జగన్‌ సర్కార్‌ నిర్ణయం.. పెన్షనర్‌లకు పూర్తి పెన్షన్‌..

లాక్‌డౌన్‌తో అన్ని రాష్ట్రాల్లోనూ ఆదాయం పడిపోయింది. దీంతో తెలంగాణ, మహారాష్ట్ర, కేరళ లాంటి ఆర్థికంగా పటిష్టంగా ఉన్న రాష్ట్రాలే ఉద్యోగుల జీతాల్లో కోతలు పెడుతున్నాయి. విడిపోయిన రాష్ట్రమైన ఏపీలో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రం ఏ ఒక్క ఉద్యోగి జీతంలో కోత పెట్టలేదు. కేవలం ఆయా విభాగాల వారీగా వాయిదా పద్దతిన పూర్తి జీతాలు చెల్లించాలని నిర్ణయించారు. కోవిడ్‌ వ్యాప్తి నివారణకు తీవ్రంగా కృషి చేస్తున్న పోలీసులు, వైద్య ఆరోగ్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు సహాయకంగా ఉండేందుకు పూర్తి జీతాలు చెల్లిస్తున్నారు.

తాజాగా సీఎం జగన్‌ మరో నిర్ణయం తీసుకున్నారు. పెన్షనర్లకు పూర్తి పింఛన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పెన్షనర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ఱయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. అదే సమయంలో సీఎంతో సహా ప్రజా ప్రతినిధులందరి జీతాలు, కార్పొరేషన్ల చైర్మన్ల జీతాలను ఏప్రిల్‌ నెలలోనూ వాయిదా వేయనున్నారు. మిగతా అన్ని విభాగాల ఉద్యోగులకు మార్చి నెల మాదిరిగానే 50 శాతం వేతనాలు చెల్లిస్తారు. నాల్గోతరగతి ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం వాయిదా వేసి, మిగతా 90 శాతం జీతాలను ఇస్తారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ లాంటి అధికారులందరికీ ఏఫ్రిల్‌లో కూడా వేతనాల్లో 40 శాతం చెల్లించనున్నారు. మిగతా 60 శాతం వాయిదా వేయనున్నారు. వీరందరికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగుపడిన వెంటనే వాయిదా వేసిన మొత్తాలను పూర్తిస్థాయిలో చెల్లిస్తారు.

Show comments