలల క్వాటర్ ట్యాక్స్ రద్దు చేయాలి అని కోరుతున్నారు.

అలాగే ఫైనాన్సర్ల ఒత్తిడి లేకుండా కచ్చితమైన గైడ్ లైన్స్ విడుదల చేయాలన్నారు. ఇదిలా ఉండగా.. సడలింపు లను ఆసరాగా చేసుకుని నిర్లక్ష్యం తో నిబంధనలు ఉల్లంఘించే వారు వారు ప్రతీ చోటా కనిపిస్తూనే ఉన్నారు. వాళ్ళతో ముప్పు పొంచి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి