iDreamPost
android-app
ios-app

డీలర్‌కు దిమ్మతిరిగే షాక్.. కస్టమర్‌కు పరిహారంతో పాటు కొత్త కారు కూడా!

డీలర్‌కు దిమ్మతిరిగే షాక్.. కస్టమర్‌కు పరిహారంతో పాటు కొత్త కారు కూడా!

ఈ మధ్యకాలంలో పబ్లిక్ వాహనాల వాడకం తగ్గిపోయి వ్యక్తిగత వాహనాలను వాడటం మొదలుపెట్టారు జనాలు. కరోనా మహమ్మారి తర్వాత సొంత వాహనాల వాడకం ఎక్కువైపోయింది. ఈ నేపథ్యంలోనే కార్లు, బైక్ లు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. అయితే వెహికిల్ కొనేముందు షోరూమ్ కు వెళ్లి దానికి సంబంధించిన ధర, ఫీచర్స్, ఇతర వివరాలను క్షుణ్ణంగా తెలుసుకుంటాము. వాహనం కొనుగోలు చేసిన తర్వాత ఏవైనా సాంకేతిక ఇబ్బందులు తలెత్తితే, మళ్లీ కొత్త వెహికిల్ ఇవ్వడమో లేదా సరిచేసి ఇవ్వడం వంటి హామీలను షోరూమ్ డీలర్ లు కస్టమర్లకు హామీ ఇస్తుంటారు. కొన్ని సార్లు కస్టమర్లను డీలర్లు మోసం చేసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా మోసం చేసిన డీలర్ కు ఓ కస్టమర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. అసలు ఏం జరిగిందటంంటే?

కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి 2019 జూన్ 11న ‘అద్వాతి మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్’ నుంచి ‘హ్యుందాయ్ శాంట్రో ఎమ్‌టి స్పోర్ట్జ్’ కారును కొనుగోలు చేశాడు. దీని ధర రూ. 6,25,663 రూపాయలు. అయితే కొద్ది రోజుల తర్వాత ఆ కారులో సాంకేతిక లోపం తలెత్తింది. ఇదే విషయాన్ని కారు కొనుగోలుదారుడు డీలర్ కు తెలియజేశాడు. ఈ క్రమంలో కస్టమర్ అభ్యర్థన మేరకు డీలర్‌షిప్ కారును రెండు సార్లు సర్వీస్ చేసింది. సర్వీస్ అనంతరం 2020 అక్టోబర్ 17న బాణావర నుంచి అరసికెరెకు ప్రయాణిస్తుండగా కారులో ఉన్నట్టుంది ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ప్రమాదంలో అందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడ్డారు.

అయితే ప్రమాదం జరిగిన వెంటనే వినియోగదారుడు షోరూమ్‌కు సమాచారం అందించాడు. దీనికి స్పందించిన డీలర్‌షిప్ యాజమాన్యం కారును రీప్లేస్ చేస్తామని కస్టమర్ కు హామీ ఇచ్చారు. రోజులు గడిచిపోతున్నాయి కానీ కస్టమర్‌కు కొత్త కారుని మాత్రం అందించలేదు. దీంతో విసిగిపోయిన కస్టమర్‌ బాణవర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ క‌మిష‌న్‌‌ను ఆశ్రయించాడు.

కారు మాన్యుఫాక్చరింగ్ లో లోపాలు ఉన్నట్లు, అదే కారులో మంటలు రావడానికి కారణమని క‌మిష‌న్‌కు తెలిపాడు. ప్రమాదానికి గురైన కారుకు బదులుగా ఇంకో కారు ఇస్తామన్న షోరూమ్ హామీలను చెప్పాడు. కాగా దీనిపై విచారణ తర్వాత డిస్ట్రిక్ట్ కమిషన్ తయారీ లోపం వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు నిర్థారించింది. దీనికి షోరూమ్ బాధ్యత వహించి కొత్త కారును అందించాలని డీలర్ కు సూచించింది. కారుతో పాటు కస్టమర్‌కు 1.4 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. డిస్ట్రిక్ట్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ క‌మిష‌న్‌ ఇచ్చిన ఈ తీర్పు నిర్లక్ష్యంగా వ్యవహరించే డీలర్లకు చెంపపెట్టులా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి