iDreamPost
iDreamPost
నిమ్మగడ్డ రమేష్ కుమార్. నాలుగున్నరేళ్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా ఉన్నప్పటికీ ఎవరికీ తెలియని అధికారి. సీనియర్ ఐఏఎస్ అదికారి అయినా చాలా మందికి ఆ పేరే విని ఉండని పరిస్థితి ఏపీలో ఉంది. అలాంటిది టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత ఆయన ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయారు. అందులోనూ స్థానిక ఎన్నికల్లో ఫలితాలు గుర్తించిన తర్వాత ఆయన విచక్షణాధికారం వినియోగించడం, అందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని విస్మరించడం చివరకు సుప్రీంకోర్ట్ కూడా సరికాదని చెప్పాల్సి వచ్చింది. ఇక తాజాగా హైకోర్ట్ తీర్పుతో ఆయన మరోసారి తనకు తాను అధికారం కట్టబెట్టుకోవడం మరో విశేషంగా మారింది. ఇప్పుడు అదే నిమ్మగడ్డ ని చిక్కుల్లో పడేస్తున్నట్టు కనిపిస్తోంది.
ఇప్పటికే కేంద్రానికి రాసిన లేఖ కారణంగా నిమ్మగడ్డ పలుమార్లు మాట మార్చాల్సి వచ్చింది. ఆ లేఖ ఎక్కడ నుంచి వచ్చిందనే విషయంలో ఏపీ సీఐడీ కీలక ఆధారాలు సంపాదించింది. ఇలాంటి తరుణంలో ఏపీ హైకోర్ట్ లో వచ్చిన తీర్పు కారణంగా ఎస్ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ చెల్లదనే ప్రచారంతో నిమ్మగడ్డ అత్యుత్సాహం ప్రదర్శించారు. తనకు తానుగా సీఎస్ఈగా ప్రకటించుకున్నారు. తాను మళ్లీ బాధ్యతల్లోకి వచ్చినట్టు చెప్పుకున్నారు. ఇదే ఇప్పుడు పెద్ద సాంకేతిక సమస్యగా మారుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే అడ్వొకేట్ జనరల్ ఈ విషయంపై స్పష్టత ఇచ్చేశారు. అలాంటి స్వీయ నియామకాలు చెల్లవని స్పష్టం చేసేశారు. ఎన్నికల సంఘం ఉత్తర్వులు కూడా ఉపసంహరించుకోవడంతో నిమ్మగడ్డ ఆశలు నీరుగారిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.
ఓవైపు సుప్రీంకోర్ట్ లో పిటీషన్ వేస్తామని ఇప్పటికే ప్రభుత్వం తరుపున ప్రకటించారు. అదే సమయంలో హైకోర్ట్ తీర్పుపై కాంగ్రెస్ తరుపున కొందరు నేతలు కేవియట్ పిటీషన్ కి పూనుకోవడం చర్చనీయాంశం అవుతోంది. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ రమేష్ చర్చ పట్ల సర్వత్రా చర్చ సాగుతోంది. హైకోర్ట్ తీర్పు రాగానే, పూర్తి తీర్పు సారాంశం వెలువడకముందే తనను తాను ఎస్ ఈ సీనని ప్రకటించడం ద్వారా నిమ్మగడ్డ చేసిన తప్పిదంగా అంతా చెబుతున్నారు. సాంకేతిక కారణాలతో ఆర్డినెన్స్ కొట్టేసిన నేపథ్యంలో ఇలాంటి చర్యల మూలంగా సాంకేతికంగా నిమ్మగడ్డ సమస్యలు కొనితెచ్చుకున్నట్టుగా భావిస్తున్నారు.
తనంతట తానుగా అధికారం స్వీకరించే అవకాశం రాజ్యాంగం ప్రకారం ఎవరికీ లేదు. అదే సమయంలో ఏపీ హైకోర్ట్ కూడా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా ఆటోమేటిక్‌గా రమేశ్‌కుమార్‌ను బాధ్యతలు చేపట్టాలని ఆదేశించిన దాఖలాలు కూడా లేవు. అందుకు తోడుగా నిమ్మగడ్డకు బాధ్యత అప్పగించాలని ప్రస్తుతం ఎస్ఈసీకి ఎలాంటి ఆదేశాలు కూడా లేవు. కేవలం నిమ్మగడ్డను తిరిగి బాధ్యతల్లోకి తీసుకువచ్చే ప్రక్రియ చేపట్టాలని మాత్రమే ఆదేశించినట్టు స్పష్టంగా ఉంది. అయినప్పటికీ హైకోర్ట్ తీర్పునకు విరుద్ధంగా తనకు తానుగా బాధ్యతలు స్వీకరించడం ద్వారా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌కు కోర్ట్ తీర్పుని ఉల్లంఘించినట్టే అవుతుందన్నది కొందరి వాదన.
మరోవైపు తాజా తీర్పు మీద ప్రభుత్వం కూడా రాష్ట్ర హైకోర్టుకు తన అభిప్రాయాన్ని తెలియజేసింది. ఎగువ న్యాయస్థానానికి అప్పీల్ చేసుకునే హక్కును ఉపయోగించుకోదలిచామని హైకోర్టుకు నివేదించింది. ఈ విషయం కేసులో పిటీషనర్ గా ఉన్న నిమ్మగడ్డ దృష్టిలో కూడా ఉంది. అయినప్పటికీ అది తెలిసి కూడా తనంతట తానుగా బాధ్యతలు స్వీకరించినట్టు చెప్పడం నేరంగా పరిగణించవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించినట్టుగా పరిగణించవచ్చని చెబుతున్నారు. హైకోర్ట్ తీర్పు అంతిమం కాదని, అత్యున్నత న్యాయస్థానానికి వెళుతున్నట్టు తెలిసిన తర్వాత కూడా ఇలాంటి వ్యవహారశైలి కూడదని కూడా చెబుతున్నారు. మొత్తంగా అత్యుత్సాహంతో చేసిన తప్పిదం ఇప్పుడు నిమ్మగడ్డ మెడకు చుట్టుకునేలా ఉందనేది న్యాయనిపుణుల వాదన.