iDreamPost
android-app
ios-app

వినోదం ,వైవిధ్యం,వివాదం,విషాదం,విచిత్రం..

వినోదం ,వైవిధ్యం,వివాదం,విషాదం,విచిత్రం..

ఎన్టీఆర్ జీవితం ఒక పాఠం.. అందులో ఒక విజేత కథ,ఒక స్ఫూర్తి ని ఇచ్చే కథ ఉంది. ఎన్టీఆర్ జీవితంలో వైవిధ్యం ఉంది వివాదం ఉంది… మలి జీవితంలో విషాదం జీవితానంతరం విచిత్రం ఉంది..

వినోదం
ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఎన్ని కమర్షియల్ సినిమాలు తీస్తున్నా ఆయన లక్ష్యం మాత్రం ‘మహాభారతం’ తెరకెక్కించటమేనని పలు మార్లు చెప్పారు. నిజానికీ ‘మహాభారతం’ సినిమాగా తీయాలంటే అందుకు తగ్గ నటులు ప్రస్తుతం దొరకడం కష్టం – ల ళ, న ణ, ద డ, గ ఘ, స శ ష అక్షరాలున్న పదాల్ని సరిగ్గా పలకలేని నటులు, గాయకులు ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో పద్యాలు, శ్లోకాలతో మహాభారతం తీయాలంటే కొంచెం కష్టమే. కానీ ఒక ఉపాయం ఉంది, అదే ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న సాంకేతికత. దాదాపు ఇరవై ఏళ్ళ ముందు వచ్చిన ‘కలిసుందాం రా’ చిత్రంలోని ఒక పాటలో; పదమూడేళ్ల ముందు వచ్చిన ‘యమదొంగ’ సినిమాలోని ఒక సన్నివేశంలో.. 

ఆయా సమయాల్లో అందుబాటులో ఉన్న సాంకేతికతను ఉపయోగించుకుని, అప్పటికే కాలం చేసిన ఒక గొప్ప నటుణ్ణి తెర మీద నటింపజేశారు. అలా మహాభారతంలోని కృష్ణుడు, దుర్యోధనుడు, కర్ణుడు, భీష్ముడు, బృహన్నల, భీముడు, అర్జునుడు – ఇలా కొన్ని పాత్రలకు ఒక నటుడు జీవం పోశాడు.

ఆయా సినిమాల నుంచి ఆ పాత్రల భాగం వరకు తీసుకుని ప్రస్తుతమున్న సాంకేతికత సహాయంతో వాడుకోవడం అసాధ్యమేమీ కాదు. ఆ ప్రయోగం సఫలమయ్యి రాజమౌళి బాటలో మరో ఏ దర్శకుడైనా ‘రామాయణం’ తీయడానికి ముందుకొస్తే భిన్న ప్రవృత్తులు కలిగిన రామ రావణ పాత్రల్లోనూ ఆయనే జీవించిన సినిమాలు ఉన్నాయి కనుక అవీ ఉపయోగించుకోవచ్చు – ప్రస్తుతం ఉన్న నటుల్ని తక్కువ చేయడం కాదు కానీ తెలుగు సినిమా ప్రేక్షకులు ఆయా పాత్రల్లో మరొకరిని ఊహించుకోడానికి కూడా ఆస్కారం లేనంతగా ఆ పాత్రలకు ఒక ఆహార్యాన్ని, ఆంగికాన్ని ఆయన అన్వయింపజేశాడని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు … అవును ఆయనే నందమూరి తారక రామారావు, అనుమానమే అవసరం లేదు … ఆయన ‘విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు’ – పౌరాణిక, జానపద, సాంఘిక,చారిత్రక చిత్రాల్లో తన నటనతో తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరస్థానం సంపాదించుకున్న నటుడు ‘ఎన్టీఆర్’ – అది కేవలం మూడు అక్షరాల పేరు కాదు, తెర మీద కనిపించే మెస్మరైజింగ్ పవర్. దానికి సాక్ష్యమే – ఆయన కుటుంబం నుంచి వచ్చిన మూడో తరానికి కూడా ప్రేక్షకుల్లో నేటికీ లభిస్తున్న ఆదరణ.

మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించిన ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంపై చెరగని ముద్ర వేశారు, ఆయన సమకాలీనులకు, ఆయన తర్వాత వచ్చిన ఎందరో నటులకు ఆయన క్రమశిక్షణ, సమయపాలన, సంపాదన-పొదుపు ఆదర్శప్రాయం అయ్యాయి. తెర మీద విభిన్న పాత్రలకు జీవం పోసిన ఎన్టీఆర్, తెర వెనుక కూడా నిర్మాత నుంచి ఎగ్జిబిటర్ దాకా సినిమాకు సంబంధించి దాదాపు అన్ని పాత్రలూ పోషించిన సినిమా కార్మికుడు. ఒక వైపు సంవత్సరానికి పదికి పైగా సినిమాలు చేస్తూ మరో వైపు దివిసీమ ఉప్పెన, రాయలసీమ కరువు బాధితుల కోసం; పోలీసుల సంక్షేమ నిధి కోసం, దేశ రక్షణ నిధి కోసం సినిమా పరిశ్రమలోని సహనటీనటుల్ని కదిలించి, నడిపించి విరాళాలు సేకరించి ‘కళాకారులకు సామాజిక బాధ్యత అవసరం’ అని నిరూపించాడు.

వైవిధ్యం

సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగిడిన ఎన్టీఆర్ అక్కడా తన ప్రత్యేకతను చాటుకున్నారనే చెప్పాలి. ‘తెలుగుదేశం’ పేర రాజకీయ పార్టీ పెట్టి,తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టి రికార్డు విజయాన్ని సొంతం చేసుకున్నారు. పార్టీ పేరు నుంచి ప్రతీది తానే దగ్గరుండి చూసుకున్నారని పార్టీలోని చాలా మంది సీనియర్ నాయకులు పలు సందర్భాల్లో చెప్పారు. ‘తెలుగుదేశం పార్టీ – తెలుగువాడి ఆత్మగౌరవం’ అనే నినాదంతో జనాల్లోకి వెళ్లిన ఎన్టీఆర్ నెలలపాటు ఏక బిగిన ‘చైతన్యరథం’ పైన రాష్ట్రం మొత్తం తిరిగి ప్రచారసభలు నిర్వహించారు. ఆయన కార్యదీక్షకు నిదర్శనం -కుమారుడు బాలకృష్ణ వివాహానికి కూడా హాజరుకాకుండా పార్టీ ప్రచారంలోనే నిమగ్నమవ్వడం.

భారీ విజయాన్ని సొంతం చేసుకుని ముఖ్యమంత్రి అయిన ఒకటిన్నర సంవత్సరానికే పార్టీలోని కీలక సభ్యుడైన నాదెండ్ల భాస్కరరావు చేత వెన్నుపోటుకు గురయ్యారు. రాష్ట్రం మొత్తం అలజడులు రేగాయి, భాస్కరరావు వైపు నిలబడ్డ ఎమ్మెల్యేలందరి ఇళ్ళను జనం చుట్టుముట్టి నిరసన తెలియజేయడం ప్రారంభించారు. ఎన్టీఆర్ తనకు మద్దతుగా నిలబడ్డ శాసనసభ్యులందరినీ తీసుకుని వెళ్లి ఢిల్లీలో రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహించారు. అక్కడి నుంచి తిరిగి వచ్చే సమయంలో ఆయన వెంట జాతీయ మీడియా ప్రముఖులు కూడా చేదోడు వాదోడుగా నిలబడ్డారు. రాష్ట్రంలోని ప్రధాన మీడియా ఎన్టీఆర్ కు అండగా నిలబడిన మాట కూడా కాదనలేని వాస్తవం. పదవీచ్యుతుడైన నెల రోజుల్లోనే తిరిగి ఎన్టీఆర్ మరో సారి ముఖ్యమంత్రి అవ్వడం మరో రికార్డు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నిటినీ ఏకతాటి మీదకు తీసుకురావడంలోనూ ఎన్టీఆర్ సఫలీకృతులయ్యారు.

పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, మహిళా యూనివర్సిటీ, కిలో బియ్యం అయిదు రూపాయలు ఉన్న రోజుల్లో రెండు రూపాయలకు కిలో బియ్యం, ఆస్తి లో ఆడవాళ్ళకు హక్కు, హైదరాబాద్ నిమ్స్ తరహాలో తిరుపతిలో స్విమ్స్, సంపూర్ణ మధ్య నిషేధం వంటి ఎన్నో వైవిధ్యమైన నిర్ణయాలతో కూడుకున్నది ఎన్టీఆర్ రాజకీయ ప్రయాణం.

వివాదం
ప్రతి నాణానికీ రెండు వైపులున్నట్టే ఎన్టీఆర్ రాజకీయ జీవితం కూడా వివాదాలకు అతీతం కాదు. ఆస్థాన పదవులు,పలు అకాడమీలు, కార్పొరేషన్లు, శాసన మండలి, మిరాశీ వ్యవస్థను రద్దు చేయడం వంటి నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును ఉన్నపళంగా రెండేళ్లు కుదించడం ఎందరి జీవితాలనో కుదేలు చేశాయి. మరో రెండు సంవత్సరాల పాటు ఉద్యోగం చేస్తామన్న ధీమాతో చేసుకున్న భవిష్యత్తు కార్యాచరణ మొత్తం ఒక్కసారిగా తలకిందులవ్వడంతో ఎందరి గుండెలో ఆగిపోయాయి. సినిమాల్లో మాదిరిగానే పదవిలో కూడా కాషాయ వస్త్రాలు ధరించి బహుపాత్రాభినయం చేయడం; ‘తెలుగు విజయం’ పేర హైదరాబాద్ గండిపేటలో ఒక ఆశ్రమాన్ని కట్టుకుని అక్కడి నుంచి కార్యకలాపాలు జరపడం చాలా మందికి రుచించేది కాదు.

అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలే ఐదేళ్లు తిరక్కుండానే ఎన్టీఆర్ ను ప్రతిపక్షంలో కూర్చోమని తీర్పునిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ తనదైన శైలిలో నెగ్గుకొచ్చారు. ఒకానొక సందర్భంలో – సభ నుంచి తనను అకారణంగా సస్పెండ్ చేశారని ‘తిరిగి ముఖ్యమంత్రిగానే సభలో అడుగుపెడతా’ అని సవాల్ విసిరి బయటకు వచ్చేశారు. అన్న మాట ప్రకారమే 1994లో ముఖ్యమంత్రి అయ్యాకే సభలోకి వెళ్లారు.

ప్రతిపక్షంలో ఉండగా తన జీవిత చరిత్ర రాయడానికి దగ్గరైన మహిళ శ్రీమతి లక్ష్మిపార్వతి. దాదాపు పన్నెండు మంది సంతానం ఉన్నా ఎన్టీఆర్ ను ఒంటరిని చేశారని చాలా మంది చెప్పే మాట. ఆ సమయంలో సన్నిహితురాలైన లక్ష్మీ పార్వతిని తాను వివాహం చేసుకోబోతున్నట్టు తిరుపతిలో జరిగిన ‘మేజర్ చంద్రకాంత్’ సినిమా శతదినోత్సవ వేడుకల్లో ఎన్టీఆర్ భారీ జనసందోహం మధ్య ప్రకటించారు. అప్పటికే ఒక బిడ్డకు తల్లి అయిన లక్ష్మీపార్వతికి తన భర్తతో విడాకులు ఇప్పించాడనే అభియోగం కూడా ఎన్టీఆర్ పై ఉంది. కాషాయం ధరించి, సన్యాసం స్వీకరించిన తర్వాత ఏడు పదుల వయసులో మళ్ళీ వివాహం చేసుకోవడంతో పలు విమర్శలకు గురయ్యారు. ఇవన్నీ 1994 ఎన్నికల ముందు జరిగినా కూడా – ఎన్టీఆర్ ఛరిష్మా ముందు ఏవీ నిలబడలేదు. ఆ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు ఎన్టీఆర్.

విషాదం

ఆగస్టు గండం మరోసారి ఎన్టీఆర్ ను వెక్కిరించింది. మొదటి సారి వెన్నుపోటు పొడిచింది పార్టీలోని కీలక నేత. అతని మీద ఎన్టీఆర్ పోరాడారు, గెలిచారు. కానీ రెండో సారి పరిస్థితి అది కాదు – కన్న కూతురి భర్త, స్వయానా అల్లుడు అయిన చంద్రబాబు నాయుడు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో కలిసి, బావమరుదులు హరికృష్ణ, బాలకృష్ణలకు

మాయమాటలు చెప్పి, ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని అడ్డు పెట్టుకుని ఎన్టీఆర్ వద్ద నుంచి ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబు లాక్కున్నారు.

చంద్రబాబు చేసింది రాజ్యాంగబద్ధమే కావచ్చు కానీ – ఎన్టీఆర్ అనే పేరున్నంత కాలం – ‘తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మిపార్వతికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు కనుకనే పదవి కోల్పోయార’నే మచ్చను మిగిల్చేశారు చంద్రబాబు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించడానికి ఒక పథకం ప్రకారం ఆమె జోక్యం ఎక్కువైందని ప్రచారం చేయించి, దాన్ని అడ్డుపెట్టుకుని అనుకున్న పనిని చంద్రబాబు దిగ్విజయంగా పూర్తి చేశారు.

