రసకందాయంలో నంద్యాల ఫార్ములా ..

ఎన్నికల ఖర్చు మీద అప్పటి ఎన్నికల కమీషనర్ టీఎన్ శేషన్ గట్టి చర్యలు తీసుకోబట్టి సరిపోయింది కానీ లేకుంటే 2017 నంద్యాల ఉప ఎన్నిక ఖర్చుకు గిన్నిస్ బుక్ అఫ్ రికార్డ్స్ దక్కేది… అభివృద్ధి పేరుతో 1500 కోట్లకు పైగా పనులను ప్రకటించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ,మండలానికొక మంత్రి మరియు ముగ్గురు ఎమ్మెల్యేలను పెట్టి, నంద్యాల టౌన్ లో ఐదుగురు మంత్రులకు బాధ్యతలు అప్పచెప్పి పెట్టిన అనధికార ఖర్చు అక్షరాలా 150 కోట్లు!

ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు సైతం నంద్యాలలో అదే విధంగా ఉత్కంఠత రేపుతోంది అని చెప్పొచ్చు.

మున్సిపల్ ఎన్నికల నామినేషన్స్ కు చివరి రోజైన ఈ రోజు చైర్మన్ అభ్యర్థిగా అందరూ ఊహిస్తున్న మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భార్య లలితమ్మ కౌన్సిలర్ పదవికి నామినేషన్ వేయగా మరోవైపు అనూహ్యంగా నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర భార్య నాగినీ రెడ్డి కూడా నామినేషన్ వేయడం విశేషం.రాజగోపాల్ రెడ్డికి ఖాయం అనుకున్న చైర్మన్ పదవికి శిల్పా కుటుంబం నుంచి పోటీకి రావటంతో ఉత్కంఠత నెలకొంది.

ఎవరీ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ?

ఈ విషయంలోకి వెళ్లే ముందు నంద్యాల పూర్వాపరాలు పరిశీలిస్తే 2009 ఎన్నికల తర్వాత కాటసాని రాంభూపాల్ రెడ్డిని వరిస్తుంది అనుకొన్న మంత్రి పదవి అనూహ్యంగా శిల్పా మోహన్ రెడ్డిని వరించింది . ఆ తర్వాత వైఎస్సార్ ఆకాలమరణం తరువాతి పరిణామాల్లో శిల్పా మంత్రి పదవి పోవడం జరిగాయి.

వైఎస్ జగన్ పార్టీ పెట్టాక శిల్పా సోదరులు తటస్థంగా ఉండగా అప్పటికి ప్రజారాజ్యంలో ఉన్న భూమా దంపతులు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు . వీరి తర్వాత నంది గ్రూప్ ఆఫ్ కంపెనీస్ యజమాని ఎస్పీవై రెడ్డి కూడా వైసీపీ లో జాయిన్ అయ్యారు . ఎస్పీవై రెడ్డి కి స్వయానా మేనల్లుడే ఈ మల్కిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి.

2014 జనరల్ ఎలెక్షన్స్ కి ముందు జరిగిన మున్సిపల్ ఎలెక్షన్స్ నాటికి శిల్పా సోదరులు తెలుగుదేశంలో చేరగా వైసీపీ తరుపున అన్నీ తానై నడిపాడు రాజ గోపాల్ రెడ్డి. వీరి భార్య వైసీపీ తరుపున కౌన్సిలర్గ్ గా నిలబడ్డారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థి రాజ గోపాల్ రెడ్డి అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో బాగా నడిచింది .తర్వాత అసెంబ్లీ ఎన్నికల నాటికి పార్టీలో జాయిన్ అయ్యిన భూమా దంపతుల్లో ఆళ్లగడ్డ నుండి శోభా నాగిరెడ్డి , నంద్యాల నుండి భూమా నాగిరెడ్డి పోటీ చేశారు.

మొదటి నుంచి ఆళ్లగడ్డలో ఆధిపత్యం ఉన్న భూమా వర్గానికి నంద్యాలలో పెద్దగా పట్టు లేదు . పలు ఎన్నికలలో తన వర్గానికి నంద్యాలలో ప్రాతినిధ్యం కల్పించినా భూమా వర్గీయులెవరూ గెలవలేకపోయారు . ఇందుకు వారి ఫ్యాక్షన్ నేపధ్యమే కారణం అని చెప్తారు . సహజంగా నంద్యాల వివాదరహిత ప్రాంతం అని చెప్పొచ్చు . వ్యాపార,వ్యవసాయ రంగాల్లో ముందుండే నంద్యాల వాసులు ఫ్యాక్షన్ నేపధ్యం నుండి వచ్చిన వారి పట్ల భయంతో వ్యతిరేకంగా ఓటింగ్ చేస్తారని ఓ అభిప్రాయం ఉంది.

అలాంటి నంద్యాలలో 2014 ఎన్నికలలో భూమా గెలవటానికి కారణం కూడా అంతకు ముందు రాజ గోపాల్ రెడ్డి క్షేత్ర స్థాయి నుండి పార్టీ కోసం చేసిన కృషే అని చెప్పొచ్చు . మునిసిపల్ ఎన్నిక ఫలితాలు రాకముందే నంద్యాల ఎంపీ , ఎమ్మెల్యే స్థానాలు వైసీపీ గెలుచుకొంది కానీ రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయింది . ఆ తర్వాత మూడు రోజులకే ఎంపీగా ప్రమాణశ్వీకారం చేయకముందే ఎస్పీవై రెడ్డి పార్టీ ఫిరాయించగా కొద్ది కాలానికే భూమా కూడా వైసీపీ వీడారు . భూమా నాగిరెడ్డి , అఖిల ప్రియల ఫిరాయింపుకు ఆర్ధిక సహాయం , మంత్రి పదవి ఆశ ప్రధాన కారణాలు అని అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోపణలు వచ్చాయి .

భూమా వర్గం పార్టీ ఫిరాయించాక నంద్యాల వైసీపీలో స్తబ్దత నెలకొన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి గడపగడపకి కార్యక్రమం ప్రకటించినప్పుడు అన్నీ తానై నిర్వహించిన రాజ గోపాల్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో మళ్లీ చైతన్యం నింపాడని చెప్పొచ్చు . తదనంతరం భూమా నాగిరెడ్డి ఆకాలమరణం తర్వాత కొంత విమర్శల పాలైన టీడీపీ అఖిల ప్రియకు మంత్రి పదవినిచ్చి భూమా బ్రహ్మానంద రెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది . తనకు టికెట్ రాకపోవటంతో శిల్పా సోదరులు టీడీపీని వీడి వైసీపీకి మారారు.

రాష్ట్ర వ్యాప్తంగా కనీవినీ ఎరగని సంచలనం సృష్టించిన ఎన్నికలుగా ఈ నంద్యాల ఉప ఎన్నికలని చెప్పుకోవచ్చు . నంద్యాలలో టీడీపీ శ్రేణులు మకాం చేసిన సూరజ్ గ్రాండ్ హోటల్ కి మినీ సెక్రటియేట్ అనే పేరొచ్చింది అంటే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ నాయకులు ఎంతమంది అక్కడ మకాం వేశారో ఊహించుకోవచ్చు . పదిమంది మంత్రులు అక్కడే ఉండి పర్యవేక్షించగా దాదాపు సీమలో ఉన్న ప్రతి టీడీపీ ఎమ్మెల్యే , అలాగే నంద్యాలలో తమకు చిన్న పాటి సంభందం ఉన్న కొద్ది ఓట్లు ఉన్న ఇతర ప్రాంత ఎమ్మెల్యేలు దాదాపు 40 మంది ప్రత్యక్షంగా నంద్యాల ఎన్నికల్లో ప్రచారం నిర్వహించగా , రాష్ట్ర చరిత్రలో ఈ నియోజక వర్గానికి పెట్టని ఖర్చు టీడీపీ నాయకత్వం నంద్యాలలో పెట్టింది అని పేరు సంపాదించుకొంది . అలాగే అధికార పార్టీ కావడాన మాకు ఓటేస్తేనే 1500 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతాయనే ప్రచారం కూడా బహిరంగంగా సాగింది.

రాష్ట్రంలో పలు ఉప ఎన్నికల్లో పాల్గొన్న అనుభవం ఉన్న వైసీపీ అధినేత జగన్ కూడా ఎన్నడూ , ఎక్కడా లేని విధంగా నంద్యాలలో 13 రోజులు మకాం వేసి ఎన్నికల ప్రచారం , పర్యవేక్షణ నిర్వహించారు . ఈ పదమూడు రోజులూ జగన్ మకాం చేసింది , ఎన్నికల వ్యూహ ప్రతి వ్యూహాలు నడిపింది మొత్తం ఈ రాజ గోపాల్ రెడ్డి ఇంటి నుండే . అంతిమంగా ఈ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది . నంద్యాల మార్క్ రాజకీయం అనే పేరు కూడా నిలిచింది.ఇదీ మల్కిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి నేపధ్యం .

2019 సాధారణ ఎన్నికల్లో మళ్లీ అడపాదడపా వీరి పేరు వినపడినా శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు రవిచంద్రకి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం , గెలవడం , వైసీపీ అధికారంలోకి రావడం జరిగింది . ఆ తర్వాత జగన్ నమ్మకస్తులు అందరికీ న్యాయం చేసినట్టే రాజ గోపాల్ రెడ్డికీ న్యాయం చేస్తాడని ఎమ్మెల్సీ పదవి లభిస్తుందని ప్రచారం జరిగినా వైసీపీ మండలి రద్దు నిర్ణయం తీసుకోవడంతో ఆ అవకాశం లేకుండా పోయింది.

మున్సిపల్ ఎన్నికల్లో ఎమ్మెల్యే కుటుంబం ఎందుకు పోటీకి దిగింది?

ఎమ్మెల్సీ కాకున్నా ఎదో ఒక ముఖ్యమైన పదవి రాజగోపారెడ్డికి వస్తుందని భావించారు. ఈ పరిధిలో మున్సిపల్ చైర్మన్ అవకాశం వీరిదే అని నిన్నటి వరకూ నంద్యాలలో ప్రచారం జరిగి ఈ రోజు రాజ గోపాల్ రెడ్డి భార్య లలితమ్మ నామినేషన్ వేసిన తర్వాత హఠాత్తుగా ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర భార్య నాగినీ రెడ్డి కూడా నామినేషన్ వేయడంతో ఒక్కసారిగా నంద్యాల ఉలిక్కిపడింది.

సాధారణ వ్యక్తి కౌన్సిలర్ స్థానానికి నామినేషన్ వేయటం ఎవరూ పట్టించుకోరు కానీ ఎమ్మెల్యే భార్య నామినేషన్ వేయటం అంటే ఎన్నికల తర్వాత చైర్మన్ పదవి కోసమే అని ఎవరైనా అంచనా వేస్తారు . ఆ ప్రకారంగా చూస్తే రాజ గోపాల్ రెడ్డి (భార్య) కి చైర్మన్ పదవి దక్కకుండా తాము కైవసం చేసుకోవడానికి ఈ నామినేషన్ వేశారా అనే అనుమానం నంద్యాల రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీ , ఎమ్మెల్యే దగ్గరి బంధువులు ఎవరూ నామినేషన్ వేయొద్దు అని జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా జరిగింది కాబట్టి రాజగోపాల్ రెడ్డికే అవకాశాలు ఉంటాయని వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే ఇప్పటివరకూ వచ్చిన నామినేషన్లు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు విరుద్ధంగా పలు చోట్ల ఎంపీ , ఎమ్మెల్యే దగ్గరి బంధువులు పలువురు నామినేషన్లు దాఖలు చేసి ఉన్నారు . అయితే వీరిలో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు అనుసరించి ఒక్క ధర్మాన కృష్ణదాస్ కుమారుడు మాత్రమే నామినేషన్ విత్ డ్రా చేసుకొన్నాడు.

ఈ పరిణామాలు అన్నీ గమనిస్తే కొన్ని సందేహాలు రాక మానవు . ఇద్దరిలో చైర్మన్ అభ్యర్థి ఎవరు అవుతారు . బీ ఫారం ఇచ్చే అవకాశం ఎమ్మెల్యేలకు అప్పచెప్పిన తరుణంలో లలితమ్మకు బీ ఫారం ఇస్తారా , ఇచ్చినా ఇవ్వకపోయినా కౌన్సిలర్ గా గెలిచాక చైర్మన్ గా అవకాశం ఇస్తారా ? ఎంపీ , ఎమ్మెల్యేల దగ్గరి బంధువులు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయొద్దన్న జగన్ ఆదేశాల్ని పాటించి శిల్పా వర్గం నామినేషన్ ఉపహరించుకొంటుందా? వేచి చూడాలి.ఏదేమైనా ఇలాంటి ఊహించని ఘటనలు , కొన్ని చేరికలతో ఆది నుండీ వైసీపి వెన్నంటి ఉన్న వర్గాల్లో కొంత అసంతృప్తి నెలకొంటుందని చెప్పొచ్చు. జమ్మలమడుగు టీడీపీ నేత రామసుబ్బారెడ్డి వియ్యకుండు కూడా అయినా రాజగోపాల్ రెడ్డి ఆయన్ను వైసీపీలో చేర్చటంలో కీలకంగా వ్యవహరించాడు. ఇలాంటి నేతకే పదవి మీద స్పష్టత లేకుంటే ఇతరుల పరిస్థితి ఏంటని వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది.

2014లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రస్తుతం ఎమ్మెల్యే శిలా రవి భార్య పోటీచేస్తున్న వార్డు నుంచి వైసీపీ తరుపున అనుషారెడ్డి పోటీచేసి టీడీపీ తరుపున పోటీచేసిన శిల్పా అనుచరురాలిని ఓడించటం గమనార్హం. నంద్యాల ఉన్న ఎన్నికలో కూడా ఈ వార్డులో టీడీపీకే  ఆధిక్యం వచ్చింది. ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ధీమాతోనే అదే వార్డు నుంచి తన భార్యను పోటీకి దించాడని చర్చ జరుగుతుంది. రాజగోపాల్ రెడ్డికి పదవి దక్కకుండా చేయటానికే ఎమ్మెల్యే శిల్పా రవి తన భార్యను పోటీకి పెట్టాడని… రాజగోపాల్ రెడ్డి సజ్జల వద్ద పంచాయితీ పెడితే మా ఇద్దరికీ కాకుండా ముస్లిం మైనార్టీ నేతకు ఎవరికైనా ఇవ్వండి అనే ప్రతిపాదన చెయ్యొచ్చన్న ప్రచారం జరుగుతుంది. ఇన్ని అవాంతరాలుదాటి రాజగోపాల్ రెడ్డి చైర్మన్ దక్కించుకుంటాడా?

Show comments