iDreamPost
android-app
ios-app

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌

నివర్‌ తుపాను ప్రభావిత ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పర్యటించనున్నారు. తుపాను, భారీ వర్షాల వల్ల ఎక్కువగా పంట నష్టపోయిన నెల్లూరు జిల్లాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే చేసేందుకు సిద్ధమయ్యారు. పంట నష్టం వివరాలను సేకరించాలని ఇప్పటికే అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌.. అన్నదాతల కష్టాలను స్వయంగా చూడాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ రోజు ఉదయం తాడేపల్లి నుంచి వరద ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.

ఉదయం 9 గంటలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయం నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌.. హెలికాప్టర్‌లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. తుపాను కలిగించిన నష్టాన్ని స్వయంగా చూసిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌ 11:45 గంటలకు తిరుపతిలో అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. పంట నష్టంపై, బాధితులకు సహాయం తదితర అంశాలపై చర్చించిన తర్వాత మధ్యాహ్నం 12:45 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరి వెళ్లనున్నారు.

నివర్‌ తుపాను ఉత్తరాంధ్ర మినహా రాష్ట్రంలోని మిగతా 10 జిల్లాలపై ప్రభావం చూపింది. తుపాను తమిళనాడులో తీరం దాటడంతో ఆ రాష్ట్రానికి సమీపంగా ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలు అధికంగా ప్రభావితం అయ్యాయి. అన్ని జిల్లాలలోనూ పంట నష్టం సంభవించింది. వర్షాలు తగ్గిన వెంటనే తుపాను ప్రభావిత జిల్లాల్లో జరిగిన పంట నష్టంపై వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఈ విషయాన్ని నిన్న మంత్రివర్గ సమావేశంలోనూ ప్రధానంగా చర్చించారు. డిసెంబర్‌ 15వ తేదీ నాటికి పంట నష్ట వివరాలు సేకరించి, డిసెంబర్, జనవరి నెలల్లో పరిహారం చెల్లించాలని నిర్ణయించారు. రైతులకు 80 శాతం సబ్సిడీతో విత్తనాలు పంపిణీ చేయాలని కూడా మంత్రివర్గం తీర్మానించింది.