iDreamPost
android-app
ios-app

నిర్భయ కేస్: 2012 డిసెంబర్ 16 నుండి 2020 మార్చ్ 20 వరకూ…

నిర్భయ కేస్: 2012 డిసెంబర్ 16 నుండి 2020 మార్చ్ 20 వరకూ…

ఎట్టకేలకు ఒక అంకం ముగిసింది.. నిర్భయకు నిజమైన న్యాయం దక్కింది.. న్యాయం గెలవడానికి సమయం పట్టొచ్చు కానీ, ఎప్పటికైనా గెలుస్తుందన్న విశ్వాసాన్ని నిర్భయ దోషులు ఉరితో మరోసారి రుజువైంది..

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో దేశ రాజధాని నడిబొడ్డున కదులుతున్న బస్సులో నిర్భయపై సాగిన అరాచక పర్వం చూసి యావత్ దేశం ఉలిక్కిపడింది..స్త్రీలను దేవతగా పూజించే దేశంలో ఇదేనా స్త్రీలకు ఉన్న రక్షణ అని ప్రపంచవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి.. మగాళ్లు కాస్త మృగాళ్లలా మారి చేసిన అరాచక పర్వం భారతదేశ చరిత్రలోనే మాయని మచ్చగా నిలిచిపోయింది.. ఆ రాక్షసమూక దాడిలో దారుణంగా గాయపడిన నిర్భయ సుమారు 13 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది.. సింగపూర్ హాస్పిటల్ లో మృతి చెందింది.

కొందరు మృగాళ్ల దాడిలో నిర్భయ చనిపోయింది కానీ ప్రతీ ఆడపిల్ల జీవితానికి వెలుగుగా మారి భారతదేశం ఉన్నంతకాలం జీవిస్తూనే ఉంటుందన్నది నగ్న సత్యం..ఆరోజు నిర్భయపై జరిగిన అమానవీయ దాడితో ప్రభుత్వం మేల్కొంది.. చట్ట సవరణలు చేసింది.. ఆమె పేరుపైనే నిర్భయ చట్టం రూపొందించింది.. కానీ నిర్భయకే న్యాయం దక్కని పరిస్థితులు ఏర్పడ్డాయి..నేరస్తులు వేసిన ఎత్తులు వల్ల నేరస్తులకు శిక్ష పడుతుందని  కొన్నాళ్లపాటు అనిపించలేదు.. కానీ నిర్భయ తరపున వాళ్ళ అమ్మ ఆశాదేవి పోరాటం కొనసాగించింది..

చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నిందితుల్లో ఒకడైన రామ్ సింగ్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు మైనర్ కావడంతో జువైనల్ హోం లో మూడేళ్ల శిక్షను అనుభవించి విడుదల అయ్యాడు.. మిగిలిన నలుగురు నిందితులు ముఖేష్,అక్షయ్, పవన్,వినయ్ శర్మలు మాత్రం శిక్ష ఆలస్యం కావడానికి వీలైన అన్ని మార్గాలను ఉపయోగించుకున్నారు. ఏళ్ళకు ఏళ్ళు గడిచాయి కానీ నిందితులకు శిక్ష అమలుకాకపోవడంతో నిర్భయకు న్యాయం జరుగుతుందా అన్న అనుమానాలు పలువురిలో ఏర్పడ్డాయి.

ఒక కేసులో ఒకరికన్నా ఎక్కువ నిందితులు పాల్గొంటే అందరికీ ఒకేసారి శిక్ష విధించాలన్న నిబంధన ఉండడం వారి పాలిట వరంలా మారింది..నిందితుడి పిటిషన్ పెండింగ్ లో ఉన్నప్పుడు శిక్ష విధించడానికి వీల్లేదు. ఇది మరో నిబంధన.. ఈ నిబంధనలు ఆధారం చేసుకుని శిక్ష ఖరారు అయిన ప్రతీసారి కోర్టులో ఒక్కొక్కరుగా క్యూరేటివ్, మెర్సీ పిటిషన్లను వేస్తూ వచ్చారు. దానివల్ల నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఆలస్యం అవుతూ వచ్చింది. నిర్భయ నిందితుల ఉరి శిక్ష ఒక డైలీ సీరియల్ ను తలపించింది.

రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్లు,క్యూరేటివ్ పిటిషన్లు నిందితులు అందరూ ఉపయోగించుకోవడంతో వారికి న్యాయపరమైన అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. ఉరి శిక్ష ఖాయం చేస్తూ పటియాల కోర్టు మరోసారి డెత్ వారెంట్ జారీ చేసింది. దీంతో నిర్భయ దోషులు ఏకంగా అంతర్జాతీయ న్యాయస్థానం మెట్లు ఎక్కారు. దేశాల మధ్య ఉన్న దౌత్య పరమైన సమస్యల విషయంలో అంతర్జాతీయ న్యాయస్థానం విచారణకు స్వీకరిస్తుంది కానీ,ఆయా దేశాల్లో ఉండే వ్యక్తిగత సమస్యలకు కాదని నిర్భయ దోషుల తరపున వాదించే లాయర్ ఏపీ సింగ్ మర్చిపోయినట్లున్నాడు. రోజులు గడిచాయి. అధికారులు నిందితుల ఉరికి అన్ని ఏర్పాట్లను తీహార్ జైల్లో పూర్తి చేశారు. తలారిని కూడా నాలుగురోజుల ముందే జైలుకు రప్పించారు.

చివరి గంటల్లో నిర్భయ దోషులు అర్ధరాత్రి కూడా ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. కానీ ధర్మాసనం వారి పిటిషన్లను కొట్టేసింది. మార్చ్ 20 ఉదయం 5.30 నిమిషాలకు 17 మంది జైలు సిబ్బంది సమక్షంలో పవన్ జల్లాద్ నిర్భయ దోషులు నలుగురికి ఉరి శిక్ష అమలు చేసాడు. దీంతో నిర్భయకు నిజమైన న్యాయం జరిగిందని నిర్భయ తల్లితో పాటు దేశవ్యాప్తంగా పలువురు సంతోషం వ్యక్తం చేశారు. న్యాయమే గెలుస్తుందని నిర్భయ ఘటన మనకి మచ్చుతునకగా నిలుస్తుంది.

చనిపోతామని ముందే ఒక వ్యక్తికి తెలిస్తే ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం.. అప్పట్లో నిర్భయ ఆ బాధ అనుభవించింది.. నేటివరకు నిర్భయ దోషులు అదే బాధను అనుభవించారు. ఆడవాళ్ళపై అత్యాచారాలకు తెగబడే వారికి, వారి వస్త్రధారణపై విమర్శలు గుప్పించే వారికి నిర్భయ దోషులు ఉరి ఒక గుణపాఠంగా చరిత్రలో నిలిచిపోతుంది. భారతదేశం ఉన్నంతకాలం నిర్భయ చట్టం భారత దేశ స్త్రీలకు అండగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు..