iDreamPost
iDreamPost
ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి వ్యవహారంలో కీలక నిర్ణయం ఖాయంగా కనిపిస్తోంది. ఆపార్టీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగర్ తాజా ప్రకటనతో ఈ విషయం ధృవపడింది. ఇప్పటికే ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ పార్టీ అద్యక్షులు మారుతున్నారని విద్యాసాగర్ రావు స్పష్టం చేసేశారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం అనంతరం విద్యాసాగర్ రావు చేసిన ఈ వ్యాఖ్యలతో ఏపీలో కన్నా కి ఊస్టింగ్ కన్ఫర్మ్ అయినట్టేనని చెబుతున్నారు.
కన్నా లక్ష్మీనారాయణ సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో ఉండి 2014లో ఆ పార్టీ ఓటమి అనంతరం బీజేపీలో చేరారు. మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ లో ఆయనకు సన్నిహిత సంబంధాలుండడం బాగా కలిసి వచ్చింది. రెండేళ్ల క్రితం అనూహ్యంగా కంభంపాటి హరిబాబు స్థానంలో ఏకంగా రాష్ట్ర అధ్యక్ష పదవి చేపట్టారు. ఆయన సారధ్యంలో జరిగిన సాధారణ ఎన్నికల్లో పార్టీ పేలవమైన ఫలితాలు దక్కించుకుంది. దేశమంతా సానుకూలత ఉన్నప్పటికీ ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఘోర పరాజయం మూటగట్టుకుంది. చివరకు కన్నా కూడా తాను పోటీ చేసిన నర్సారావుపేట ఎంపీ స్థానంలో డిపాజిట్ దక్కించుకోలేక చతికిలపడ్డారు.
ఎన్నికల తర్వాత ఆయన వైఎస్ జగన్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. రెండు నెలల క్రితం రామోజీరావుతో ఏకాంత భేటీ అనంతరం దూకుడు మరింత పెరిగింది. రాజధాని అంశంలో మౌనదీక్షకు కూడా పూనుకున్నారు. పార్టీ అధిష్టానం ఆలోచనకు భిన్నంగా సాగుతున్నట్టు కనిపించారు. అమరావతి రైతుల పక్షాన ఉద్యమిస్తామని చెబుతూ రాజధాని వికేంద్రీకరణను అడ్డుకుంటామని ప్రకటించారు. మండలి రద్దు విషయంలో కూడా దాదాపు అదే తంతు. అయితే కేంద్రంలోని బీజేపీ పెద్దలు మాత్రం భిన్నంగా ఆలోచించారు. కీలకమైన వ్యవహారాల్లో జగన్ సర్కారుదే స్వేచ్ఛాయుత అధికారం ఉందని ప్రకటించారు. దాంతో హస్తినలో ఒకలా..ఏపీలో మరోలా అన్నట్టుగా కమలం కనిపించింది.
బీజేపీ సంస్థాగతంగా బలపడే అవకాశాలను కూడా ఈకాలంలో కోల్పోయింది. 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి, 2019 ఎన్నికల అనంతరం టీడీపీ నుంచి పలువురు నేతలు కమలం గూటికి క్యూ కట్టినా కలిసి వచ్చింది కనిపించలేదు. పైగా పాత, కొత్త నేతల మధ్య విబేధాలతో కొత్త కలహాలు తెరమీదకు వచ్చాయి. ఈ పరిణామాలతో కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వం మీద కూడా పార్టీలో విశ్వాసం సన్నగిల్లినడంతో అధిష్టానం కూడా అసంతృప్తితో కనిపించింది. అన్నీ కలిసి చివరకు కన్నాను మార్చాలనే డిమాండ్ కి బలం చేకూరింది. దాంతో కన్నా స్థానంలో కొత్త నేతవైపు బీజేపీ మొగ్గు చూపుతున్నట్టు స్పష్టమయ్యింది. కొద్ది రోజుల్లోనే కొత్త నేత మీద క్లారిటీ వస్తుందని చెప్పవచ్చు.
ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా మరోసారి విశాఖ నేతకు అవకాశం ఉందని చెబుతున్నారు. కంభంపాటి హరిబాబు సహా పలువురి నేతలు అండదండలు ఉండడంతో ఎమ్మెల్సీగా ఉన్న మాధవ్ కి సారధ్య బాద్యతలు దక్కవచ్చని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి దానికి అనుగుణంగా సంకేతాలు వచ్చినట్టు సమాచారం. అధికారిక ప్రకటన రావడమే అనివార్యంగా కనిపిస్తోంది. అయితే పలువురు నేతలు పోటీపడుతున్న వేళ చివరి నిమిషంలో మాధవ్ కి అడ్డంకులు వస్తే ఏం జరుగుతుందన్నది ఆసక్తికరమే.