iDreamPost
iDreamPost
మాస్ మహారాజా రవితేజ కొత్త సినిమా ఖిలాడీ ఇటీవలే ఆడియో సింగల్ ని విడుదల చేయడం తప్ప అంతకు మించి ప్రమోషన్లు చేసిన దాఖలాలు లేవు. షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టినట్టు కూడా ఎక్కడా వినిపించలేదు. ఇంకొంచెం మాత్రమే బ్యాలన్స్ ఉందని బడ్జెట్ కారణాల వల్ల పెండింగ్ లో పెట్టారనే టాక్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతోంది. మరోవైపు శరత్ మండవ డైరెక్షన్ లో రూపొందుతున్న రామారావు మాత్రం చకచకా కానిచ్చేస్తున్నారు. ఖిలాడికి నిజంగా బ్రేక్ వేశారా లేక ఇదంతా వట్టి పుకారేనా అనేది తెలియాల్సి ఉంది. విడుదల విషయంలో కూడా ఇంకా స్పష్టత రావడం లేదు. అక్టోబర్ లో వస్తుందనుకుంటే ఆ సూచనలు లేవు.
ఇప్పటికే ఖిలాడీ బడ్జెట్ బాగా ఎక్కువయ్యిందని వినిపిస్తోంది. రవితేజ కు మార్కెట్ ఉన్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మొత్తం రికవరీ కావాలంటే బ్లాక్ బస్టర్ టాక్ రావాలి. క్రాక్ అలా జరగడం వల్లే సేఫ్ అయ్యింది. నిర్మాతలకు లాభాలు ఇచ్చింది. కానీ ఖిలాడీకి అదే రిజల్ట్ రిపీట్ అవుతుందన్న గ్యారెంటీని ఇప్పుడే చెప్పలేరు కాబట్టి ఈజీగా కంక్లూజన్ కి రావడం కష్టం. పైగా థియేటర్లు పూర్తిగా కోలుకోలేదు. ఏపిలో సమస్యలు కొలిక్కి రాలేదు. అందుకే అఖండ, ఆచార్య లాంటి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్లు చెప్పకుండా వాయిదా వేస్తున్నారు. అలాంటాప్పుడు ఖిలాడీ మాత్రం ఎందుకు రిస్క్ చేయాలనే ప్రశ్న అభిమానుల నుంచి రావడం సహజం.
ఇవన్ని ఏమో కానీ వీలైనంత త్వరగా షూట్ ని పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ చేసేసుకుంటే అప్పటికప్పుడు విడుదల అనుకున్నా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రాక్షసుడుతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన దర్శకుడు రమేష్ వర్మకు ఖిలాడీ సక్సెస్ చాలా కీలకం. అది రీమేక్ కాబట్టి తనకు దక్కిన క్రెడిట్ తక్కువ. ఇప్పుడు రవితేజ ఇచ్చిన అవకాశాన్ని సరిగ్గా వాడుకుంటే మళ్ళీ స్టార్స్ నుంచి పిలుపులు ఉంటాయి. రాక్షసుడు 2లో విజయ్ సేతుపతిని నటింపజేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇక రవితేజ రామారావు తర్వాత త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో చేయబోయే సినిమాను రెగ్యులర్ షూట్ కు తీసుకెళ్తాడా లేదా అనేది ఇంకా సస్పెన్స్ గానే ఉంది
Also Read: విజయ్ దేవరకొండ ప్లానింగ్ బాగుందే