iDreamPost
android-app
ios-app

వరుసగా ముంచుకొస్తున్న ముప్పు

  • Published Nov 28, 2020 | 5:07 AM Updated Updated Nov 28, 2020 | 5:07 AM
వరుసగా ముంచుకొస్తున్న ముప్పు

వాతావరణంలో వస్తున్న విపరీత మార్పులతో వరుసగా ముప్పులు ముంచుకొస్తున్నాయి. నెల రోజుల క్రితం వరకు ఏకధాటిగా వర్షాలు మోతెట్టేసాయి. ఇప్పుడు నివర్‌ తుఫాను తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈనెల 29, డిసెంబర్‌ 2, 7 తేదీల్లో వరుసగా తుఫాన్లు, అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ అంచనాలు కడుతోంది.

బంగాళాఖాతాలో 29వ తేదీన ఏర్పడనన్న అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం నివర్‌ తుఫాను ప్రభావం చూపిన ప్రాంతంలోనే ఇవి కూడా ప్రభావం చూపేందుకు అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. నివర్‌ తుఫాను శనివారం నాటికి ప్రభావాన్ని తగ్గించుకుంటుండగా 29వ తేదీన మరోకటి కాచుక్కూర్చున్నదన్నమాట.

ఇప్పటికే ఎడతెరిపిలేని వర్షాలతో ఆంధ్రా, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. పలు చోట్ల పంటలు కూడా దెబ్బతిన్నాయి. ఏపీలో చిత్తూరు, నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావం అత్యధికంగాను, కడప, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో ఒక మోస్తరుగాను ప్రభావం చూపుతోంది. ఆయా ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో దాదాపు అన్ని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

వర్షానికి తోడు తుఫాను గాలులతో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. దీంతో చలిగాలి తీవ్రత పెరిగిపోయింది. వీటి తీవ్రతకు రోడ్లపై జనజీవనం అంతంత మాత్రంగానే కన్పిస్తోంది.

కాగా నివర్‌ తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు డిసెంబరులో పరిహారం అందించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించింది. నష్టం అంచనాలు సిద్దం చేయాలని అధికారులకు సీయం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.