iDreamPost
android-app
ios-app

ఏపీ భ‌విష్య‌త్ మార్చ‌బోతున్న నూత‌న ద‌శాబ్ది

  • Published Jan 01, 2020 | 4:31 AM Updated Updated Jan 01, 2020 | 4:31 AM
ఏపీ భ‌విష్య‌త్ మార్చ‌బోతున్న నూత‌న ద‌శాబ్ది

ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విత‌వ్యంలో కొత్త ద‌శాబ్ది కొత్త మైలు రాళ్లు నాట‌బోతోంది. గ‌త ద‌శాబ్దంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు ఊర‌టనిచ్చే అవ‌కాశాలున్నాయ‌నే ఆశాభావం స‌ర్వ‌త్రా క‌నిపిస్తోంది. రాజ‌కీయంగానూ, భౌగోళికంగానూ గ‌డిచిన ద‌శాబ్ద‌కాలం ఏపీకి గ‌డ్డుకాలంగానే క‌నిపించింది. కానీ భ‌విష్య‌త్ మాత్రం ఆశాజ‌న‌కంగా ఉంటుంద‌ని, అందుకు అనుగుణంగా నాయ‌క‌త్వం అడుగులు వేస్తుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

2010 ప్రారంభం నుంచే ఆంధ్ర‌ప్ర‌దేశ్ అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి మ‌ర‌ణం త‌ర్వాత రాష్ట్రంలో మారిన రాజ‌కీయ వాతావ‌ర‌ణంలో వ‌రుస‌గా ప్ర‌భుత్వాలు మారుతూ ఉండ‌డంతో పాల‌న కుంటుప‌డింది. తెలంగాణా ఉద్య‌మం, దానికి యూపీఏ స‌ర్కార్ త‌లొగ్గ‌డంతో ఈ ద‌శాబ్దంలోనే రాష్ట్ర విభ‌జ‌న అనివార్యం అయ్యింది. ఆ త‌ర్వాత కొత్త రాష్ట్రంలో కూడా పాల‌న గాడిలో ప‌డ‌క‌పోవ‌డంతో రాజ‌ధాని అంశం నేటికీ కొలిక్కి రాకుండా మిగిలిపోయింది. ఈ నేప‌థ్యంలో యువ నాయ‌కుడు జ‌గ‌న్ సార‌ధ్యంలోని ప్ర‌భుత్వం మ‌ళ్లీ ఏపీలో కొత్త ఆశ‌లు చిగురించ‌డానికి దోహ‌దం చేస్తుంద‌నే అభిప్రాయం ప్ర‌జ‌ల్లో కనిపించింది. మొన్న‌టి సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఫ‌లితాలే అందుకు సాక్ష్యంగా నిలిచాయి.

ఏడు నెల‌ల పాల‌న‌లో జ‌గ‌న్ స‌మూల మార్పుల‌తో పాల‌నారంగంలో ప్ర‌యోగాల‌కు శ్రీకారం చుట్టారు. గ్రామ స‌చివాల‌యాల ద్వారా అంద‌రికీ అందుబాటులో ప్ర‌భుత్వం ఉండేందుకు రంగం సిద్ధం చేశారు. గ్రామ స్వ‌రాజ్య నినాదాన్ని తెర‌మీద‌కు తీసుకొచ్చిన జ‌గ‌న్ ఇప్ప‌టికే అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. ప్ర‌భుత్వాధినేత ఆలోచ‌న‌లు కార్య‌రూపం దాలిస్తే వ్య‌వ‌స్థ‌లో ప‌లు మార్పులు ఖాయం. ప్ర‌జ‌ల‌కు స‌ర్వ అవ‌స‌రాలు తీర్చే మార్గం సుగ‌మం అవుతుంది. దానికి తోడుగా రాష్ట్ర పాల‌నా విభాగం కూడా మూడు రాజ‌ధానుల పేరుతో మార్పుల‌కు జ‌గ‌న్ స‌న్న‌ద్ధ‌మ‌వుతుండ‌డం మ‌రో సంచ‌లనం అవుతోంది.

