Idream media
Idream media
తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల వేళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలు పెద్దగా ఆశ్చర్యం కలిగించడం లేదు. పవన్ కల్యాణ్‌ను గొప్పగా చూసుకోవాలని, పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని బీజేపీ పెద్దలు చెప్పారు.. ఈ రాష్ట్రానికి అధిపతిని చేయాలని భావిస్తున్నారు.. అంటూ సోము వీర్రాజు చెప్పుకొచ్చారు. రాష్ట్ర అధిపతి అంటే.. పవన్ కల్యాణ్‌ను ఏపీ ముఖ్యమంత్రిని చేస్తామని కమలం పార్టీ ఏపీ అధిపతి చెబుతున్నారనుకోవాలి.
సోము వీర్రాజు ఈ మాటలు ఎందుకు అన్నారో తెలుసుకోవడానికి పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. తిరుపతి ఉప ఎన్నికల దృష్ట్యా బీజేపీ నేతల నోటి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు వచ్చాయని ఇట్టే అర్థమవుతోంది. ఎంపీ సీటు రాలేదని గుర్రుగా ఉన్న జనసేన కార్యకర్తలను కూల్ చేయడానికి.. పవన్ సీఎం.. అనే మాట సోము వీర్రాజు పలికారు. నిన్నటి వరకు పవన్ కల్యాణ్ అభిమానులు ఈ మాటలను పదే పదే పలికేవారు. ఇప్పుడు సోము వీర్రాజు పలికారు. అందులో పెద్ద వింత ఏమీ లేదు. బీజేపీ అవసరం అలాంటిది.
ఉప ఎన్నికల్లో కనీసం రెండో స్థానంలో నిలిచినా.. బీజేపీకి అది పెద్ద అచీవ్‌మెంట్. టీడీపీని వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు వస్తుంది. ఇలా కాకుండా మూడో స్థానంలోనో లేదా గతంలో మాదిరిగా ఒకట్రెండు శాతం ఓట్లతో సరిపెట్టుకుంటే.. ఏపీపై ఆశలు వదులుకోవాల్సిందే.
పవన్ కల్యాణ్‌ను దేవుడు అంటూ ఆరాధించే ఆయన అభిమానులు.. సోము వీర్రాజు వ్యాఖ్యల వల్ల ఖుషీగా ఉండవచ్చు. అయితే అసలు వాస్తవాన్ని మాత్రం ఇక్కడ గమనించాల్సి ఉంటుంది. వైసీపీ ఎంపీ మరణించడం వల్ల జరుగుతున్న ఉప ఎన్నికలో.. ఆ సీటును జనసేనకు ఇచ్చేందుకు ఏ మాత్రం ఇష్టంలేని బీజేపీ.. రేపు ఏకంగా సీఎం పదవిని పవన్ కల్యాణ్‌కు ఇస్తుందా..?
నిజంగా పవన్ కల్యాణ్‌ను పువ్వుల్లో పెట్టి చూసుకోవాలని బీజేపీ పెద్దలు భావిస్తే.. ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టినా.. మోడీ, అమిత్ షా అపాయింట్‌మెంట్‌లు ఎందుకు దక్కలేదు. అధికారం వస్తుందో లేదో తెలియని సీఎం పదవిపై పవన్ కల్యాణ్‌ను కూర్చొపెడతామంటున్న బీజేపీ నేతలు అంతకు ముందే సాధ్యమైన కేంద్ర మంత్రి పదవిని ఎందుకు ఇవ్వడం లేదు..? బిహార్‌లో లోక్‌జనశక్తి పార్టీ (ఎల్‌జేపీ ) ఓటింగ్ శాతం 5 నుంచి 6 శాతం మాత్రమే. బిహార్ అసెంబ్లీలో ఆ పార్టీ ప్రాతినిధ్యం కూడా సింగిల్ డిజిట్ లోపే. ఇంత తక్కువ శాతం ఓటింగ్ ఉన్న ఎల్‌జేపీ పార్టీ అధినేత రాం విలాస్ పాసవాన్‌కు కేంద్ర కేబినెట్‌లో బీజేపీ ప్రభుత్వం చోటు కల్పించింది.
ఏపీలో జనసేన పార్టీకి చెప్పుకోదగిన ఓటు బ్యాంకు ఉంది. 2019 ఎన్నికల్లో ఆ పార్టీ 5.53 శాతం ఓట్లను సాధించింది. ఎల్‌జేపీతో పోల్చుకుంటే.. జనసేన ఓటు బ్యాంకు కొద్ది మేర ఎక్కువే. మరి ఎల్‌జేపీ అధినేతకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన బీజేపీ నేతలు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఎందుకు ఇవ్వరు.
ఏపీలో నిజంగా జనసేనతో కలసి సాగాలి.. 2019లో అధికారంలోకి రావాలి.. అనే లక్ష్యాలు గల బీజేపీ.. పవన్‌కు కేంద్ర మంత్రి పదవి ఎందుకు ఇవ్వరు..? పవన్‌కు కేంద్ర కేబినెట్‌లో బెర్త్ ఇస్తే.. ఏపీలో జనసేన–బీజేపీ కూటమి బలపడేందుకు బలమైన మార్గం ఏర్పడుతుంది. ఏపీ నుంచి ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో ప్రాతినిధ్యం ఎలాగూ లేదు. ఆచరణ సాధ్యమైన అంశాలను వదిలిపెట్టి.. అసాధ్యమైన అధికారం, ముఖ్యమంత్రి పదవి.. అంటూ బీజేపీ నేతలు చెప్పడంలో విడ్డూరం ఏమీ లేదు. జనసేన ఓట్ల పడవేమోననే సందేహం తప్ప.
Also Read : తిరుపతిలో వేడెక్కుతున్న రాజకీయం, నేడు నామినేషన్ల జోరు