ఉన్నారో లేదో తెలియదు.. ఎమ్మెల్యే రాపాకపై పవన్‌ కల్యాణ్‌

ఇటీవల కాలంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వా విధానాలకు, నిర్ణయాలకు బహిరంగంగా మద్దతు ప్రకటిస్తున్న జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌పై ఆ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడ తూర్పు నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నిర్ణయాలకు విరుద్ధంగా ఎమ్మెల్యే రాపాక ప్రవర్తిస్తున్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రాపాక పార్టీలో ఉన్నారో లేదో తెలియదని వ్యాఖ్యానించారు.

అధికారం కోసం తాను అర్రులు చాచనని చెప్పిన పవన్‌ కల్యాణ్‌ కాపాలా రాజకీయాలు తాను చేయన్నారు. ప్రజా ప్రయోజనాలు, సమాజం కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని, పార్టీ కార్యకర్తల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. భావజాలం ఉన్న వ్యక్తులే పార్టీలో ఉంటారని, లేని వారు వెళ్లిపోతారని ఇటీవల జరిగిన పరిణామాలపై వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో తనను ఇష్టపడే వారే ఎమ్మెల్యేలు అవుతారని చెప్పుకొచ్చారు.

కాగా గత ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన తరఫున తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గం నుంచి రాపాక గెలిచారు. పవన్‌ కల్యాణ్‌ రెండు (భీమవరం, గాజువాక) నియోజకవర్గాల్లో పోటీ చేసినా విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో జనసేన తరఫున రాపాక ఒక్కరే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీ విధానాలకు, అధ్యక్షుడు చెప్పిన తీరుకు భిన్నంగా అసెంబ్లీలో రాపాక వ్యవహరిస్తున్నారు.

ఇంగ్లీష్‌ మీడియం బిల్లును పవన్‌కల్యాణ్‌ వ్యతిరేకిస్తే.. రాపాక మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని కొనియాడారు. మండలి రద్దుకు జై కొట్టారు. ఇలా ప్రతి విషయంలో పార్టీ విధానానికి భిన్నంగా వ్యవరిస్తుండడంతో రాపాకపై జనసేన అధినేత, ఆ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారు. ఈనేపథ్యంలో రాపాక పార్టీలో ఉన్నారో లేదో తెలిదంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ ఎకైక ఎమ్మెల్యే అయిన రాపాక ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Show comments