iDreamPost
android-app
ios-app

వరుసగా నాలుగోసారి..

వరుసగా నాలుగోసారి..

బిహార్‌ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్‌కుమార్‌ నాలుగోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇప్పటికే నితీష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా బాధ్యలు చేపడతారని ఎన్‌డీఏ భాగస్వామ్య పార్టీ అయిన బీజేపీ స్పష్టం చేయగా.. ఆ బాధ్యలు ఎప్పుడు చేపట్టేది ఈ రోజు నితీష్‌ నిర్ణయించారు. నితీష్‌ నివాసంలో ఎన్‌డీఏ భాగస్వామ్య పక్ష పార్టీల ఎమ్మెల్యేతో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్‌డీఏ శాసనసభాపక్ష నేతగా నితీష్‌కుమార్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఎన్‌డీఏ శాసన సభాపక్ష నేతగా ఎన్నికైన నితీష్‌కుమార్‌.. ఆ తర్వాత రాజ్‌భవన్‌ వెళ్లారు. గవర్నర్‌ ఫగు చౌహాన్‌ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుపై గవర్నర్‌కు వివరించారు. గవర్నర్‌ను కలసిన తర్వాత మీడియాతో మాట్లాడిన నితీష్‌కుమార్‌.. రేపు సోమవారం సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు ప్రకటించారు.

శనివారమే బిహార్‌ సీఎంగా నితీష్‌కుమార్‌ రాజీనామా చేశారు. తన రాజీనామాను గవర్నర్‌కు అందిచారు. ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు ఆపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలన్న గవర్నర్‌ నితీష్‌కు సూచించారు.

ఈ నెల 10వ తేదీన వెల్లడైన బిహార్‌ శాసన సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్‌డీఏ కూటమి 125 సీట్లు గెలుచుకుంది. ప్రభుత్వం ఏర్పాటుకు 122 సీట్లు కావాల్సి ఉండగా.. ఎన్‌డీఏ కూటమికి మూడు సీట్లు అదనంగానే వచ్చాయి. ఎన్‌డీఏ కూటమిలో బీజేపీ 74 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జేడీయూ 43 సీట్లకు పరితమితం అయింది. మరో రెండు పార్టీలు నాలుగు సీట్ల చొప్పున గెలిచాయి.

బిహార్‌ శాసన సభలో అతిపెద్ద పార్టీగా 75 సీట్లతో ఆర్‌జేడీ నిలిచింది. ఆ పార్టీ యువనేత తేజస్వీ యాదవ్‌ మరోసారి ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.