iDreamPost
android-app
ios-app

రైతుకు చేయూత.. అన్నమయ్య సామర్థ్యం పెంపు..

రైతుకు చేయూత.. అన్నమయ్య సామర్థ్యం పెంపు..

నివర్‌ తుపాను ప్రభావిత జిల్లాలో సీఎం వైఎస్‌ జగన్‌ ఏరియల్‌ సర్వే, అధికారులతో సమీక్ష ముగిసింది. నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఏరియల్‌ సర్వే ద్వారా పంట నష్టాన్ని పరిశీలించిన సీఎం వైఎస్‌ జగన్‌.. ఆ తర్వాత తిరుపతిలో అధికారులతో తపాను ప్రభావం, పంట నష్టంపై సమీక్ష నిర్వహించారు.

పంట నష్టంపై డిసెంబర్‌ 15వ తేదీ నాటికి నివేదిక ఇవ్వాలని సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. డిసెంబర్‌ 31వ తేదీకి రైతులకు పరిహారం బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వివరించారు. పంట నష్టపోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు అందివ్వాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాను వీలైనంత వేగంగా పునరుద్ధరించాలన్నారు. తుపాను షెల్టర్లలో ఉన్న వారికి 500 రూపాయల చొప్పన సాయం అందించాలని ఆదేశించారు.

కడప జిల్లాలోని అన్నమయ్య డ్యాం నీటి నిల్వ సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచుతామని సీఎం ప్రకటించారు. ప్రస్తుతం ఈ డ్యాం కెపాసిటీ 2.24 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుకు ఎగువున ఉన్న ఫించ జలాశయం కట్ట తెగడంతో వరద నీరు అంతా అన్నమయ్య ప్రాజెక్టులోకి చేరుతోంది. దీంతో ప్రాజెక్టుపై ఒత్తిడి పెరిగింది. ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వరద నీటిని సమర్థవంతంగా అదుపుచేయవచ్చని సీఎం వైఎస్‌ జగన్‌ భావిస్తున్నారు. తుపాను వల్ల చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో పలువురు మరణించారు. వారికి కుటుంబాలకు ఐదు లక్షల చొప్పన పరిహారం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు.