iDreamPost
iDreamPost
లీకు వీరుల వ్యవహారం పతాక స్థాయికి చేరింది. అందరినీ విస్మయానికి గురిచేసింది. చివరకు హైకోర్ట్ న్యాయమూర్తులకు అసహనంగా మారింది. దాంతో కేసు విచారణను వాయిదా వేసి, ప్రత్యక్షంగా తన ముందు హాజరుకావాలని ఆదేశించాల్సి వచ్చింది. ఏపీ ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణలో హైకోర్ట్ ఎదురయిన పరిణామాఉ చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఆన్ లైన్ ద్వారా వీడియో కాన్ఫరెన్స్ విచారణలో సంబంధం లేని వ్యక్తులు ప్రత్యక్షం కావడానికి కారణాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కరోనా నేపథ్యంలో కీలక కేసుల విచారణను ఆన్ లైన్ ద్వారా చేపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఉన్న సమస్యల రీత్యా ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగా రెండు రోజులుగా ఏపీ హైకోర్ట్ లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు విచారణ సాగుతోంది. ఇరు పార్టీలు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. అన్ని పిటీషన్లను కలిపి ఉమ్మడిగా విచారిస్తున్న నేపథ్యంలో సంబంధిత పార్టీలు కేసు విచారణకు హాజరయ్యేలా యూజర్ నేమ్, పాస్ వర్డ్ జారీ చేశారు. అయితే విచారణ సందర్భంగా ఈరోజు ఉదయం న్యాయమూర్తి బెంచ్ మీదకు రాగానే కేసుకి సంబంధం లేని వారు ప్రత్యక్షం కావడంతో అవాక్కయ్యారు. కేసుతో ప్రత్యక్ష సంబంధాలున్న వారికి ఇచ్చిన పాస్ వర్డ్ ఎలా లీకయ్యిందనే విషయంలో నివ్వెరపోవాల్సి వచ్చింది.
కేసు విచారణ కొనసాగించేందుకు గానూ సంబంధం లేని వారు ఆఫ్ లైన్లోకి వెళ్లాలని పలుమార్లు సూచించినా పెద్దగా ఫలితం రాలేదు. దాంతో చివరకు న్యాయమూర్తి కేసు విచారణను వాయిదా వేశారు. తన ఎదురుగా ప్రత్యక్ష విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. వచ్చే సోమవారం తదుపరి విచారణ సాగబోతోంది.
ఈ నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నిమ్మగడ్డకు రాసిన లేఖలో లీకుల వ్యవహారంపై విచారణ సాగుతుండగా ఇప్పుడు ఏకంగా హైకోర్ట్ విచారణ వివరాలను లీకు చేయడం విశేషంగా మారింది. సదరు లేఖను లీక్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ఇప్పుడు ఈ కేసు విచారణలో కూడా ఉన్నారా అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కోర్ట్ కూపీలాగితే అసలు గుట్టురట్టయ్యే అవకాశం ఉంది. కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఆశ్చర్యపరుస్తున్నాయి. చివరకు న్యాయవ్యవస్థ మీద కూడా గౌరవం లేకుండా చేసేన వ్యవహారంపై విచారణ అవసరం అనే అబిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.