iDreamPost
iDreamPost
వీడు ఇన్‌స్టాగ్రామ్ లో ఎకౌంట్స్ తెరుస్తాడు. అందమైన అమ్మాయి ఫోటో పెడతాడు. ఇంకో ఎకౌంట్ లో డబ్బున్నోడిగా బిల్డప్ ఇస్తాడు. ఇలా రెండు రకాల ఎకౌంట్స్ తో అమ్మాయిలకు వల విసురుడుతాడు. ప్రజలకు సేవాకార్యక్రమాలు అంటాడు, ఉద్యోగాలు ఇప్పిస్తాననని వాళ్లను పరిచయం చేసుకొంటాడు. నమ్మిన తర్వాత మోసం చేస్తాడు. ఈ ఆన్ లైన్ నేరగాడి పేరు జోగాడ వంశీకృష్ణ. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నాడు. ఇతడి వలలో పడి రూ.25 లక్షలు పోగొట్టుకున్న అమ్మాయి రిపోర్ట్ చేయడంతో కేసు పెట్టారు. బండారం మొత్తాన్ని లాగారు. సైబరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, పీటీ వారెంట్‌పై కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పుడు జైళ్లో ఉన్నాడు. ఇతడు ఒకరుకాదు, దాదాపు 60 మంది నుంచి రూ.4 కోట్ల వరకు మోసం చేశాడు.
రాజమహేంద్రవరానికి చెందిన వంశీకృష్ణ బీటెక్ పూర్తి చేసి 2014లో హైదరాబాద్ కొచ్చాడు. రెండేళ్ల పాటు హోటల్‌లో, ట్రావెల్స్ కన్సల్టెన్సీలోనూ పని చేశాడు. మనోడికి ఇంకో అలవాటుకూడా ఉంది. క్రికెట్ బెట్టింగ్స్. వాటికి డబ్బులు కావాలికదా! అందుకోసం మోసాలు మొదలెట్టాడు. 2017లో గర్ల్‌ఫ్రెండ్ సుస్మితతో కలిసి మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఇన్ స్టాలో ప్రచారం చేసుకున్నాడు. దాదాపు యువతుల నుంచి రూ.1.8 కోట్లు తీసుకున్నాడు. అప్పట్లోనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల నిఘా ఉంది.
అందుకే వంశీకృష్ణ కొత్త రూట్ పట్టాడు. అమ్మాయిల పేర్లతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలు తెరిచాడు. మహిళలను పరిచయం చేసుకున్నాడు. వారితో కొన్ని రోజులు చాటింగ్ చేస్తాడు. ఆ తర్వాత హర్షవర్ధన్ అనే డబ్బున్నోడు ఉపాధి అవకాశాలు కల్పిస్తాడని చెప్పేవాడు. ఫోన్ నంబర్ పంపేవాడు. అదికూడా అతనిదే. వాళ్లతో హర్షవర్ధన్ లా మాట్లాడేవాడు.
నమ్మిన డబ్బున్న అమ్మాయిల నుంచి సేవా కార్యక్రమలంటూ డబ్బు దండుకునే వాడు. అమెరికాలో ఉంటున్న హైదరాబాద్ అమ్మాయి ఇతడికి రూ.25 లక్షలు ఇచ్చి మోసపోయింది. ఆమె ఫిర్యాదుతోనే కేసు నమోదైంది.