iDreamPost
android-app
ios-app

ఇటు కరోనా కట్టడి.. అటు వ్యాక్సినేషన్‌.. ఒకే రోజు ఏపీ సర్కార్‌ రెండు నిర్ణయాలు

ఇటు కరోనా కట్టడి.. అటు వ్యాక్సినేషన్‌.. ఒకే రోజు ఏపీ సర్కార్‌ రెండు నిర్ణయాలు

పరీక్షలు, కరోనా బాధితుల గుర్తింపు, చికిత్స, వ్యాక్సినేషన్‌ ద్వారా కరోనా వైరస్‌ కట్టడికి పటిష్ట చర్యలు తీసుకుంటున్న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ రోజు మరో రెండు కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్‌ సెకెండ్‌ వేవ్‌లో వైరస్‌ వ్యాప్తి ఉధృతంగా ఉంటుండడంతో మహమ్మారికి మూకుతాడు వేసేందుకు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించిన ఏపీ సర్కార్‌.. అందుకు సంబంధించిన విధివిధానాలను ప్రకటించింది. రాత్రి కర్ఫ్యూ ఈ రోజు నుంచే అమలు కానుంది. వ్యాక్సిన్లను సమకూర్చుకునేందుకు చర్యలు ప్రారంభించింది.

10 నుంచి 5 వరకు..

కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం ఐదు గంటల వరకు కొనసాగనుంది. ఇది ఎప్పటి వరకు కొనసాగుతుందనేది ప్రభుత్వం పేర్కొనలేదు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ రాత్రి కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇప్పటికే ఏపీ పొరుగు రాష్ట్రం తెలంగాణలోనూ ఈ నెల 20వ తేదీ నుంచి రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది.

Also Read : తన దాకా వచ్చాక మేల్కొన్న కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు శుభవార్త.

ఆంక్షలు.. మినహాయింపులు..

కర్ఫ్యూ సమయంలో కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, హోటళ్లు మూసివేయాల్సి ఉంటుంది. ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. అత్యవససేవలకు కర్ఫ్యూ నుంచి మినహాయిపునిచ్చింది. ఆస్పత్రులు, ల్యాబ్‌లు, మెడికల్‌ షాపులు, మీడియా, టెలికాం, ఇంటర్నెట్, కేబుల్‌ సేవలు, పెట్రోల్‌ బంకులు, విద్యుత్‌ సంస్థల కార్యాలయాలు, నీటి సరఫరా, పారిశుధ్యం, ఆహార పదార్థాల సేవలు, విమాన, రైల్వే ప్రయాణికులు, వైద్యులు, సిబ్బంది రాకపోకలు, అత్యవసర రవాణా వాహనాలు, అంతర్రాష్ట్ర రవాణా సేవలను కర్ఫ్యూ నుంచి మినహాయిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ కరోనా ప్రస్తుత పరిస్థితి…

ఏపీలో కోవిడ్‌కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 50,972 పరీక్షలు చేయగా.. 11,698 మంది వైరస్‌బారిన పడ్డారు. చికిత్స తీసుకుంటున్న వారిలో 4,421 మంది కోలుకున్నారు. 37 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 81,471 యాక్టివ్‌ కేసులున్నాయి.

వ్యాక్సిన్‌ కోసం ఇండెంట్‌లు..

కరోనా కట్టడికి చర్యలు చేపడుతూనే.. అదే సమయంలో వ్యాక్సిన్‌ వేసే ప్రక్రియను ఏపీ సర్కార్‌ వేగవంతం చేసింది. వచ్చే నెల 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమం ప్రారంభం కాబోతున్న తరుణంలో సరిపడా వ్యాక్సిన్లను సమకూర్చుకునే పనిలో ఏపీ ప్రభుత్వం నిమగ్నమైంది. 18 –45 ఏళ్ల వారందరికీ వ్యాక్సిన్‌ వేసేందుకు అవసరైమన వ్యాక్సిన్లను పంపాలంటూ ఉత్పత్తి సంస్థలైన భారత్‌ బయోటెక్, సీరం ఇన్సిస్టిట్యూట్‌కు ఏపీ ప్రభుత్వం లేఖలు రాసింది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ధరకు 8.16 కోట్ల డోసులు పంపాలని కోరింది. బిల్లులు వెంటనే చెల్లిస్తామని పేర్కొంది.

Also Read : మళ్లీ లాక్‌డౌన్‌ ఉంటుందా..? కేంద్రం తాజాగా నిర్ణయం వెనుక ఆంతర్యమేమిటి..?