కొత్త సంవత్సరం జనవరి 1, 2020 నుండి ఏటీఎం లావాదేవీల్లో మోసాలను నిరోధించి, తమ ఖాతాదారుల ప్రయోజనాలను కాపాడేందుకు దేశంలోనే అతి పెద్దదైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త నిబంధన అమల్లోకి తీసుకొస్తుంది. జనవరి 1 నుంచి రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల మధ్య ఏటీఎం లలో 10 వేలకు పైగా నగదును విత్‌డ్రా చేసుకునేవారు ఇకపై వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) ద్వారా లావాదేవీలను నిర్వహించాల్సి ఉంటుంది.
వినియోగదారుడు డబ్బులు డ్రా చేసే సమయంలో తన రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ ని ఏటీఎం స్క్రీన్ పై ఎంటర్ చేస్తేనే లావాదేవీ చేయగలుగుతారు. ఒక ఓటీపీ కి ఒకసారి మాత్రమే నగదును విత్ డ్రా చేసుకోగలం. అయితే ప్రస్తుతానికి ఇతర బ్యాంక్ ఏటీఎం ల నుండి నగదు విత్ డ్రా చేసే స్టేట్ బ్యాంక్ ఖాతాదారులు మాత్రం ఓటీపీ ఉండదు.
స్టేట్ బ్యాంక్ ఎటిఎం కార్డులు డిసెంబర్ 31 తర్వాత బ్లాక్..
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) తాజా ఆదేశాల మేరకు దేశంలోని అన్ని ప్రయివేటు మరియు ప్రభుత్వ రంగ బ్యాంక్ ఏటీఎం కార్డు వినియోగదారులు జనవరి 1 నుండి సాధారణ ఏటీఎం కార్డుల నుండి సురక్షితమైన ఇఎమ్‌వి చిప్-ఎనేబుల్డ్ డెబిట్ కార్డులకు మారడం తప్పనిసరి.
డిసెంబర్ 31 నుండి మాగ్నటిక్ స్ట్రిప్ ఉన్న ఎటిఎం-కమ్-డెబిట్ కార్డు లు పని చెయ్యవు. వాటి స్థానంలో EMV చిప్ ఆధారిత ఎటిఎం డెబిట్ కార్డులు మాత్రమే పని చేస్తాయి. దీనితో వినియోగదారులు ఈ కొత్తరకం కార్డులకోసం బ్యాంక్ లో దరఖాస్తు చేసుకోవాలని సాధారణ ఏటీఎం కార్డుల స్థానంలో సరికొత్త ఇఎమ్‌వి చిప్-ఎనేబుల్డ్ డెబిట్ కార్డులు పొందాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) తమ ఖాతా దారులకు సమాచారం ఇచ్చింది. ఆన్‌లైన్ ద్వారా లేదా తమ అకౌంట్ ఉన్న బ్రాంచ్ ద్వారా ఉచితంగా ఇఎంవి చిప్ కార్డులు భర్తీ చేయబడతాయని స్టేట్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది
మెరుగైన భద్రత కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డుల స్థానంలో ఇఎమ్‌వి చిప్ కార్డులకు అప్‌గ్రేడ్ చేయడం తప్పనిసరి. ఇకపై పాత మాగ్నటిక్ స్ట్రిప్ డెబిట్ కార్డులు శాశ్వతంగా పనిచేయవు. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డులపై కొనసాగుతున్న మోసాల దృష్ట్యా, ఈ కార్డులను 31.12.2019 నాటికి (కార్డ్ యొక్క చెల్లుబాటు కాలంతో సంబంధం లేకుండా) రద్దు చేయాలని స్టేట్ బ్యాంక్ నిర్ణయించింది. ఒకవేళ తమ వినియోగదారులకి ఎవరికైనా కొత్త ఇఎంవి చిప్ కార్డు పొందకపోతే వారు తమ స్టేట్ బ్యాంక్ శాఖను సంప్రదించి కొత్త ఇఎంవి చిప్ కార్డు ఉచితంగా పొందవచ్చు.
మాగ్నెటిక్ స్ట్రిప్స్ ఎటిఎం-కమ్-డెబిట్ కార్డులను కొత్త ఇఎంవి చిప్ కార్డులుగా అప్‌గ్రేడ్ చేసినందుకు అప్‌గ్రేడేషన్ ఖర్చులు ఉచితమేనని తమ వినియోగదారుల నుండి ఎటువంటి రుసుమును వసూలు చేయబోమని బ్యాంక్ తెలిపింది.