iDreamPost
android-app
ios-app

విజయ సాయిరెడ్డి పై వక్రభాష్యమేలా..

  • Published May 12, 2020 | 3:50 AM Updated Updated May 12, 2020 | 3:50 AM
విజయ సాయిరెడ్డి పై వక్రభాష్యమేలా..

విజయసాయిరెడ్డి ఏమయ్యారు.. ఎందుకు మౌనంగా ఉన్నారు..అసలు ఎటు పోయారు..జగన్ కి సాయిరెడ్డికి చెడిందా.. అందుకే ఆయన్ని హెలికాప్టర్ ఎక్కకుండా అడ్డుకున్నారా.. ప్రమాదం జరిగిన పరిశ్రమలో సాయిరెడ్డి మనుషులున్నారా.. భారతీ పాలిమర్స్ కి, ఎల్జీ సంస్థకు ఉన్న బంధమేమిటి.. ఇలా ఒక్కటి కాదు..అనేక ఆరోపణలు చంద్రబాబు & కో చేయగా ,వాటికి ఆంధ్రజ్యోతి మసాలా అద్ది రక రకాలుగా రాసింది..వరుస ఆ కథనాలతో విజయసాయి రెడ్డి మీద విష ప్రచారం చేసింది. కానీ ఆయన మాత్రం స్థిరంగా సాగిపోయారు. చివరకు ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన గ్రామాల్లో రాత్రి బస చేసి రూమర్స్ కి చెక్ పెట్టారు. తన మీద నిందలు వేసిన వారందరికీ ఒకే ఒక్క చర్యతో సమాధానం చెప్పేశారు.

వాస్తవానికి విజయసాయిరెడ్డి ఈ ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమయ్యారు. ఓవైపు ప్రభుత్వ సహాయంతో పాటుగా రెండోవైపు తన ట్రస్ట్ తరుపున వివిధ సేవలు చేపట్టేందుకు సమాయత్తమయ్యారు. విజయసాయిరెడ్డి ఆదేశాల మేరకు ప్రగతి ఫౌండేషన్ సిబ్బంది వివిధ సేవా కార్యక్రమాలను కరోనా ప్రభావిత ప్రాంతాలతో పాటుగా ఆర్ ఆర్ వెంకటాపురం పరిసరాల్లో విస్తరించారు. కానీ దానిని గుర్తించేందుకు నిరాకరించే ఆయన వ్యతిరేకులు సాయిరెడ్డి మీద ఆరోపణలకు సన్నద్ధమయ్యారు. నిజానికి ఆయన దూకుడు వైఖరితో చాలామందికి మింగుడుపడని స్థాయికి చేరుకున్నారు. జగన్ మౌనం ఎంత ఆందోళనకలిగిస్తోందో అదే రీతిలో సాయిరెడ్డి సెటైరికల్ దాడి కూడా చాలామందిని కలవరపరుస్తోంది. దాంతో విజయసాయిరెడ్డి వైఖరిని జీర్ణించుకోని ఓ వర్గం ఆయన మీద గురిపెట్టింది. రెగ్యులర్ పొలిటీషియన్స్ కి భిన్నంగా ఈ  ఆడిటర్  టర్నడ్ పొలిటీషియన్  తీరు ఉండడం అనేక మందికి అంతుబట్టడం లేదు. అన్నింటా సూటిగా, సెటైరికల్ గా వ్యవహరించడం సహించలేని వారంతా సాయిరెడ్డి మీద గురిపెడుతున్నారు.