మూడు రాజ‌ధానుల ద్వారా అటు ఉత్త‌రాంధ్ర‌, ఇటు రాయ‌ల‌సీమ‌కు కూడా పాల‌నా విభాగాల కేటాయింపు కొత్త మార్గాల‌ను సూచిస్తోంది. అమ‌రావ‌తి రాజ‌ధానిగా ఎంచుకున్న‌ప్ప‌టికీ ఐదేళ్ల‌లో ఎటువంటి అభివృద్ధి సాధించ‌క‌పోవ‌డంతో ఏపీలో పెట్టుబ‌డుల‌కు ప్ర‌క‌ట‌న‌లే త‌ప్ప కార్య‌రూపం దాల్చుతున్న దాఖ‌లాలు లేవు. కానీ ఇప్పుడు విశాఖ కేంద్రంగా అటు ఐటీ, ఇటు ఇత‌ర ఇన్ఫ్రా ప్రాజెక్టుల‌కు మోక్షం క‌లుగుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. సీమ‌కు ఇరిగేష‌న్ ప‌రంగానూ మేలు చేసేందుకు ప్రాజెక్టుల‌కు ప‌థ‌క‌ర‌చ‌న చేస్తున్న త‌రుణంలో అప‌ర‌భ‌గీర‌థుడిగా పిలుచుకున్న త‌న తండ్రి అడుగుజాడ‌ల్లో జ‌గ‌న్ పాల‌న సాగుతుంద‌నే ఆశ‌లు అన్ని వ‌ర్గాల్లో ఉన్నాయి.

ఆర్థిక‌మాంధ్యం ఆందోళ‌న క‌లిగిస్తున్న వేళ జ‌గ‌న్ అడుగులు అంత సులువు కాదు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ భ‌విష్య‌త్ కి కీల‌కంగా ఉన్న రాబోయే ద‌శాబ్ద‌కాలం పాల‌నలో ఆర్థిక ఒడిదుడుకుల‌ను అధిగ‌మించేందుకు చేప‌ట్టే ప్ర‌య‌త్నాలే .ప్ర‌ధాన‌మైన‌వి. ఆ ప్ర‌య‌త్నాలు కొలిక్కి వ‌స్తే రాష్ట్రం మ‌రోసారి త‌లెత్తుకుని నిల‌బ‌డే ప‌రిస్థితి వ‌స్తుంద‌న‌డంలో సందేహం లేదు. కుల‌, మ‌త‌, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చ‌గొట్టేందుకు కొన్ని శ‌క్తులు కాచుకుని కూర్చున్న త‌రుణంలో వాటిని అధిగ‌మించి ఆంధ్ర‌ప్ర‌జ‌ల భ‌విత‌వ్యం కోసం ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటున్న దానిని బ‌ట్టి రాబోయే ద‌శాబ్దం దశాదిశ‌ను నిర్ణ‌యించ‌బోతోంది. 2000 నుంచి నూత‌న స‌హ‌స్రాబ్దిలో ప‌దేళ్ల పాటు కొత్త పుంత‌లు తొక్కుతున్న‌ట్టు క‌నిపించిన ఏపీ భ‌విత‌వ్యం ఆ త‌ర్వాత ప‌దేళ్ల‌లో ప‌లు ఎదురుదెబ్బ‌లు తినాల్సి వ‌చ్చింది. కానీ ఇప్పుడు కొత్త ధశాబ్దిలో మాత్రం మ‌రోసారి ముంద‌డుగు వేసేందుకు రాజ‌ధాని, పోల‌వ‌రం స‌హా ఇరిగేష‌న్ ప్రాజెక్టుల‌న్నీ కొలిక్కి వ‌స్తే స‌మ‌గ్రాభివృద్ధి కొత్త పుంత‌లు తొక్కుతుంద‌న‌డంలో సందేహం లేదు. స‌మ‌స్య‌ల‌ను అధిగ‌మించి, కొత్త రాష్ట్రం కొంగ్రొత్త ఆకాంక్ష‌లు నెర‌వేర్చుకునే దిశ‌లో ముందుకు సాగుతుంద‌ని ఆశిద్దాం..