iDreamPost
android-app
ios-app

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

బ్యాలెట్‌ బాక్సుల్లో భవితవ్యం

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల తొలి దశ ప్రక్రియ చివరి ఘట్టానికి చేరుకుంది. ఉదయం 6:30 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ మధ్యాహ్నం 3:30 గంటల వరకు కొనసాగింది. పల్లె ఓటర్లు ఉత్సాహంలో ఓటింగ్‌లో పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు ఓటేసేందుకు ఆసక్తి చూపారు. టీడీపీ నాయకులు ఆరోపించినట్లుగా.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. ప్రశాంత వాతావారణంలో పోలింగ్‌ ప్రక్రియ పూర్తయింది. మధ్యాహ్నం 2:30 గంటలకే 75.55 శాతం పోలింగ్‌ జరిగింది. ఇది మరింత పెరగనుంది. పంచాయతీ ఎన్నికలు కావడం వల్ల మెజారిటీ పంచాయతీల్లో దాదాపు 90 శాతం పోలింగ్‌ నమోదయ్యే అవకాశాలున్నాయి.

తొలి విడతలో విజయనగరం మినహా మిగతా 12 జిల్లాల్లో ఎన్నికలు జరిగాయి. 18 రెవెన్యూ డివిజన్లలోని 168 మండలల్లో తొలి విడత 3,249 పంచాయతీలకు పోరు జరిగింది. 525 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మరో పంచాయతీలో ఎన్నికలకు ప్రజలు దూరంగా ఉన్నారు. ఇవి పోను మిగిలిన 2,723 పంచాయతీలకు, ఏకగ్రీవం కాగా మిగిలిన 20,157 వార్డులకు పోలింగ్‌ పూర్తయింది. 7506 మంది సర్పంచ్‌ బరిలో నిలిచారు. వీరి భవితవ్యాన్ని ఓటర్లు తమ ఓట్ల ద్వారా బ్యాలెట్‌ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. ఈ రోజు సాయంత్రం ఆరు గంటల కల్లా ఫలితాలు తేలనున్నాయి. ఆ వెంటనే ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహిస్తారు.