iDreamPost
iDreamPost
థియేటర్లలో సినిమాలైతే వస్తున్నాయి కానీ అఖండ, పుష్ప తర్వాత ఆ స్థాయి సందడి మాత్రం కనిపించడం లేదు. ఉన్నంతలో బంగార్రాజు కొంత కళను తీసుకొస్తే డిజె టిల్లు హడావిడి బాగానే ఉంది. రవితేజ ఖిలాడీ అంచనాలకు తగ్గట్టు లేకపోవడం నిరాశ కలిగించినా రాబోయే వాటి కోసం మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నెల 18 అంటే శుక్రవారం ఏకంగా ఏడు సినిమాలు విడుదల కాబోతుండటం వినడానికి బాగానే ఉంది కానీ ప్రాక్టికల్ గా చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. 25న భీమ్లా నాయక్ వస్తుందేమో అనే అంచనాతో మిగిలిన నిర్మాతలు ఎవరూ ధైర్యం చేయకపోవడంతో సినీ ప్రియులు ఉన్నవాటితో సర్దుకోవడం తప్పదు.
అన్నిటిలోకి అంతోఇంతో చెప్పుకోదగ్గది ఒక్క మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా మాత్రమే. అలా అని భీభత్సమైన ఓపెనింగ్స్ వస్తాయని కాదు కానీ కొన్ని సానుకూల అంశాలు ఉన్నది దీనికే. పెద్ద క్యాస్టింగ్, ఇళయరాజా సంగీతం లాంటి ఆకర్షణలు ఉన్నా ఇంకా జనం దృష్టిలోకి పెద్దగా వెళ్లడం లేదీ మూవీ. సరే టాక్ ని నమ్ముకున్నారో ఏమో మరి చూడాలి. మిగిలిన ఆరు సంగతి చూస్తే సురభి 70 ఎంఎం, వర్జిన్ స్టోరీ, బాచ్ పార్ట్ 1, రోమన్, విశ్వక్, గోల్ మాల్ అన్నీ చిన్న సినిమాలే. వీటిలో ఒక్క వర్జిన్ స్టోరీ ప్రమోషన్ పరంగా జనం దృష్టిలో ఉంది. డీజే థియేటర్లలో యాడ్స్ వేస్తున్నారు ఉందన్న సంగతైతే ఆడియన్స్ కి తెలిసింది. ఇదీ టాక్ మీద ఆధారపడాల్సిందే.
ఇవన్నీ పూర్తిగా మొదటి రోజు చూసే పబ్లిక్ ఇచ్చే టాక్ ని నమ్ముకున్నవే. ఎగ్జిబిటర్లు వీటిలో ఒకటో రెండో అద్భుతాలు చేయకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. 2022 ప్రారంభం ఏమంత గొప్పగా లేదు. సంక్రాంతి కూడా ఆశించినంత కిక్ ఇవ్వలేదు. వందల కోట్లతో కళకళలాడాల్సిన టాలీవుడ్ కేవలం బంగార్రాజుతో సర్దుకోవాల్సి వచ్చింది. తిరిగి ఫిబ్రవరి 25 నుంచి మునుపటి రోజులు వస్తాయనే నమ్మకంతో ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. సో 18వ తేదీకి కౌంట్ అయితే పెద్దగానే ఉంది కానీ మరీ ఎక్కువ సంబరపడేందుకు లేదు. చూస్తుంటే డీజే టిల్లునే రెట్టింపు లాభాలతో సెకండ్ వీక్ కూడా డామినేట్ చేసేలా కనిపిస్తున్నాడు.
Also Read : Star MAA : ఓటిటి హవాలోనూ శాటిలైట్ దూకుడు