iDreamPost
iDreamPost
అభివృద్ధి పనుల గురించి అడిగిన ప్రతిసారి మీ జిల్లాలో టీడీపీ ఎన్ని సీట్లు గెలిచింది?అని చంద్రబాబు అడిగేవారని అప్పట్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అనేవాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా “మీరు నాకు ఓట్లు వేయక పోయినా నేను మాత్రం అభివృద్ధి చేస్తాను” అనే వాడు… అప్పటి ఉప ముఖ్యమంత్రి మరియు ముఖ్యమంత్రి మాటలు ఎలా ఉన్నా కర్నూల్ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు… ఆఫలితం మొన్న ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన సున్నా సీట్ల రూపంలో స్పష్టమైంది..
అప్పట్లో పారిశ్రామిక హబ్ అన్నారు.. వేల ఎకరాల్లో భూములు సేకరించారు. మొదట్లో కాస్త హడావిడి చేసి.. ఆ తర్వాత నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారు. ఫలితంగా వేల ఎకరాల భూములు అభివృద్ధి కి నోచుకోలేదు.
2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకు వెళ్ళింది. ఈ నేపథ్యంలో కరువు ప్రాంతమైన రాయలసీమలోని కర్నూల్ జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంది. జిల్లాలోని పాణ్యం నియోజకవర్గ పరిధిలో 11 గ్రామాలలో 7227 ఎకరాల భూమిని ఆంధ్రప్రదేశ్ మౌలిక వసతుల సంస్థ సేకరించింది. ఇందులో 7,182 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి.
2016లో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం 413.19 ఎకరాలను కేటాయించారు. బ్రహ్మణపల్లె వద్ద 43.93 ఎకరాల్లో ఏం ఎస్ ఏం పార్కు పేరుతో భూమి తీసుకొని ఇక్కడ మౌలిక వసతులంటూ రహదారులు, సిసి డ్రైన్లు నిర్మించారు. ఇక్కడ 9 మంది మాత్రమే పరిశ్రమలు పెడతామని కంపెనీల పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాను పరిశ్రమల హబ్ గా తీర్చిదిద్దనున్నట్లు ప్రకటించారు. దీంతో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంతా అనుకున్నారు. అయితే మనం అన్నదానికి అక్కడ జరిగినదానికి చాలా తేడా ఉంది.
2016 లో ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్ కు శంకుస్థాపన చేయగా, 2018లో జయరాజ్ ఇస్పాత్ స్టీల్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. రూ2989 కోట్లతో పెట్టబోయే ఈ కంపెనీలో 6 వేల మందికి ఉపాధి కల్పిస్తామని అప్పట్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కంపెనీ పనులు పనులను ప్రారంభించింది. అయితే ఇండస్ట్రియల్ హబ్ పేరిట సేకరించిన 13 వేల ఎకరాల భూముల్లో ప్రభుత్వం కనీస మౌలిక సదుపాయాలు కల్పించి పారిశ్రామిక వేత్తలను ఆకర్శించలేకపోయింది. దీంతో వేల ఎకరాల భూములు ఇప్పుడు నిరుపయోగంగా ఉన్నాయి. మొదట్లో ముచుమర్రి నుండి 1.48 టీ.ఎం.సి ల నీటిని ఓర్వకల్లు హబ్ కు తరలించాలని అనుకోని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపితే దీన్ని పట్టించుకోలేదు. దీనితో హబ్ లో పరిశ్రమల స్థాపనకు నీటి సమస్య ఏర్పడింది. ఫలితంగా ఇప్పటి వరకు 11 గ్రామాలలో రూ 4 కోట్లతో సిసి డ్రైన్లు, రోడ్లు తప్ప ఇంకేమి చెయ్యలేదు. ఓర్వకల్లు, తంగదంచే వద్ద రిజర్వాయర్లు నిర్మించాలని రూ 450 కోట్లతో ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు ఏళ్ళు గడిచిన పట్టించుకోలేదు. ఫలితంగా జిల్లాలో పరిశ్రమలు రాలేదు. అయితే కొందరు పారిశ్రామికవేత్తలు భూములపై బ్యాంకుల్లో రుణాలు తీసుకొని సొంత వ్యాపారాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
గడిచిన నాలుగేళ్లలో కర్నూల్ జిల్లాలో ప్రభుత్వం ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేకపోయింది. హబ్ పేరుతో ప్రచారాలు చేయడం తప్ప నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేదు. సోలార్ ప్లాంట్, ఎయిర్ పోర్ట్ తప్ప చెప్పుకోదగ్గ పరిశ్రమలు లేవు. ఐదేళ్లలో చంద్రబాబు అధికారంలో ఉండి ఏం చేసాడన్న చర్చ స్థానిక ప్రజల్లో నడుస్తోంది. ఇప్పుడు ఉన్న వైసిపి ప్రభుత్వం కచ్చితంగా తమ ప్రాంతాలను అభివృద్ధి చేస్తుందని ఇక్కడి ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న తరుణంలో జ్యుడీషియల్ రాజధాని పెట్టేందుకు ప్రభుత్వం ముందుకు రావడం చాలా సంతోషించదగ్గ పరిణామం.