iDreamPost
android-app
ios-app

బాబు గారి రాక.. అనివార్యమైంది

బాబు గారి రాక.. అనివార్యమైంది

తప్పనిసరి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కరోనా వాసం పూర్తిగా విడిచిపెట్టేందుకు సిద్ధమైనట్లు ఆ పార్టీ నేతల ప్రకటనల ద్వారా తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో కరోనా వైరస్‌ కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ నుంచి చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో సహా హైదరాబాద్‌కే పరిమితం అయ్యారు. వివిధ కేసుల్లో చిక్కుకుని జైలుకు వెళ్లి వచ్చిన పార్టీ నేతలను పరామర్శించేందుకు, అసెంబ్లీ సమావేశాలకు మాత్రమే చంద్రబాబు రాష్ట్రానికి వచ్చారు. తొలిసారి విశాఖ ఎల్‌జీ పాలిమర్స్‌ బాధితులను పరామర్శించేందుకంటూ అనుమతి తీసుకుని అక్కడకు వెళ్లకుండా.. విజయవాడ వచ్చి జూమ్‌లో మహానాడు నిర్వహించుకుని తిరిగి వెళ్లిపోయారు. మళ్లీ ఇన్నాళ్లకు ప్రజల మధ్యకు రావాలని చంద్రబాబు యోచిస్తున్నట్లుగా సమాచారం.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు త్వరలో అనంతపురం జిల్లాలో పర్యటించబోతున్నట్లు ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు చేసిన ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఈ రోజు కాల్వ శ్రీనివాసులు నివర్‌ తుఫాను వల్ల అనంతపురం జిల్లాలో దెబ్బతిన్న వేరుశెనగ పంటను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో నివర్‌ తుఫాను వల్ల దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించబోతున్నట్లు చెప్పారు. అంతేకాదు రైతులతో భారీ సభ కూడా నిర్వహించబోతున్నట్లు పేర్కొన్నారు. చంద్రబాబు పర్యటన త్వరలో ఖరారు అవుతుందని పేర్కొన్నారు.

కరోనా వైరస్‌ తగ్గిన తర్వాత ప్రజల్లోకి వస్తానని చంద్రబాబు అప్పట్లో జూమ్‌లో చెప్పారు. అయితే కరోనా వైరస్‌ వ్యాప్తి పూర్తిగా అదుపులోకి రాకున్నా.. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు, పాజిటివ్‌ సోకిన వారికి అందిస్తున్న చికిత్సలతో ప్రజలు మునుపటిలాగే తమ రోజు వారీ కార్యకలాపాలను చేసుకుంటున్నారు. వ్యాపారా కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. పార్టీలు తమ రాజకీయ కార్యకలాపాలను చేపడుతున్నాయి. అయినా చంద్రబాబు హైదరాబాద్‌కే పరిమితం కావడంతో.. ఆయనపై విమర్శలు మొదలయ్యాయి. వయస్సు ప్రభావం వల్ల చంద్రబాబు ఇంటికే పరిమితం అయినా.. ఆయన కుమారుడు లోకేష్‌ కూడా తండ్రి బాటలోనే నడుస్తూ ఇంటికే పరిమితం కావడం ఆ పార్టీ శ్రేణులకు కూడా రుచించడం లేదు. బాబుతోపాటు లోకేష్‌పై కూడా ప్రత్యర్థి పార్టీ నుంచి విమర్శలు జోరందుకున్నాయి.

మరో వైపు తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నిక త్వరలో జరగబోతోంది. పార్టీ అభ్యర్థిని అయితే బాబు ప్రకటించారు గానీ.. పార్టీ కార్యక్రమాలు మాత్రం ఇంకా మొదలుపెట్టలేదు. మరో వైపు అధికార వైసీపీతోపాటు, బీజేపీ తిరుపతిలో తమ ఎన్నికల కార్యక్రమాలను ప్రారంభించాయి. టీడీపీ స్థానంపై కన్నేసిన బీజేపీ తిరుపతి ఉప ఎన్నికలో సత్తా చాటాలని భావిస్తోంది. ఇక్కడ కనీసం రెండో స్థానంలో నిలిచినా.. ఆ పార్టీకి భవిష్యత్‌లో ఎంతో మేలు జరుగుతుంది. ఈ క్రమంలోనే బీజేపీ శ్రేణులు తిరుపతిలో తిష్టవేశాయి. నిన్న శనివారం తిరుపతిలో శోభా యాత్రను ఆ పార్టీ నిర్వహించింది. ఆ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు తిరుపతి లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో తరచూ పర్యటిస్తున్నారు.

ఈ నేపథ్యంలో అధికార పార్టీ విమర్శలకు చెక్‌ పెట్టడంతోపాటు తిరుపతి ఉప ఎన్నికపై దృష్టి సారించేందుకే చంద్రబాబు నాయుడు ముందు అనంతపురం జిల్లాలోని నివర్‌ తుఫాను వల్ల జరిగిన పంట నష్టం పరిశీలించే పేరుతో బయటకు వస్తున్నట్లు చెబుతున్నారు. నివర్‌ తుఫాను పోయి దాదాపు రెండు వారాలు కావస్తోంది. సోమవారం అంటే.. డిసెంబర్‌ 15 నాటికి పంట నష్టంపై అధికారులు అంచనాలు రూపాందించడం పూర్తవుతుంది. ఈ నెలాఖరు నాటికి పరిహారం అందిచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతా అయిపోయిన తర్వాత.. ఇప్పుడు రైతులను పరామర్శించేందుకంటూ చంద్రబాబు రాక వెనుక తిరుపతి ఉప ఎన్నికే కారణమనే వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి.