‘నివర్‌’ ఫియర్‌ మొదలైంది

నివర్‌ తుపాను ఆందోళన ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది. ఈ రోజు సాయంత్రం నివర్‌ తుపాను తమిళనాడు లోని కరైకల్, మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. ఇందుకు అనుగుణంగానే పరిస్థితులు నెలకొన్నాయి. తుపాను తీరం దాటే సమయం దగ్గరపడుతున్న కొద్దీ దాని ప్రభావ స్పష్టంగా తెలుస్తోంది. తమిళనాడులో తీవ్రమైన గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఆకాశం మేఘావృతమైంద ఉంది. పలు చోట్ల చిరు జల్లులు పడ్డాయి. చల్లని గాలులు వీస్తున్నాయి.

తుపాను తీరం దాటే సమయంలో గంటలకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీలోని నెల్లూరు జిల్లాపై అధికంగా ఉంటుందని, ప్రకాశం నుంచి తూర్పుగోదావరి జిల్లా వరకు తీరం వెంబడి, రాయలసీమ జిల్లాల్లోనూ విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని వివరించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించిన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు, ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామ సచివాలయ సిబ్బంది, వలంటీర్ల సేవలను విసృత స్థాయిలో ఉపయోగించుకుని తుపాను ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కొవాలని పేర్కొన్నారు.

తుపాను తీరం తాడే ఈ రోజు బుధవారంతోపాటు రేపు, ఎళ్లుండి వరకూ వర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ వెల్లడించింది. తుపాను హెచ్చరికలతో రైతులు చేతికి వచ్చిన పంటలను కాపాడుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలో వర్షాలు పడితే అన్ని పంటలకు తీవ్ర నష్టం జరుగుతుంది. అక్టోబర్‌లో కురిసిన వర్షాలకే రాష్ట్ర వ్యాప్తంగా చెరువుల అన్ని నిండుకున్నాయి. మళ్లీ ఇప్పుడు వర్షాలు పడితే చెరువులకు గండ్లు పడే ప్రమాదం ఉంది.

Show comments