iDreamPost
android-app
ios-app

నేడు ‘పంచాయతీ’పై విచారణ.. సుప్రింలో ట్విస్ట్‌.. మారిన న్యాయమూర్తి..!

నేడు ‘పంచాయతీ’పై విచారణ.. సుప్రింలో ట్విస్ట్‌.. మారిన న్యాయమూర్తి..!

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నిర్వహణ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రిం కోర్టులో నేడు సోమవారం విచారణ జరగనుంది. ఏపీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ విడుదల చేసిన పంచాయతీ షెడ్యూల్‌పై రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఏపీ హైకోర్టు సింగిల్‌ జడ్జి స్టే విధించగా.. డివిజనల్‌ బెంచ్‌ నిమ్మగడ్డ నిర్ణయాన్ని సమర్థించింది. దీంతో ఈ వ్యవహారం దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో సుప్రిం విచారణపై ఏపీలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కరోనా నేపథ్యంలో వ్యాక్సిన్‌ వేసుకున్న తర్వాతే తాము విధులకు వస్తామని ఉద్యోగులు తేల్చి చెబుతుండగా, ఎస్‌ఈసీ మాత్రం విధులకు రాకపోతే చర్యలు తీసుకుంటానంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. బ్యాలెట్‌ పద్ధతిలో జరిగే పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధత లేకుండానే ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ జారీ చేయడం, వ్యాక్సిన్‌ ప్రక్రియ కొనసాగుతుండడంతో సుప్రిం తీర్పు ఎలా రాబోతోందన్న ఆసక్తి నెలకొంది.

విచారణ ముందు ట్విస్ట్‌..

రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ మరికొద్ది గంటల్లో విచారణకు వస్తుందనగా సుప్రిం కోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ పిటిషన్‌ జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ధర్మాసనం ముందుకు వెళ్లింది. ప్రస్తుతం ఈ పిటిషన్‌ వేరే ధర్మాసనానికి బదిలీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌ను జస్టిస్‌ లావు నాగేశ్వరరావుకు బదులు.. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ ధర్మాసనం ముందుకు వెళ్లింది. జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్, జస్టిస్‌ రిషికేష్‌ రాయ్‌ ధర్మాసనం విచారించబోతోంది. జస్టిస్‌ లావు నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి.

వివాదం తేలకముందే నోటిఫికేషన్‌..

పంచాయతీ ఎన్నికలపై నెలకొన్న వివాదం తేలక ముందే నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ తొందరపడ్డారు. ఎన్నికల నిర్వహణే తన లక్ష్యమనేలా ఒంటెద్దుపోకడలతో వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రింలో పిటిషన్‌ వేసినా.. దానితో తనకు సంబంధం లేదన్నట్లుగా.. ఈ నెల 23వ తేదీన పంచాయతీ తొలి దశ ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. సుప్రింలో తీర్పు వచ్చే వరకు ఆగాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా.. పెడనచెవిన పెట్టారు. ఎన్నికల నిర్వహణపై సమీక్షలు, సమావేశాలకు సిద్ధమవగా.. ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేక వ్యక్తమైంది. నిమ్మగడ్డ విడుదల చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం.. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలకు ఈ నెల 27వ తేదీనే తుది గడువు.

ఉద్యోగ సంఘాలు. ఓటర్లు కూడా సుప్రింకు..

కరోనా నేపథ్యంలో తగిన రక్షణ సన్నద్ధత లేకుండా విధులు నిర్వహించడంపై తీవ్ర ఆందోళనలో ఉన్న ఉద్యోగ సంఘాలు సుప్రిం కోర్టును ఆశ్రయించాయి. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగా.. ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌ అయిన ఉద్యోగులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం తొలి డోసు అధిక శాతం మంది ఉద్యోగులు తీసుకున్నారు. చివరిదైన రెండో డోస్‌కు మరో నెల రోజుల పాటు వేచి చూడాలి. రెండు డోసులు తీసుకున్న తర్వాత.. తాము ఎన్నికల విధుల్లో నిర్భయంగా పాల్గొంటామని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అప్పటి వరకు ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ.. తమ అభ్యంతరాలతో సుప్రింలో పిటిషన్లు దాఖలు చేశాయి. మరో వైపు 2019 ఓటర్లు లిస్టు ప్రకారమే ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేయడంతో.. నూతనంగా ఓటు పొందిన దాదాపు 3.60 లక్షల మంది తమ హక్కును వినియోగించుకునే అవకాశం కోల్పోతున్నారు. ఈ విషయంపై కూడా గుంటూరు చెందిన ఓ విద్యార్థి సుప్రింలో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై నేడు సుప్రింలో విచారణ జరగబోతోంది.