iDreamPost
android-app
ios-app

నారా వారి నయా రిఫరెండం….!

నారా వారి నయా రిఫరెండం….!

రెఫరెండం నిర్వహించండి లేదా అమరావతి అజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళ్దాం…! ఇదండీ తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడి తాజా వరస…! తిరిగి ఎన్నికల డిమాండ్‌ను కాసేపు పక్కనబెడితే బాబు గారి నోటి నుంచి జాలు వారిన రిఫరెండం గురించి ఒకసారి చూద్దాం…! అసలు రెఫరెండం అంటే ఏమిటి? భారత్‌లో ఇప్పటి వరకు ఎన్ని రెఫరెండాలు జరిగాయి? చంద్రబాబుకు రెఫరెండం డిమాండ్‌ చేసే నైతికత ఉందా..? అనే ప్రశ్నలకు కింది వివరణలో సమాధానాలు వెతికే ప్రయత్నం చేయొచ్చు….

పత్రికలు…అందులోనూ అంతర్జాతీయ వార్తలు చదివే అలావాటు ఉన్న వారికి రెఫరెండం ప్రక్రియపై కాస్త అవగాహన ఉండొచ్చు. పెద్దగా చదువుకోని వారికి దీనిపై అవగాహన సున్నా అనే చెప్పాలి. ఒక చట్టం లేదా విధాన పరమైన నిర్ణయంపై ప్రజా అభిప్రాయాన్ని సేకరించే ప్రక్రియే..రెఫరెండం..! దీన్నే ప్లెబిసైట్‌గానూ పిలస్తుంటారు. రెఫరెండంలు ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంటాయి. ఇటీవల కాలంలో నిర్వహించిన స్కాటిష్‌ ఇండిపెండెన్స్, క్రిమియా స్టేటస్, బ్రెగ్జిట్‌ రెఫరెండంలు వార్తల్లో నిలిచాయి.

భారత్‌లో రెఫరెండంలు…

భారత్‌లో ఎప్పుడూ రెఫరెండంలు నిర్వహించలేదా…? అనే ప్రశ్న చాలా మంది మదిలో మెదలొచ్చు. అయితే నేటి భారత ప్రాదేశిక చిత్రపటాలను నిర్దేశించిన వాటిలో రిఫరెండంలు కూడా భాగస్వాములు కావడం విశేషం..! దేశ విభజన సమయంలో బ్రిటీష్‌ ఇండియాలో భాగమైన∙నార్త్‌–వెస్ట్‌ ఫ్రాంటియర్‌ను భారత్‌లో చేర్చాలా లేదా పాకిస్థాన్‌లో చేర్చాలా అని నిర్ణయించేందుకు 1947, జూలై 6న రెఫరెండం నిర్వహించారు. ఫలితాలు జూలై 20న వెలువడ్డాయి. అయితే రిఫరెండమ్‌లో పాల్గొన్నవారిలో 2,89, 244 మంది పాకిస్థాన్‌కు అనుకూలంగా, 2,874 మంది భారత్‌కు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఆ ప్రాంతం పాకిస్థాన్‌లో భాగమైంది.

అదేవిధంగా సిల్హెట్‌ డివిజన్‌ యథాతథంగా అప్పటి అస్సాంలో కొనసాగాలా లేదా కొత్తగా ఏర్పాటవుతోన్న భారత్, పాకి స్థాన్‌(తూర్ప బెంగాల్‌)లలో ఏదో ఒక దానిలో చేర్చాలా అని నిర్ణయించేందుకు 1947 జూలైలో సిల్హెట్‌ రెఫరెండం నిర్వహించారు. అయితే ఇందులో మెజారిటీ ప్రజలు తూర్పు బెంగాల్‌(పాకిస్థాన్‌)లో చేరేందుకు మెగ్గుచూపినప్పటికీ 1947 ఆగస్టు 12న ప్రచురితమైన ర్యాడ్‌క్లిఫ్‌ విభజన రేఖ బరాక్‌ వ్యాలీ, కరీంగంజ్‌లతోపాటు అధిక ప్రాంతాన్ని భారతదేశంలో(అస్సాం)లోనే చేర్చింది.

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిర్వహించిన తొలి, చిట్టచివరి రెఫరెండంగా గోవా ఒపీనియన్‌ పోల్‌ ప్రసిద్ధికెక్కింది. గోవా, డయ్యూ డామన్‌లను కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగించాలా లేదా మహారాష్ట్రలో చేర్చాలా అని నిర్ణయించేందుకు 1967, జనవరి 16న రెఫరెండం నిర్వహించారు. అందులో కేంద్రపాలిత ప్రాంతంగా కొనసాగేందుకు అక్కడి ప్రజలు మొగ్గుచూపారు. భారత ప్రభుత్వం రెఫరెండంను గౌరవించి గోవాను కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగించింది…అయితే తదనంతర కాలంలో గోవా(1987) పూర్తి స్థాయి రాష్ట్రంగా ఏర్పాటైంది.

ఇప్పుడసలు విషయానికొస్తే…! ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, ప్రజాభిప్రాయం మేరకు నడుచుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడం…బాధ్యత గల ప్రతిపక్ష నేత కర్తవ్యం…! అదే సమయంలో ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాల్లోని వాస్తవ అవాస్తాలను పరిశీలించి విధానపరమైన నిర్ణయాలను సమీక్షించటం..ముఖ్యమంత్రి బాధ్యత..! అయితే ఈ రెండు పదవుల్లో గరిష్ట కాలం ఉన్న చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ఈ విషయంలో సరిగ్గా వ్యవహరించింది లేదనే చెప్పాలి…! ప్రస్తుతం రెండోసారి ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్న చంద్రబాబు అమరావతి పేరుతో ప్రాంతాలు, కులాలు, మతాల వారీగా వారీగా ప్రజలను రెచ్చగొడుతూ…ప్రజాప్రతినిధులపై భౌతిక దాడులకు పురిగొల్పేలా ప్రవర్తిస్తుండటం ఆక్షేపణీయంగా ఉంది.

