iDreamPost
android-app
ios-app

జగన్ గారు “ఆ” మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయరా ,ప్లీజ్….

జగన్ గారు “ఆ” మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయరా ,ప్లీజ్….

దాదాపు తొంభై సంవత్సరాల క్రితం, మీడియా అంటే వార్తాపత్రికలు, రేడియో, సినిమాల ముందు ప్రదర్శించే న్యూస్ రీల్స్ కు పరిమితమైన కాలంలోనే మీడియా శక్తిని, దానిని తనకనుకూలంగా వాడుకుని ప్రజల మనసులో తమకు కావలసిన అభిప్రాయాలను చొప్పించగల వెసులుబాటునూ గుర్తించినవాడు జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్. గుర్తిఓచడమే కాక దానికోసం ప్రాపగాండా శాఖ అని ఒకటి ఏర్పాటు చేసి పాల్ జోసెఫ్ గోబెల్స్ అనే సహచరుడిని మంత్రిగా నియమించాడు.

గోబెల్స్ దేశంలో ఉన్న అన్ని పత్రికలు, రేడియో స్టేషన్లనూ తన అదుపులోకి తీసుకుని నాజీ పార్టీనీ, హిట్లర్ నూ ఆకాశానికెత్తే వార్తల, వ్యాసాలతో ముంచెత్తాడు. చివరకు ఒకవైపు జర్మన్ సైన్యం వరుస పరాజయాలు ఎదుర్కొంటున్న దశలో కూడా జర్మన్ ప్రజలు విజయం తమదే అన్న భ్రాంతిలో ఉన్నారు. అందుకే తప్పుడు ప్రచారానికి గోబెల్స్ ప్రచారం అనేది మరోపేరుగా స్థిరపడిపోయింది.

సమకాలీన రాజకీయ నాయకులలో మీడియాకున్న శక్తి గురించి బాగా తెలిసిన వారిలో ముందుగా చెప్పుకోవలసిన పేరు చంద్రబాబునాయుడు. ఇరవైనాలుగు గంటల వార్తా ఛానళ్ళు, ఇంటర్ నెట్, సోషల్ మీడియా లేని రోజుల్లోనే ఆయన మీడియాకున్న ప్రాముఖ్యత తెలుసుకుని దాన్ని మచ్చిక చేసుకోవడం మొదలుపెట్టారు. రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ఈనాడు గ్రూపు అండతోనే తిరుగులేని ప్రజాధరణ ఉన్న ఎన్టీఆర్ ని ప్రజా వ్యతిరేకత తలెత్తకుండా గద్దె దించగలిగారు.

ముఖ్యమంత్రి పీఠం ఎక్కాక మీడియా సపోర్టుతో హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణం అని, తన వల్లనే రాష్ట్రంలో సాఫ్టువేర్ అభివృద్ధి చెందింది అనీ, తాను అంతర్జాతీయ స్థాయి నాయకుడిని అని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేసి, అందులో చాలావరకు విజయం సాధించారు.

వివిధ కారణాల వల్ల పదేళ్ల పాటు అధికారానికి దూరమై, 2014 లో విభజిత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ గోబెల్స్ తరహా ప్రచారం మరింత ఎక్కువ చేశారు. దానికితోడు ఇప్పుడు మరిన్ని ఎక్కువ మీడియా సంస్థలు ఆయనకు అండగా తయారయ్యాయి. ఇవి చాలవన్నట్టు జీతాలిచ్చి కొంతమంది సోషల్ మీడియా కార్యకర్తలను సీబీఎన్ ఆర్మ పేరుతో నియమించారు.

రాజధాని నగరం అమరావతిలో క్షేత్ర స్థాయిలో జరిగిన గోరంతను మీడియా కొండంత చేసి చూపించి, చంద్రబాబున ఆకాశానికి ఎత్తేసింది. పోలవరం విషయంలో కూడా ఇలాగే జరిగింది. పదే పదే శంకుస్థాపనలూ, పూర్తికాని పోలవరం చూడడానికి బస్సు యాత్రలతో బాగా హైప్ చేసింది అనుకూల మీడియా.
 
ప్రజల మద్దతు లేకుండా మీడియా ఎంత ఎత్తుకు లేపినా ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని నిరూపిస్తూ 2019 ఎన్నికల ఓడిపోయాక అయినా చంద్రబాబు, ఆయనను సపోర్టు చేసే మీడియా అబద్ధపు ప్రచారం వదిలిపెడతారని ఆశించినవారి ఆశలు నెరవేరలేదు.

తాను అధికారం కోల్పోతారని కలలో కూడా ఊహించని చంద్రబాబు తన అనుకూల మీడియా సహాయంతో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మీద దుష్ప్రచారం మొదలుపెట్టారు. ప్రతి సమస్యను భూతద్దంలో చూపడం, లేని సమస్యలు ఉన్నట్టు చూపడం ఎక్కువ చేశారు. ఇసుక కొరత కానీ, ఉల్లిపాయల ధరలు కానీ, అనంతపురం జిల్లా నుంచి కియా మోటార్స్, విశాఖపట్నం నుంచి సాఫ్ట్ వేర్ కంపెనీలు రాష్ట్రం విడిచిపోతున్నాయని గాలివార్తలు ప్రచారం చేయడం కానీ ఇందులో భాగమే.

రాతపరీక్ష ఆధారంగా పారదర్శకంగా జరిగిన గ్రామ వాలంటీర్ల ఉద్యోగాలు అధికార పక్షం వారికే ఇచ్చుకున్నారని, అర్హులైన వారి పెన్షన్లు లక్షల సంఖ్యలో తొలగించారని,అయిదు వందల యూనిట్ల కన్నా అధికంగా విద్యుత్ వినియోగించే వారికి పెంచిన విద్యుత్ ఛార్జీలు సామాన్యుడి నఢ్ఢి విరుస్తున్నాయని చేసే ప్రచారం కానీ ఇలాంటిదే.

చూడబోతే ప్రాపగాండా కోసం హిట్లర్ ఒక మంత్రిత్వ శాఖను పెట్టుకుంటే, ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడానికి ఒక యాంటీ-గోబెల్స్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసుకోవలసి వచ్చేలా ఉంది.