iDreamPost
iDreamPost
వివాదాస్పదంగా మారిన అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద్ద కౌంకుట్ల పంచాయితీ మరోసారి తెరపైకి వచ్చింది. పెద్ద కౌకుంట్ల మేజర్ గ్రామ పంచాయతీని విడగొట్టాలన్న అధికారుల నిర్ణయాన్ని గ్రామస్థులు వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అయితే కొద్ది నెలలుగా కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో మళ్లీ నేడు గ్రామ సభ నిర్వహించనున్నారు. చిన్న కౌంకుట్ల, వై. రామాపురం, రాచేపల్లి, మైలారంపల్లి గ్రామాలుండగా.. పరిపాలనా సౌలభ్యం కోసం వీటిని విభజించాలని మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత విశ్వేశ్వరరెడ్డి అధికాలను కోరారు.
ఈ నేపథ్యంలో గత ఏడాది సెప్టెంబర్ 30న అధికారులు గ్రామసభ నిర్వహించగా..8,500 మంది జనాభా ఉన్న పంచాయతీలో కనీసం 1500 మంది కూడా పాల్గొనలేదు. తెదెపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సొంతూరు అయిన కౌకుంట్ల గ్రామ పంచాయతీలో అభివృద్ధి వేగవంతం అయ్యేందుకు విభజించాలని ప్రజలు కోరుతున్నారు. అయితే గ్రామ సభ నిర్వహించిన రోజున మాత్రం ప్రజలు పెద్దగా హాజరు అవ్వలేదు. అయిన వాళ్లలో వ్యతిరేకించిన వారే అధికంగా ఉన్నారు. అయితే గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించగా.. విభజన ప్రక్రియ రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మరో మాజీ సర్పంచు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఈ నెల 6 వరకు స్టే విధిస్తూ ఆ తర్వాత వాదనలు వింటామని కోర్టు తెలిపింది.
వాదనలు పూర్తి కాకుండానే మరోసారి విభజన అంశం బయటికొచ్చింది. నేడు గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు పంచాయతీ అధికారులు నోటీసులిచ్చిన నేపథ్యంలో గ్రామంలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. గతేడాది గ్రామ సభలో ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ చేసిన రాద్దాంతం అంతా ఇంతా కాదు. గ్రామపంచాయతీని విభజించేందుకు ఇష్టంలేని ఎమ్మెల్యే ఈ సారి ఏం చేస్తారోనని అంతా ఎదురుచూస్తున్నారు