iDreamPost
android-app
ios-app

ఉన్మాది ఎన్‌కౌంటర్ – చెర నుండి పిల్లల విడుదల

ఉన్మాది ఎన్‌కౌంటర్ – చెర నుండి పిల్లల విడుదల

క్లబ్బుపై దుండగుడి కాల్పులు.. పాఠశాల విద్యార్థులపై ఆగంతకుడి విచక్షణా రహిత కాల్పులు.. ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తల్లో వింటూ ఉంటాం.. జీవితం మీద విరక్తి చెంది, మతి స్థిమితం కోల్పోయి శాడిజంతో ప్రజలపై దాడి చేస్తూ ప్రజలను అకారణంగా పొట్టన పెట్టుకుంటూ ఉంటారు కొందరు. విదేశాల్లో మాత్రమే కనిపించిన ఈ సంస్కృతి ఇప్పుడు జడలు విప్పి మన దేశంలో కూడా అడుగు పెట్టిందని ఉన్మాదిగా మారిన సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి చేసిన పని వల్ల అర్ధం చేసుకోవచ్చు.

వివరాల్లోకి వెళ్తే నిన్న రాత్రి సుభాష్‌ బాథమ్‌ అనే వ్యక్తి ఉన్మాదిలా మారి 23 మంది పిల్లలను చెరబట్టాడు. కొన్ని గంటల పాటు వారిని తన ఇంటిలో బంధించి, ఆ పిల్లల తల్లిదండ్రులను , ప్రభుత్వాన్ని , ప్రజలను ఠారెత్తించాడు. ఎవరైనా అడుగు ముందుకేస్తే చిన్నారుల ప్రాణాలను తీస్తానంటూ వీరంగం సృష్టించాడు. గ్రైనేడ్లు, తుపాకీ కాల్పులతో విరుచుకు పడ్డాడు. దీంతో ఉత్తరప్రదేశ్ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ కమెండోలను రంగంలోకి దించి నేరగాడైన సుభాష్ ను కాల్చి చంపి బందీలుగా ఉన్న పిల్లల్ని కాపాడారు.

సుభాష్ బాథమ్ ఒక మహిళ హత్య కేసులో శిక్ష అనుభవించి పెరోల్ పై బయటకు వచ్చాడు. తాను ఆ హత్య చేయలేదని ఆ సమయంలో వేరే ప్రాంతంలో ఉన్నానని వాదించినా, కొందరు గ్రామస్తులు మాత్రం హత్య జరిగిన సమయంలో సుభాష్ అక్కడే ఉన్నాడని సాక్ష్యం చెప్పారు. దాంతో సుభాష్ కి శిక్ష పడింది. అప్పటినుండి గ్రామస్తులపై పగ పెంచుకున్న సుభాష్ తన పగ తీర్చుకోవడానికి క్రూరమైన పథకం రచించాడు. ఆ పథకాన్ని అమలు చేయడానికి తన కూతురి పుట్టిన రోజును వాడుకున్నాడు.

గురువారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కసారియా గ్రామంలోని తన ఇంటికి సమీపంలో ఉన్న ఇతర ఇళ్లకు వెళ్లి తన కుమార్తె పుట్టినరోజు ఉందనీ, వెంటనే పిల్లల్ని పంపించాలని అందరినీ కోరాడు. పుట్టిన రోజు వేడుక కాబట్టి తమ పిల్లలను సుభాష్ ఇంటికి పంపారు గ్రామస్తులు. 23 మంది పిల్లలను తన ఇంట్లో బంధించి లోపలినుండి తాళం వేసాడు.తన భార్య, పిల్లలను కూడా బంధించాడు. దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు నిందితుడి ఇంటికి వెళ్లగా, ఎవరైనా వస్తే పిల్లలను చంపుతానని బెదిరించాడు. తుపాకీతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. నాటు బాంబు కూడా ఉపయోగించాడు.

‘నేను మీ ఎవరితోనూ మాట్లాడను, ఎమ్మెల్యేను పిలిపించండి’ అని హల్చల్ చేసాడు. వెంటనే భోజ్‌పూర్‌ ఎమ్మెల్యే నాగేంద్రసింగ్‌ వచ్చి మాట్లాడటానికి ప్రయత్నించినా సుభాష్ బాథమ్ చర్చలు జరపలేదు. కలెక్టర్ డీజీపీ మాట్లాడేందుకు ప్రయత్నించినా సుభాష్ బాథమ్ పిల్లలను బయటకు పంపడానికి ఒప్పుకోలేదు. దీంతో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ సంఘటనను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్ పోలీసులు, స్పెషల్ ఆపరేషన్ కమెండోలను రంగంలోకి దించి నేరగాడైన సుభాష్ ను కాల్చి చంపి పిల్లల్ని కాపాడారు.

సుభాష్‌ మానసిక స్థితి సరిగా లేదని, ఎపుడేం చేస్తాడో తెలియదని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇలా కొన్ని గంటలపాటు పోలీసులకు, ప్రజలకు, ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించిన ఉన్మాది చివరికి,పోలీసులు ఎన్‌ఎస్‌జీ కమాండోలు చేపట్టిన ఆపరేషన్ లో హతమయ్యాడు. నిందితుడి చెరలో ఉన్న 23 మంది పిల్లలు సురక్షితంగా బయట పడటంతో పిల్లల తల్లిదండ్రులు,అధికారులు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు.