iDreamPost
android-app
ios-app

ఫ్యాన్స్ దెబ్బకు నో మల్టీస్టారర్స్ – Nostalgia

  • Published Feb 10, 2020 | 11:07 AM Updated Updated Feb 10, 2020 | 11:07 AM
ఫ్యాన్స్ దెబ్బకు నో మల్టీస్టారర్స్ – Nostalgia

ఒకప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ లు కలిసి 14 సినిమాల్లో కలిసి నటించడం ఇప్పటికీ అన్ బీటబుల్ రికార్డుగా నిలిచిపోయింది. ఎన్ని తరాలు మారినా దాన్ని ఎవరూ చెరపలేకపోయారు. కనీసం ఏ ఇద్దరూ చిన్న హీరోలు కలిసి అన్నేసి సినిమాల్లో నటించే పరిస్థితి కూడా ఇప్పుడు లేదు. దీనికి కారణం హీరోలు ఆలోచనా విధానం మారిందా లేక అభిమానుల ఒత్తిడా అనేది అర్థం కావాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి.

1985లో స్టార్ డైరెక్టర్ కోదండరామిరెడ్డితో సంయుక్త మూవీస్ వారు కృష్ణ, శోభన్ బాబులు హీరోలుగా రిచ్ క్యాస్టింగ్ తో మహా సంగ్రామం అనే భారీ బడ్జెట్ సినిమా తీశారు. అప్పటికే ఆ బ్యానర్ లో ఈ దర్శకుడు ఖైదీ లాంటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. వేట ఆశించిన స్థాయిలో ఆడకపోయినా కృష్ణ, శోభన్ బాబులను డీల్ చేసే సత్తా ఆయనకే ఉందన్న నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించారు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రెడీ చేశారు. అనుకున్న దాని కన్నా బడ్జెట్ చాలా ఎక్కువే అయ్యింది. పరిశ్రమతో పాటు బయ్యర్లలోనూ దీని మీద విపరీతమైన అంచనాలు. అప్పటికీ సినిమా స్కోప్ నిర్మాణం ఖరీదైన వ్యవహారం. అయినా నిర్మాతలు వెనుకాడలేదు

శోభన్ బాబు పోలీస్ ఆఫీసర్ గా, కృష్ణ నక్సలైట్ గా రూపొందిన ఈ చిత్రం రిలీజై ఆకాశమే హద్దుగా ఉన్న హైప్ ని అందుకోలేక చతికిలబడింది. తమ హీరో పాత్రను సరిగా డిజైన్ చేయలేదని, ప్రాధాన్యత తగ్గించారని శోభన్ బాబు అభిమానులు బాగా హర్ట్ అయ్యారు. నేరుగా ఆయనకే ఫిర్యాదు చేశారు. కొన్ని థియేటర్ల వద్ద గొడవలు జరిగాయి. కథ రాసుకునే క్రమంలోనే తప్పు జరిగిందని గుర్తించిన శోభన్ బాబు పరుచూరి సోదరుల మీద ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో కథనాలు వచ్చాయి.

దీంతో ఇకపై మల్టీ స్టారర్స్ చేయనని శోభన్ బాబు ఏకంగా యాడ్ రూపంలో ప్రకటించేశారు. అప్పటికి కానీ ఫ్యాన్స్ శాంతించలేదు. పోనీ కృష్ణ అభిమానులైనా హ్యాపీనా అంటే అదీ జరగలేదు. ఫైనల్ గా మహాసంగ్రామం ఫ్లాప్ గా మిగిలి నిర్మాతకు, కొన్నవాళ్లకు నష్టాలను మిగిల్చింది. శోభన్ బాబు అన్న మాట ప్రకారం సుమారు ఎనిమిదేళ్లు మల్టీ స్టారర్స్ కు దూరంగా ఉన్నారు. ఆ తర్వాత చిరంజీవి తరం మొదలయ్యాక ఎవరూ ఈ సాహసం చేయలేకపోయారు. అభిమానుల ప్రభావం స్టార్ల మీద ఏ స్థాయిలో ఉంటుందో చెప్పడానికి ఇంత కన్నా ఉదాహరణ కావాలా.