కొన్ని పనులు నేరుగా చేస్తేనే బాగుంటుంది. వర్చువల్ ప్రపంచానికి ఎంత దగ్గరగా వచ్చినా, ఆ పనుల్ని భౌతికంగా చేయడం వల్ల అనుభవం, ఆనందం రెండూ దక్కుతాయి. కానీ, చైనాలోని ఓ ప్రముఖ యూనివర్సిటీ మాత్రం అందుకు భిన్నంగా వెళ్ళి ట్రోలింగ్ కు గురైంది.
షాంఘై విశ్వవిద్యాలయం చైనాలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఒకటి. ఆ దేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదవే ప్రతి ఒక్కరూ ఈత నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడ ఈతను మనుషుల ఫిట్ నెస్ లో భాగంగా చూస్తారు. అయితే కరోనా కారణంగా స్విమ్మింగ్ పూల్ సహా ఇతర తరగతులతో పాటు సౌకర్యాలను సైతం తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.
ప్రాక్టికల్ స్విమ్మింగ్ టెస్టును ‘ఆన్ లైన్’ ద్వారా రాయమని విద్యార్థులను కోరింది. ఇటివలే బ్యాచిలర్స్ డిగ్రీలు పూర్తి చేసి, 50 మీటర్ల స్విమ్మింగ్ పరీక్ష రాయబోయే విద్యార్థులు ఆన్ లైన్ లో అప్లై చేయాల్సిందిగా ప్రకటన ఇచ్చింది. ఈ విధానం ద్వారా విద్యార్థులు క్యాంపస్ నెట్ వర్క్ లోకి లాగిన్ చేసి ఆన్ లైన్ లోని ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి.
ఇప్పుడు ఇదే పెద్ద ట్రోల్ మెటీరియల్ గా మారింది. ఆన్ లైన్ లో స్విమ్మింగ్ ఎలా చేస్తారో మాకు కూడా చూపించండి అంటూ ట్రోలింగ్ చేస్తున్నారు సోషల్ మీడియా యూజర్లు. పూల్ కు బదులుగా ఇంట్లోని బాత్ టబ్ లో ఈత కొట్టమంటారా? అంటూ వింత కామెంట్లు గుప్పిస్తున్నారు.