iDreamPost
android-app
ios-app

అంత రిస్క్ ఎందుకు బుజ్జీ

  • Published Feb 13, 2020 | 5:11 AM Updated Updated Feb 13, 2020 | 5:11 AM
అంత రిస్క్ ఎందుకు బుజ్జీ

కుమారి 21ఎఫ్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం చాలా బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు. హీరో దర్శకుడు ఎవరు అనే దానితో నిమిత్తం లేకుండా దారుణమైన ఫలితాలు అందుకుంటున్నాడు. ఇటీవలే వచ్చిన ఇద్దరి లోకం ఒకటే కనీసం పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టుకోలేదని ట్రేడ్ టాక్. దిల్ రాజు లాంటి నిర్మాత అండగా ఉన్నా వచ్చిన ఫలితం శూన్యం. ఇప్పటికే డిజాస్టర్స్ లో డబుల్ హ్యాట్రిక్ కి దగ్గరలో ఉన్న రాజ్ తరుణ్ మార్కెట్ ఇప్పుడు బాగా వీక్ గా ఉంది. నిర్మాతలు సైతం ఇతనితో సినిమాలు తీసేందుకు ఆలోచించాల్సిన పరిస్థితి.

ఈ నేపథ్యంలో తన ఆశలన్నీ ఒరేయ్ బుజ్జిగా మీదే పెట్టుకున్నాడు రాజ్ తరుణ్. ఇటీవలే ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు కానీ అంతగా రెస్పాన్స్ లేదు. రెగ్యులర్ ఫార్ములాలోనే లవ్ ఎంటర్ టైన్మెంట్ తో తీశారని అర్థమైపోతోంది. ఇప్పుడు దీనికి మార్చ్ 25 రిలీజ్ డేట్ గా లాక్ చేయడం షాక్ ఇస్తోంది. దానికి కారణం లేకపోలేదు. ఆల్రెడీ ఆ డేట్ కి నాని-సుధీర్ బాబుల క్రైమ్ థ్రిల్లర్ ‘వి’ ని ఫిక్స్ చేశారు. రెండు వారాల క్రితమే ప్రకటన కూడా ఇచ్చారు. ఇప్పుడు అదే తేదీకి ఒరేయ్ బుజ్జిని వదలడం అనేది అంత సేఫ్ గేమ్ అనిపించుకోదు.

పైగా నాని డిఫరెంట్ షేడ్స్ లో చేస్తున్న మూవీగా వి మీద ఓ రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నిర్మాత దిల్ రాజు కాబట్టి రిలీజ్ పరంగానూ చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంతగా బజ్ లేని ఒరేయ్ బుజ్జిగాని వికి పోటీకి నిలబెట్టడం రిస్క్ కిందకే వస్తుంది. ఉగాది పండగను టార్గెట్ చేయడం ఉద్దేశం అయినప్పటికీ దానికి సంక్రాంతి అంత సీన్ ఉండదు. ఒక్క రోజు సెలవుతో భారీగా ఒరిగేదేమి ఉండదు. యావరేజ్ కంటెంట్ తో అంత ఈజీగా నెట్టుకురాలేం. మరి ఒరేయ్ బుజ్జిగా టీమ్ లో అంత కాన్ఫిడెన్స్ కనిపిస్తోందంటే విషయం ఉందని అర్థమా. చూద్దాం.