అందుకు తగ్గట్టుగానే వివిధ ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో చివరకు జగన్ తో ఆయనకు విబేధాలున్నాయనే కథనాలకు సిద్ధమయ్యారు. జగన్ ఆయన్ని దూరం పెట్టేశారనే వరకూ అర్థ సత్యాలు అచ్చేయడం మొదలెట్టారు. కొందరైతే ఏకంగా జగన్ కి వ్యతిరేకంగా సాయిరెడ్డి కుట్ర చేస్తున్నారనేంత వరకూ సాగిపోయారు. కానీ జగన్- వీఎస్సార్ మధ్య వ్యవహారం తెలియని మిడిమిడి జ్ఞానం ఉన్నవాళ్లు మాత్రమే ఇలాంటి పన్నాగాలకు పూనుకుంటారని వైఎస్సార్సీపీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా వారిద్దరినీ దగ్గర నుంచి చూసిన వారంతా ఈ ఊహాగానాలకు పగలబడి నవ్వుకునే పరిస్థితి వచ్చింది. ఇక ఆ తర్వాత తాజాగా విశాఖలో సాయిరెడ్డి కనిపించలేదంటూ కొత్త ప్రచారానికి పూనుకున్నారు. ఏకంగా ఎల్జీ పాలిమర్స్ సమీపంలో విజయసాయిరెడ్డి ఇప్పటికే భూములు కొనుగోలు చేసేశారని, ఇప్పుడు ఆ కంపెనీ భూములపై కన్నేసి ఈ ప్రమాదం వెనుక కుట్ర చేశారనే అర్థం వచ్చేటంత వరకూ వెళ్లిపోయారు. నోటికి వచ్చింది చెప్పేస్తే చాలు జనం నమ్మేస్తారనే అతివిశ్వాసంతో ఉన్న అలాంటి వారికి సమాధానం ఇచ్చేందుకు కూడా వైఎస్సార్సిద్ధపడలేదు.

ప్రతిపక్ష నేత చంద్రబాబు వంటి వారు సైతం తన స్థాయి మరచి విమర్శలకు పూనుకోవడంతో విజయసాయిరెడ్డి రంగంలో దిగారు. ఇన్నాళ్లు మాటలతో సమాధానం చెప్పిన ఆయన తన చేతలే సమాధానం అని భావించినట్టు కనిపిస్తోంది. ఏ కలుగులో దాక్కున్నారంటూ కాస్త దిగువ స్థాయి విమర్శలకు పూనుకున్న చంద్రబాబు హైదరాబాద్ లోని ఆయన సొంత ప్యాలస్ లో సేదతీరుతుంటే, వీఎస్సార్ మాత్రం నేరుగా బాధితుల ఇంట్లో రాత్రి బస చేసి వారికి భరోసాగా నిలిచారు. తద్వారా అలాంటి విమర్శకుల నోళ్లు మూయించేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో ఎల్జీ పాలిమర్స్ డైరెక్టర్ రవీంద్రనాథ్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి సంబంధాలున్నాయంటూ చంద్రబాబు వంటి వారు చేస్తున్న ఆరోపణలకు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధపడుతున్నారు.

భారతీ పాలిమర్స్ ని,ఎల్జీ పాలిమర్స్ తో ముడిపెట్టాలని చేస్తున్న యత్నాల వెనుక కుతంత్రాలను ఎండగట్టేందుకు ప్రయత్నించబోతున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా జగన్ ప్రభుత్వం మీద గురిపెట్టి, ముఖ్యమంత్రిని చికాకు పెట్టేందుకే అన్నట్టుగా చేస్తున్న ఇలాంటి ప్రయత్నాల మర్మాన్ని విజయసాయిరెడ్డి తో పాటుగా జగన్ కూడా గుర్తించలేనంత అమాయకులు కాదని వారి సన్నిహితులు చెబుతున్నారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలు ప్రజల్లో ప్రతిపక్ష టీడీపీని, వారి అనుంగు మీడియాను మరింత బద్నాం చేస్తాయే తప్ప బాగు కోసం ఉపయోగపడవని అంటున్నారు. ఆంధ్రజ్యోతి లో ఓ వైపు జగన్ ని పొగుడుతున్నట్టు, మరోవైపు సాయిరెడ్డికి వ్యతిరేకంగా కథనాలు అల్లేస్తున్న వ్యవహారంలో పెద్ద వ్యవహారమే ఉందని వైఎస్సార్సీపీ అధిష్టానం గుర్తించకపోదని కూడా చెబుతున్నారు.