నైతకత ఏదీ…?

ఏ రెఫరెండం నిర్వహించి విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారు? ఏ రిఫరెండం నిర్వహించి రాజధానికి అమరావతి పేరు పెట్టారు? ఏ రెఫరెండం నిర్వహించి ఏపీకి హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను వదులుకొని ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారు..? ఏ రెఫరెండం నిర్వహించి కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును నిర్మాణాన్ని మీ చేతుల్లోకి(రాష్ట్ర ప్రభత్వుం) తీసుకున్నారు..? ఏ రెఫరెండం నిర్వహించి పదేళ్ల పాటు హైదరాబాద్‌లో కొనసాగే హక్కు ఉండగా…హడావిడీగా అమరావతి చెక్కేశారు..?.. ఇలా అడుగుతూ పోతే లెక్కలేనన్ని ప్రశ్నలు..! వీటన్నిటీ సమాధానాలు చెప్పగలిగితే ధైర్యంగా జగన్‌ను రెఫరెండం కోసం డిమాండ్‌ చేసే నైతిక చంద్రబాబుకు లభిస్తుంది. కానీ, ఆయన చెప్తారని ఆశించటం అత్యాశే…? ఎందకంటే…ప్రత్యేక హోదా సంజీవి కాదు ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అనేందుకు ఆయన ఏ గ్రామంలోనూ రిఫరెండం నిర్వహించలేదు…? రాజధాని ప్రాంతాన్ని నిర్ణయించేందుకు ఏ పట్టణంలోనూ రిఫరెండం నిర్వహించలేదు…? అయితే రాజధానికి అమరావతి అని పేరు పెట్టేందుకు ఏ ఒక్కరి అభిప్రాయం తీసుకోలేదని అనలేము..! ఎందుకంటే రామోజీరావు సూచన మేరకే అమరావతి పేరు పెట్టానని ఆయనే సెలవిచ్చాడు కాబట్టి…!

ఒక వ్యక్తికి తన అభిప్రాయాన్ని చెప్పే స్వేచ్ఛ ఎప్పుడూ ఉంటుంది. చంద్రబాబుకీ ఆ హక్కు ఉంది. కానీ, ఆయా వ్యక్తులు గతంలో చేసిన పనులు, మాట్లాడిన మాటల కారణంగా వర్తమానంలో నైతికతను కోల్పోతారు. ప్రస్తుతం చంద్రబాబుదీ అదే పరిస్థితి…! రాష్ట్రంలో జగన్‌ను ప్రశ్నించే నైతికత చాలా మందికి ఉండొచ్చు…ఉంటుంది కూడానూ…! కానీ, కచ్చితంగా చంద్రబాబుకి మాత్రం లేదనే చెప్పాలి..!

రూల్స్‌ నేనే పెడతా….!

చంద్రబాబునాయుడు డిమాండ్‌ చేస్తున్నాడు కదా…పోనీలే ఆయన ముచ్చటా తీరుద్దాం అని జగన్‌ రెఫరెండంకి అంగీకరించాడని అనుకుందాం…! బాబు సిద్ధపడతాడా అంటే…నో అనే చెప్పాలి…! అదెలాగో చూద్దాం…! ఎక్కువ మంది రెఫెరెండం అంటే ఒక దానిపై అభిప్రాయాన్ని కోరే ప్రక్రియే అనుకుంటారు…? చంద్రబాబు కూడా ఇదే అభిప్రాయంలో ఉన్నట్టున్నారు..? కానీ, రిఫరెండంను మల్టిపుల్‌ చాయిస్‌ తరహాలోనూ నిర్వహిస్తారు. 1977లో ఆస్ట్రేలియాకు కొత్త జాతీయ గీతాన్ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన రెఫరెండంలో ఓటర్లకు నాలుగు చాయిస్‌లు ఇచ్చారు. అలాగే స్విట్జర్లాండ్‌లోనూ మల్టిపుల్‌ చాయిస్‌ రిఫరెండంలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. ఐర్లాండ్‌ సహా అనేక దేశాలు మల్టిపుల్‌ చాయిస్‌ రెఫరెండం విధానాన్ని అనుసరిస్తున్నాయి.

వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే… ఒక వేళ భవిష్యత్‌లో ఏపీలో రిఫరెండమనేదే నిర్వహిస్తే రాజధాని ఎంపికకు సంబంధించి అమరావతి, కర్నూలు, విశాఖపట్నం, తిరుపతిలను ఆప్షన్లుగా తీసుకోవాల్సి ఉంటుంది. వాటిలో ఎక్కువ మంది ప్రజలు ఏది కోరుకుంటే దాన్ని రాజధానిగా ప్రకటించొచ్చు. అయితే దీనికి చంద్రబాబు అంగీకరిస్తారా….? అంటే లేనే లేదని చెప్పొచ్చు! ఆయనకు అమరావతి తప్ప మరేదీ సుతారమూ నచ్చదు…! అందుకే రిఫరెండం అంటూ జరిగితే…ఆయన నిర్దేశించిన రూల్స్‌ ప్రకారమే జరగాలి లేదంటే జగన్‌ ఈవీఎంలు ట్యాంపరింగ్‌ చేశాడనే పల్లవి అందుకున్నా అందుకుంటారు….!