సింహాద్రి స్టైల్ లో ఆచార్య ఫైట్ ?

అదేంటి జూనియర్ ఎన్టీఆర్ పాత సినిమా కు చిరంజీవి కొత్త మూవీకి లింక్ ఏంటి అనుకుంటున్నారా. విషయం వేరే ఉంది లేండి. ప్రస్తుతం కరోనా వల్ల షూటింగ్ బ్రేక్ పడిన ఆచార్య అంతా సద్దుమణిగితే వచ్చే నెల మొదటివారం నుంచి మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఇక లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం ఇందులో సింహాద్రి ఇంటర్వెల్ బ్యాంగ్ తరహాలో భారీ యాక్షన్ ట్రాక్ ఒకటి కొరటాల శివ ప్లాన్ చేశాడట. అందులో పుష్కరాల బ్యాక్ డ్రాప్ లో గూస్ బంప్స్ వచ్చే ఎపిసోడ్ ఒకటుంటుంది. అక్కడే తారక్ సింగమలై అనే సీక్రెట్ బయట పడుతుంది.

అచ్చం అలాగే కాకపోయినా అదే స్టైల్ లో ఆచార్యలోనూ రాజమండ్రి నది నేపథ్యంలో రామ్ లక్ష్మణ్ లు దీన్ని కంపోజ్ చేశారట. మొదట దీన్ని బయట షూట్ చేద్దామని అనుకున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అవుట్ డోర్ రిస్క్ అవుతోంది కాబట్టి ఫిలిం సిటీలోనే గ్రీన్ మ్యాట్ టెక్నాలజీ వాడి పూర్తి చేయాలనీ నిర్ణయించుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. ఆగస్ట్ రిలీజ్ టార్గెట్ చేసుకున్న ఆచార్య అనుకున్న లక్ష్యం నెరవేర్చుకోవడం అంత సులభంగా కనిపించడం లేదు. ఇప్పటికీ ఫ్లాష్ బ్యాక్ ట్రాక్ మహేష్ బాబు చేస్తాడా లేక రామ్ చరణ్ ఉంటాడా అనే క్లారిటీ రానే లేదు.

మరోవైపు త్రిష తప్పుకున్నాక హీరోయిన్ ని ఎంచుకోవడం పెద్ద సవాల్ గా మారింది. కాజల్ అగర్వాల్ అని రెండు మూడు రోజులు హడావిడి నడిచింది కానీ ఇప్పుడు అంతా గప్ చుప్. కొరటాల శివ తన ఫార్ములాలోనే సోషల్ మెసేజ్ ఇస్తూ కమర్షియల్ అంశాలకు లోటు లేకుండా చూసుకుంటున్నట్టు వినికిడి. కరోనా దెబ్బకు అంతా అల్లకల్లోలం అయిపోయింది కాబట్టి ఏ కొత్త సినిమా విడుదల గురించి ఖచ్చితమైన గెస్ చేసే అవకాశం లేకుండా పోయింది. మణిశర్మ సంగీతం సమకూరుస్తున్న ఆచార్యలో ఇప్పటిదాకా రెజీనా స్పెషల్ సాంగ్, ఇంట్రో పాట పూర్తి చేశారు. ఇంకో రెండు పాటల బాలన్స్ తో పాటు కీలకమైన టాకీ పార్ట్ తీయాల్సి ఉంది. ఉగాదికి ప్లాన్ చేసిన ఫస్ట్ లుక్ కూడా వాయిదా పడిపోయింది.

Show comments