iDreamPost
android-app
ios-app

హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సీన్‌.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు..!

  • Published May 04, 2024 | 9:23 AM Updated Updated May 04, 2024 | 9:26 AM

Lok Sabha Election 2024: హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం వేళ అరుదైన దృశ్యం కనిపించింది. ఎంఐఎం హైదరాబాద్‌ ఎంపీ క్యాండెట్‌ అసదుద్దీన్‌ ఓవైసీకీ హిందూ పురోహితులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..

Lok Sabha Election 2024: హైదరాబాద్‌ ఎన్నికల ప్రచారం వేళ అరుదైన దృశ్యం కనిపించింది. ఎంఐఎం హైదరాబాద్‌ ఎంపీ క్యాండెట్‌ అసదుద్దీన్‌ ఓవైసీకీ హిందూ పురోహితులు మద్దతివ్వడం ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు..

  • Published May 04, 2024 | 9:23 AMUpdated May 04, 2024 | 9:26 AM
హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సీన్‌.. అసదుద్దీన్‌ ఒవైసీకి పురోహితుల మద్దతు..!

తెలంగాణలో పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. పార్టీలన్నీ జోరు పెంచాయి. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ.. పార్లమెంట్‌ ఎన్నికల్లో కూడా భారీ విజయం సాధించాలని నిర్ణయించుకుని.. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక తెలంగాణ ఎన్నికల్లో రాష్ట్రమంతా ఒక ఎత్తు.. హైదరాబాద్‌ ఒక ఎత్తు. భాగ్యనగరంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ, జాతీయ స్థాయి పార్టీలు అడుగు కూడా పెట్టలేవు. దశాబ్దాలుగా అక్కడ ఏఐఎంఐఎం పార్టీ హవానే కొనసాగుతుంది. అయితే ఈ సారి ఎంఐఎంకి గట్టి పోటీ ఇచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా హైదరాబాద్ బరిలో ఎంఐఎం నుంచి ఓటమి ఎరుగని అసదుద్దీన్ ఒవైసీపై పోటీకి.. బీజేపీ నుంచి కొంపెల్ల మాధవీలత పోటీ చేస్తున్నారు.

దాంతో ఈ సారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే మాధవీలత ఎంతో దూకుడుగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆమె తరఫున బీజేపీ పెద్దలు అమిత్‌ షా వంటి వారు స్వయంగా రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. హైదరాబాద్‌లో కచ్చితంగా గెలవాలనే లక్ష్యంతో కాషాయ పార్టీ తీవ్రంగా కృషి చేస్తోంది. దీంతో.. హైదరాబాద్‌ బరిలో మిగతా పార్టీల సంగతి పక్కకు పెడితే.. ఎంఐఎం వర్సెస్ బీజేపీగా పరిస్థితి మారిపోయింది.

ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. ఎన్నికల హీటు పెంచుతున్నారు. దాంతో అందరి దృష్టి హైదరాబాద్‌పైనే పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. బీజేపీ నేతలకు ఒవైసీకి మధ్య మాటల యుద్ధం కూడా నడుస్తోంది. నరేంద్ర మోదీ కూడా ముస్లింల గురించి కామెంట్లు చేయటం వాటిపై స్పందిస్తూ.. ఒవైసీ ఘాటుగా బదులిస్తుండటంతో.. ఇక్కడ రాజకీయ హీటు భారీగా పెరిగింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండగా.. ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో.. నేతలంగా ప్రచార స్పీడు పెంచారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు అసదుద్దీన్‌ ఒవైసీ. ఈ సందర్భంగా అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఓవైసీకీ.. స్థానికంగా ఉన్న కొందరు పురోహితులు మద్దతు తెలపటం ఆసక్తికరంగా మారింది.

అసదుద్ధీన్ ఒవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా.. శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో ముగ్గురు పురోహితులు అసదుద్దీన్‌ను కలిసి.. ఆయనకు పూలమాల వేసి మరీ మద్దతు తెలిపారు. అందుకు సబంధించిన ఫొటోను అసదుద్దీనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్‌ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. మతాలతో సంబంధం లేకుండా.. అన్నీ పార్టీల వారు మజ్లిస్ పార్టీకి అండగా నిలబడ్డారంటూ రాసుకొచ్చారు ఒవైసీ. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.