నారా లోకేష్ ..ఏమిటీ చెత్త ఆవేశం

అస‌లే ప్ర‌పంచం అవ‌స్థ‌ల్లో ఉంది. ఏం జ‌రుగుతుందోన‌నే క‌ల‌వ‌రంతో కొట్టిమిట్టాడుతోంది. స‌రిహ‌ద్దులు మూసేసుకుని స‌మ‌స్య‌ను అధిగమించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వ‌ర‌కూ అదే ప‌రిస్థితి. దేశాల‌కు దేశాలే సొంత వారిని కూడా అనుమానించే ప‌రిస్థితి వ‌చ్చింది. క‌లిసి ఉంటామ‌ని ఏర్పాటు చేసుకున్న యూరోపియ‌న్ యూనియ‌న్ ఇప్పుడు త‌ద్విరుద్దంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. చివ‌ర‌కు ఎక్క‌డైనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వ‌స్తే ఆ ప్రాంతాన్నే ఇప్పుడు రెడ్ జోన్ గా ప్ర‌క‌టిస్తున్నారు. బారీకేడ్లు క‌ట్టేసి కంట్రోల్ చేసే య‌త్నం చేస్తున్నారు. మ‌రోవైపు గ్రామాల‌కు గ్రామాలే స్వ‌చ్ఛందంగా మా ఊరికి రావ‌ద్ద‌ని స‌రిహ‌ద్దుల్లో కంచెలు వేస్తున్నారు.

ప్ర‌పంచం ఇంత‌టి విప‌త్క‌ర ప‌రిస్థితిని ఎన్న‌డూ ఊహించి ఉండ‌దు అనుకునే ద‌శ‌లో తెలంగాణా ప్ర‌భుత్వం తొంద‌ర‌పాటు ప‌లు స‌మ‌స్య‌ల‌కు దారితీసింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాన్ని ఒత్తిడిలోకి నెట్టింది. ఇలాంటి స‌మ‌యంలో రాజ‌కీయాల‌కు దూరంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌ను ఆలోచించాల్సిన ప‌రిస్థితి ఉంది. కానీ ఏపీలో ప్ర‌భుత్వం ప‌లువురు విద్యార్థులు, ఉద్యోగుల‌ను స‌రిహ‌ద్దుల్లో అడ్డుకుని క్వారంటైన్ కి అంగీక‌రిస్తే అనుమ‌తిస్తామ‌ని చెబుతోంది. ఎవ‌రి నుంచి ఏ ముప్పు వ‌స్తుందో తెలియ‌క ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా ఇలాంటి నిర్ణ‌యాన్ని ఇప్ప‌టికే వారం రోజులుగా అమ‌లు చేస్తోంది. అయినా దానిని కూడా తెలుగుదేశం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, మాజీ మంత్రి కూడా అయిన నారా లోకేష్ వ‌క్రీక‌రించి జ‌గ‌న్ మీద నింద‌లు వేసేందుకు వాడుకోవ‌డం విడ్డూరంగా మారింది.

టీడీపీ నేత‌లంతా దాదాపుగా అదే తీరుతో వ్య‌వ‌హ‌రించారు. పైగా వారందరినీ ఏపీలోకి ప్ర‌వేశించ‌డానికి అనుమ‌తి ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ ప్ర‌భుత్వం తొలి నుంచి అనుమ‌తించ‌బోమ‌ని చెప్ప‌లేదు. పైగా నిబంధ‌న‌ల ప్ర‌కారం క్వారంటైన్ కి సిద్ధ‌ప‌డిన వారంతా రావాల‌ని చెప్పింది. దానిని కూడా వ‌క్రీక‌రించి తెలంగాణా పోలీసుల వైఖ‌రి కార‌ణంగా ఏర్ప‌డిన ప‌రిస్థితిని ఏపీ ప్ర‌భుత్వం మీద‌కు నెట్టాల‌ని చూడ‌డం విస్మ‌య‌క‌రంగా త‌యార‌య్యింది. ఎటువంటి ముప్పు వ‌చ్చినా నియంత్రించ‌డం ఎలా అన్న‌ది ఇప్ప‌టికే అగ్ర‌రాజ్యాలు కూడా త‌ల‌లు ప‌ట్టుకుంటున్న ద‌శ‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముంద‌స్తుగా చ‌ర్య‌లు తీసుకోవ‌డం త‌ప్పు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ప్ర‌జ‌ల ర‌క్ష‌ణ కోసం చ‌ర్య‌లు తీసుకుంటే దానిని రాజ‌కీయంగా జ‌గ‌న్ ని నిందించేందుకు వాడుకోవ‌డం విశేషంగా క‌నిపిస్తోంది.

వాస్త‌వానికి చంద్ర‌బాబు , ఆయ‌న త‌న‌యుడు అంద‌రూ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఉన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆప‌ద‌లో ఉన్న స‌మ‌యంలో వారు మాత్రం సేఫ్ జోన్ గా తెలంగాణా రాజ‌ధానిని ఎంపిక చేసుకున్నారు. అదే స‌మ‌యంలో ఏపీలో ప్ర‌జ‌ల విష‌యంలో ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌డుతున్నారు. ఒకే రోజు హైద‌రాబాద్ నుంచి 8వేల మంది నేరుగా రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఉంటే ఎలాంటి ప‌రిస్థితి ఉత్ప‌న్న‌మ‌య్యేది అనేది కూడా ఆలోచ‌న లేకుండా, ఒక‌సారి చేయి దాటితే అదుపుచేయ‌లేక ప్ర‌పంచంలోని అనేక దేశాలు విల‌విల్లాడుతున్న స్థితిని కూడా గుర్తించ‌లేక గుడ్డిగా విమ‌ర్శ‌లు చేయ‌డం టీడీపీ నేత‌ల‌కు త‌గునా అనే ప్ర‌శ్నలు ఉద‌యిస్తున్నాయి.

ముఖ్య‌మంత్రులిద్ద‌రూ మాట్లాడుకుని కాస్త సామ‌ర‌స్యంగా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోబ‌ట్టి స‌రిపోయింది గానీ ఇంకా ఆల‌శ్యం అయితే ఇలాంటి రెచ్చగొట్టే టీడీపీ నేత‌ల తీరు ఎలాంటి గంద‌ర‌గోళానికి దారితీస్తుందో ఊహిస్తేనే క‌ల‌వ‌రం క‌లుగుతోంది. ఇప్ప‌టికైనా విప‌క్ష టీడీపీ తీరు మార్చుకుని విప‌త్కాలంలో ప్ర‌భుత్వం మీద విమ‌ర్శ‌లు మాని, త‌గిన సూచ‌న‌లు చేయ‌డం అవ‌స‌రం అని గ్ర‌హించాలి.

Show comments