Idream media
Idream media
ఈ నెల 14వ తేదీన ముగియనున్న లాక్ డౌన్ ను పొడిగించాలా..? ఎత్తి వేయాలా..? దశల వారిగా తొలగించాలా..? అనేది 11వ తేదీన తేలబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ 11 వ తేదీన రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం కాబోతున్నారు. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ పై ఆ రోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
కరోనా వైరస్ వ్యాప్తి ని అరికట్టేందుకు గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను విధించిన విషయం తెలిసిందే. అంతకుముందు 22వ తేదీన జనతా కర్ఫ్యూ జరిగింది. మరుసటిరోజు నుంచే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. మూడు వారాలు పాటు లాక్ డౌన్ చేయడం వల్ల కరోనా వైరస్ లింక్ ను కట్ చేసి, వైరస్ ను పూర్తిగా నియత్రించవచ్చని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భవించాయి. ఈ క్రమంలోనే విదేశాల నుంచి వచ్చిన వారందరినీ హోమ్ క్వారయింటైన్ చేశారు. ఐతే గత నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో జరిగిన జమాత్ కార్యక్రమంలో పాల్గొన్న వారి నుంచి కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా విస్తరించింది. వారి నుంచి కుటుంబ సభ్యులకు సోకింది.
ఈ నెల ప్రారంభంలో అన్ని రాష్ట్రాలలో రెండంకెల సంఖ్య ఉన్న కరోనా కేసులు.. మూడంకెలకు చేరుకున్నాయి. ఈ నెల ప్రారంభంలో వైరస్ అదుపులోకి వచ్చిందనుకున్న కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను దశల వారిగా ఎత్తి వేయాలని కూడా భావించింది. ఈ మేరకు గత సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు చెప్పారు. ఐతే ఈ వారం లో కేసులు విపరీతంగా పెరగడంతో లాక్ డౌన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచనలో పడ్డాయి. కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని కేంద్రాన్ని కోరాయి. కేంద్రం లాక్ డౌన్ ఎత్తి వేసినా.. తాము మాత్రం కొనసాగిస్తామని పేర్కొన్నాయి. పంజాబ్ లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 30 వరకు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నట్లుగా ప్రకటించింది.
ఈ రోజు బుధవారం అన్ని పార్టీల పార్లమెంటరీ పార్టీ నేతలతో సుదీర్ఘంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోదీ వైరస్ కట్టడి చర్యలు, లాక్ డౌన్ పై సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తీసుకున్నారు. లాక్ డౌన్ పొడిగించాలని ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చిన కేంద్రం.. రైల్వే రిజర్వేషన్ల రద్దును ఈ నెలాఖరు వరకు పొడిగించింది. ఇలాంటి సంకేతాల నడుమ.. 11వ తేదీన జరిగే సీఎంల సమావేశంలో.. లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయం తీసుకోవడం లాంఛనమే కానుందన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.