నాదెండ్ల భాస్కరరావు వెన్నుపోటు సమయంలో బెంగళూరు వద్ద నున్న నంది హిల్స్ లో ఎమ్మెల్యేల క్యాంపు ఏర్పాటు చేశారు. ఆ క్యాంపు నిర్వహణలో ప్రధాన భూమిక పోషించిన చంద్రబాబు అదే అనుభవంతో హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో క్యాంపు నడిపారు. హోటల్ బయట నుంచి పార్టీ ఎమ్మెల్యేలనుద్దేశించి బయటకు రమ్మని వేడుకుంటున్న ఎన్టీఆర్ మీద హోటల్ లోపలి నుంచి చెప్పులు పడ్డాయి. దాంతో ఖిన్నుడైన ఎన్టీఆర్ కన్నీళ్ల పర్యంతం అయ్యారు, కన్న తండ్రి మీద చెప్పులు పడుతున్నా ఎన్టీఆర్ కుమారుడు హరికృష్ణ లోపల ఉండడం ఎన్టీఆర్ ను మరింత కృంగదీసింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల తర్వాత బలనిరూపణకు సభలో మాట్లాడే అవకాశం కూడా ఎన్టీఆర్ కు ఇవ్వలేదు, ఎట్టకేలకు ఒక పథకం ప్రకారం ఎన్టీఆర్ ను పదవీచ్యుతుణ్ణి చేశారు. అంతటితో ఆగకుండా పార్టీ మీద, గుర్తు మీద, చివరికి పార్టీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలోని డబ్బు మీద కూడా ఎన్టీఆర్ కు అధికారం లేదని తేల్చారు. మానసికంగా కృంగిపోయిన ఎన్టీఆర్ ఇవన్నీ జరిగిన కొద్దికాలానికే కాలం చేశారు.

“నా జీవితం మొత్తంలో నేను చేసిన ఒకే ఒక్క తప్పు – వాడిని నమ్మడం”(ఇటీవల వచ్చిన ‘లక్ష్మీ’స్ ఎన్టీఆర్’ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర, చంద్రబాబు పాత్రనుద్దేశించి చెప్పే డైలాగ్ ఇది)

అది సినిమా డైలాగే కావచ్చు కానీ అది నిజానికీ ఎన్టీఆర్ రెండో సారి పదవి కోల్పోయిన నాటి నుంచి చనిపోయేంత వరకు .. చంద్రబాబు తనకు చేసిన మోసాన్ని, తన వెంటే ఉండి తవ్విన గోతుల్ని, తనకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని పలు వేదికల్లో పూసగుచ్చినట్టు ప్రజలకు చెప్పిన విషయాలన్నిటినీ కలిపి క్లుప్తంగా ఒక్క వాక్యంగా ఆవిష్కరించబడ్డ అక్షరసత్యం ఆ డైలాగ్ అనుకోవచ్చు.

విచిత్రం

ఎవరైతే ఎన్టీఆర్ అవసరమే తమకు లేదన్నారో …

వారే ఇప్పుడు ఎన్టీఆర్ తమకు దేవుడంటున్నారు,

ఎవరైతే ఎన్టీఆర్ కు కనీస నైతిక విలువలు లేవన్నారో …

వారే ఇప్పుడు ఎన్టీఆర్ తెలుగు జాతికి ప్రతీక అంటున్నారు

ఎవరైతే ఎన్టీఆర్ కి, తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదన్నారో …

వారే ఇప్పుడు ఎన్టీఆరే తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అంటున్నారు,

ఎవరైతే ఎన్టీఆర్ బొమ్మ కూడా పార్టీ కార్యక్రమాల్లో లేకుండా అప్పట్లో తీయించేశారో …

వారే ఇప్పటికీ ఎన్టీఆర్ బొమ్మ చూపించే తమ అస్థిత్వాన్ని కాపాడుకోవాలని చూస్తున్నారు.

ఎన్టీఆర్ 24 వ వర్ధంతి సందర్భంగానైనా ‘భారతరత్న’ ఇవ్వాలనే తీర్మానం ఇక మీద తెలుగుదేశం పార్టీ చేయకపోవడం మంచిది, అదే ఆయనకు గౌరవప్రదం కూడా. ‘తెలుగుదేశం’ పార్టీ అధికారంలో ఉండగా ఎన్నడూ కేంద్రానికి ప్రతిపాదన పంపకుండా, కేవలం తమ పార్టీ ‘మహానాడు’లో తీర్మానం చేస్తే సరిపోతుందా ? లేకపోతే కేంద్రం ఎన్టీఆర్ కు ఒకవేళ ‘భారతరత్న’ ప్రకటించేస్తే ఆయన భార్య హోదాలో ఆ అవార్డు లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారని చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం ఆ ప్రతిపాదన పంపలేదనుకోవాలా ?

దేదీప్యమానంగా సినీరాజకీయ రంగాల్లో వెలుగొందిన ఎన్టీఆర్ చివరకు

“మళ్ళీ ఎప్పుడు పుడతావు నాన్నా” అంటూ పిల్లలు పేపర్లలో ప్రకటన కోసం …

“మళ్లీ ఎన్నికలప్పుడే మామా” అంటూ అల్లుడు ఎన్నికల పోస్టర్ల మీద ప్రచారం కోసం …

వాడుకోవడానికి ఒక ఫోటో గా మిగిలిపోవడం బాధాకరం.