iDreamPost
android-app
ios-app

చిక్కుల్లో బైజూస్.. ఇప్పటికే ఉన్న వినియోగదారుల పరిస్థితి ఏంటో?

చిక్కుల్లో బైజూస్.. ఇప్పటికే ఉన్న వినియోగదారుల పరిస్థితి ఏంటో?

ఇండియాలో అతి తక్కువ సమయంలో ఎంతగానో ఆదరణ పొందిన, అభవృద్ధి చెందిన స్టార్టప్స్ లో బైజూస్ ఒకటి. 2011లో బైజూస్ సంస్థను స్థాపించగా.. 2015లో లెర్నింగ్ యాప్ ని తీసుకొచ్చారు. ఆ యాప్ 2018 నాటికి బిలియన్ డాలర్ల కంటే విలువైన సంస్థ(యూనికార్న్)గా అవతరించింది. తర్వాత కొవిడ్ సమయం బైజూస్ సంస్థకు బాగా ఉపయోగపడిందనే చెప్పాలి. ఎందుకంటే.. ఆ సమయంలో పిల్లలు అంతా ఆన్ లైన్ క్లాసులకు మారడంతో బైజూస్ సంస్థ ఊహించిన దాని కంటే ఎంతో గొప్పగా విస్తరించింది.

అయితే అంతే వేగంగా పాతాళానికి పడిపోతుందని ఎవరూ ఊహించి ఉండరు. 2020 కంటే.. 2021లో 17 రెట్లు ఎక్కువ(రూ.2.7 లక్షల కోట్లు)గా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం ఆ సంస్థ విలువ 5.1 బిలియన్ డాలర్లకు పడిపోయింది. అంతేకాకుండా ఇప్పుడు బైజూస్ కు కొత్త కష్టాలు వచ్చాయి. ఇప్పటికే తల్లిదండ్రులు అంతా బైజూస్ పై ఆరోపణలు, విమర్శలు, ఫిర్యాదులు చేశారు. తమను కొత్త కోర్సులు తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. అలాగే వీరికి అప్పులు ఇచ్చిన కంపెనీలు అన్నీ అమెరికాలో కోర్టును కూడా ఆశ్రయించాయి.

మరోవైపు ఇటీవలే బైజూస్ ఆడిటింగ్ కంపెనీలు డెలాయిట్ హస్కిన్స్, సెల్స్ లిప్స్ సంస్థలు తప్పుకున్నాయి. ఆర్థిక పరమైన నివేదికలు సమర్పించే విషయంలో బైజూస్ కంపెనీ ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపించారు. ఆ తర్వాత ఈ కంపెనీలో ముగ్గురు బోర్డు మెంబర్లు రాజీనామా చేశారు. దాంతో ప్రస్తుతం బోర్డులో బైజు రవీంద్రన్, అతని భార్య, సోదరుడు మాత్రమే మిగిలారు. ఇన్ని సమస్యల నడుమ బైజూస్ కు వచ్చిన కొత్త సమస్య ఏంటంటే.. కేంద్రం ప్రభుత్వం బైజూస్ వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చింది. వారి అకౌంట్స్ బుక్స్ ని తనిఖీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అప్పులు ఇచ్చిన సంస్థల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బైజూస్ కంపెనీకి ఇది కొత్త తలనొప్పనే చెప్పాలి.

ఈ విచారణకు సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచాలని.. సంస్థలో అంతర్గతంగా ఈ తనిఖీ జరగాలని తెలిపింది. ఆరు వారాల్లో పూర్తి నివేదిక సిద్ధమైన తర్వాత కేంద్రం పరిశీలిస్తుందని చెప్పారు. ఆ నివేదికను బట్టి చర్యలు ఉంటాయంటూ తెలిపింది. ఇప్పటికే బైజూస్ కంపెనీ వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది.. ఎన్నో ఆరోపణలను ఎదుర్కొంది. భారతదేశంలో కొత్తగా రూపదాల్చనున్న స్టార్టప్స్ కు బైజూస్ కథ ఒక ఉదాహరణ అవుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? కంపెనీ బోర్డు ఎలా ఉండాలి? కంపెనీ నిర్ణయాలు ఎవరికి ప్రయోజనం చేసేవిగా ఉన్నాయి? వంటి అంశాలను పరిగణలోకి తీసుకునేందుకు బైజూస్ పతనం బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.