Idream media
Idream media
ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ.. అదే మజ్లిస్. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ సీట్లలో తనకంటూ ఎప్పుడూ కొన్ని సీట్లను రిజర్వ్ చేసుకుని పెట్టుకుంటుంది. ఎన్నిక ఏదైనా పాతబస్తీలో ఆ పార్టీకి తిరుగులేదు. భారతీయ జనతా పార్టీ కొన్ని స్థానాల్లో గట్టి పోటీ అయితే ఇవ్వగలుగుతుంది కానీ.. పాగా వేయలేకపోతోంది. 2016 ఎన్నికల్లో కేవలం 2 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. మజ్లిస్ పార్టీ 60 స్థానాల్లో పోటీ చేయగా.. 44 చోట్ల విజయం సాధించింది. గత ఎన్నికలే కాదు.. ఎప్పుడైనా మజ్లిస్ 40కు పైగా సీట్లను సాధించుకుంటుంది. ఎంసీహెచ్ నుంచి జీహెచ్ఎంసీ వరకూ పాతబస్తీలో మజ్లిస్ దే హవా.
1986లో మేయర్ పీఠం మజ్లిస్ దే
ఏ పార్టీ మేయర్ పీఠం దక్కించుకున్నా.. దానికి మజ్లిస్ సపోర్టు ఉండాల్సిందే. 1986లో జరిగిన ఎన్నికల్లో మేయర్ పీఠం మజ్లిస్ పార్టీదే. ఎంసీహెచ్ గా ఉన్నప్పటి నుంచీ మేయర్ పీఠం దక్కించుకోవడంలో ఆ పార్టీ తనదైన మార్క్ చూపుతూ వస్తోంది. 1986లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ కార్పొరేటర్లను సాధించి ఎంఐఎం పార్టీ మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. అంతేకాదు.. ఆ పదవిని ఏడాదికో ఒకరికి కేటాయించి విభిన్న పద్ధతిని పాటించింది. 1986 నుంచి 1991 వరకు ఏడాదికి ఒకరిని మేయర్ గా మార్చింది. అనంతరం 2002లో మేయర్ కు ప్రత్యక్ష ఎన్నికలు జరిగాయి. అప్పుడు టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి మేయర్ గా గెలుపొందారు. తిరిగి 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠం అధిరోహించింది. అది కూడా మజ్లిస్ సహకారంతోనే. ఐదేళ్ల పదవీ కాలంలో రెండున్నరేళ్లు కాంగ్రెస్, రెండున్నరేళ్లు మజ్లిస్ మేయర్ పదవి పొందేలా ఒప్పందం చేసుకున్నాయి. దీనిలో భాగంగా కాంగ్రెస్ నుంచి బండ కార్తీక రెడ్డి, మజ్లిస్ నుంచి మాజిద్ హుస్సేన మేయర్ గా కొనసాగారు. 2016లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కే 99 స్థానాలు రావడంతో సొంతంగా మేయర్ పీఠం దక్కించుకుంది. అయినప్పటికీ మజ్లిస్ తో స్నేహపూర్వక దోస్తీ కొనసాగించింది. 2020 ఎన్నికల్లో మజ్లిస్ 51 స్థానాల్లో పోటీ చేస్తోంది. కచ్చితంగా మెజార్టీ స్థానాలు సాధించి మేయర్ పీఠం అధిరోహించడంలో కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి.
ఆ అభ్యర్థులు ఇతర వర్గానికి చెందినవారు..
ఈ సారి గ్రేటర్ ఎన్నికల్లో మొత్తం 51 స్థానాల్లో మజ్లిస్ పోటీ చేస్తోంది. వారిలో ఐదుగురు ముస్లిమేతరులు ఉన్నారు. ఫలక్‌నుమా డివిజన్ నుంచి కె. తారాబాయి పోటీ చేస్తున్నారు. గతంలో కూడా ఆమె అక్కడి నుంచి గెలుపొంది ప్రస్తుతం కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. పురానాపుల్ డివిజన్ నుంచి సున్నం రాజ్‌మోహన్ పోటీ చేస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో ఆయనే అక్కడి నుంచి కార్పొరేటర్‌గా ఎంపికై ప్రస్తుతం కొనసాగుతున్నారు. కార్వాన్ డివిజన్ నుంచి మందగిరి స్వామి నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో రాజేందర్ యాదవ్ విజయం సాధించి కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. జాంబాగ్ డివిజన్ నుంచి జడల రవీంద్ర నామినేషన్ దాఖలు చేశారు. గతంలో ఎంఐఎం తరపున డి.మోహన్ గెలుపొంది కార్పొరేటర్‌గా కొనసాగుతున్నారు. రంగారెడ్డి నగర్ నుంచి ఇ.రాజేశ్‌గౌడ్ మజ్లిస్ పార్టీ తరపున కార్పొరేటర్‌గా కొనసాగుతూ తాజాగా నామినేషన్ దాఖలు చేశారు.