iDreamPost
android-app
ios-app

న్యూఢిల్లీ.. కేజ్రీవాల్‌ కంచుకోట.. ఇలా మారింది..

న్యూఢిల్లీ.. కేజ్రీవాల్‌ కంచుకోట.. ఇలా మారింది..

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి కే జ్రీవాల్‌కు న్యూఢిల్లీ శాసన సభ నియోజకవర్గం కంచుకోటగా అవతరించింది. ఈ రోజు వెలువడిన ఫలితాల్లో కేజ్రీవాల్‌ ఈ నియోజకవర్గం నుంచి మరో సారి గెలుపుబావుటా ఎగురవేశారు. 13, 508 ఓట్ల మెజారిటీ సాధించారు. వరుసగా మూడు ఎన్నికల్లో న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించి హాట్రిక్‌ కొట్టారు.

న్యూఢిల్లీ ఓటర్లు ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌పై అంచెలంచెల విశ్వాసం చూపారు. కేజ్రీవాల్‌ ఆమ్‌ ఆద్మీ పార్టీ పెట్టిన తర్వాత తొలిసారి పోటీ చేసిన 2013 శాసన సభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌ న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో ఆయన అప్పటి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌పై పోటీ చేశారు. మూడు సార్లు సీఎంగా ఎన్నికైన షీలా దీక్షిత్‌ను కాదని న్యూఢిల్లీ ఓటర్లు కేజ్రీవాల్‌ వైపు నిలిచారు. 53.46 శాతం ఓట్లు సాధించిన కేజ్రీవాల్‌ 25,864 ఓట్ల మెజారిటీ పొందారు. 2008 ఎన్నికల్లో షీలా దీక్షిత్‌కు 52.20 శాతం ఓట్లు రావడం గమనార్హం.

భారీ ఆధిక్యంతో గెలింపిన తర్వాత కేజ్రీవాల్‌ దాదాపు 13 నెలలకే ప్రభుత్వాన్ని రద్దు చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లగా.. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయం సరైనదేననేలా న్యూఢిల్లీ ప్రజలు మరోసారి పట్టం కట్టారు. రెండో సారి న్యూఢిల్లీ నుంచి బరిలోకి దిగిన కేజ్రీవాల్‌ ఈ సారి తన సమీప ప్రత్యర్థి నుపూర్‌ శర్మ(బీజేపీ)పై 31,583 ఓట్ల మెజారిటీ సాధించారు. ఈ ఎన్నికల్లో 64.34 శాతం ఓట్లు సాధించారు. 2013 ఎన్నికల కన్నా ఈ సారి కేజ్రీవాల్‌కు 10 శాతం ఎక్కువ ఓట్లు పొందడం విశేషం.

తాజాగా ఈ రోజు వెలువడిన ఫలితాల్లోనూ కేజ్రీవాల్‌ విజయం సాధించడంతో న్యూఢిల్లీ నియోజకవర్గం కేజ్రీవాల్‌కు కంచుకోటగా మారిందని చెప్పవచ్చు. అయితే గత ఎన్నికల కన్నా మెజారిటీ తగ్గినా.. కేజ్రీవాల్‌పై ప్రజల విశ్వాసం సన్నగిల్లలేదని వచ్చిన మెజార్టీ (13,508 ఓట్లు) స్పష్టం చేస్తోంది. ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టినా కేజ్రీవాల్‌ విజయాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు.